Chandra Babu News: తెలుగుదేశం సీనియర్ నేతల్లో కొందరి భవిష్యత్ నేడు తేలిపోనుంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వారే టిక్కెట్ కన్ఫార్మ్ కాకపోవడంతే వెయిటింగ్ లిస్టులో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారిలో సీనియర్ నేతలు, మాజీమంత్రులు గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasarao), దేవినేని ఉమ(Devineni Uma Maheswara Rao), యరపతినేని శ్రీనివాసరావు(Yarapathineni Srinivadsarao), సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి(Somireddy Chandramohan Reddy) సహా కీలక నేతలు ఉన్నారు. నేడు టీడీపీ రెండో జాబితా వెలువడనుండటంతో...వీరి దారెటో తేలిపోనుంది.
గంట కొట్టేనా..
తెలుగుదేశం(Telugu Desam) సీనియర్ నేత మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasarao) పార్టీ వీడబోతున్నారా..?లేక అధినేత చెప్పినచోటకు వెళ్లి పోటీ చేస్తారా లేదా అన్నది నేడు తేలిపోనుంది. ఉత్తరాంధ్రలో వైసీపీకి బలమైన నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayan)పై చీపురుపల్లిలో గంటా శ్రీనివాసరావును పోటీకి నిలబెట్టాలని తెలుగుదేశం (TDP)అధిష్టానం భావించింది. ఈమేరకు ఆయనకు ముందు నుంచీ చెబుతూ వస్తోంది. కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం తాను కచ్చితంగా ఈసారి తన పాత నియోజకవర్గం భీమిలి(Bheemili) నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టుకుని కూర్చున్నారు. దీంతో తొలి జాబితాలో ఆయన పేరు ప్రకటించలేదు.
అదే రోజు చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన గంటా శ్రీనివాసరావు...తాను భీమిలి నుంచే పోటీలో ఉంటానని తేల్చి చెప్పారు. అయితే నువ్వు ఎక్కడ నుంచైనా గెలవగలిగే సత్తా ఉంది...కాబట్టి ఈసారి బొత్సపై బరిలో దిగాలని చంద్రబాబు సూచించారు.ఈ విషయంపై తనకు ఆలోచించుకోవడానికి సమయం కావాలని చెప్పినట్లు తెలిసింది. అయితే ప్రతి ఎన్నికలకు ముందు తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలో సొంతంగా సర్వే చేయించుకునే గంటా శ్రీనివాసరావు...చీపురుపల్లి(Chepurupalli)లోనూ సర్వే చేయించినట్లు తెలిసింది. అయితే సన్నిహితులు, శ్రేయోభిలాషులు చీపురుపల్లిలో పోటీ వద్దని చెప్పినట్లు సమాచారం. ప్రతి ఎన్నికల్లోనూ కొత్త నియోజకవర్గం వెతుక్కునే గంటా...ఈసారి మాత్రం పాత నియోజకవర్గంలోనే పోటీకి సుముఖత చూపుతున్నారు. అయితే చంద్రబాబు(Chandrababu) మాత్రం బొత్సపైనే పోటీ చేయాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలిసింది. దీంతో ఆయన తన నివాసంలో నేడు అనుచరులతో సమావేశం కానున్నట్లు తెలిసింది. వాళ్లతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉండటంతో...గంటా పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
దేవినేనికి టిక్కెట్ ఉన్నట్లా లేనట్లా...
మరో సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Uma) పరిస్థితి సైతం అటు ఇటుగానే ఉంది. ఆయన సొంత నియోజకవర్గం మైలవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad) వైసీపీ నుంచి తెలుగుదేశం(TDP)లో చేరడంతోపాటు తనకు మైలవరం(Mylavaram) టిక్కెట్టే కావాలంటూ పట్టుబట్టడంతో దేవినేని ఉమ పరిస్థితి ఇరకాటంలో పడింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రకటించని సీట్లు కేవలం నాలుగే ఉన్నాయి. అందులో ఒకటి విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ సీట్లు పొత్తులో భాగంగా జనసేనకు గానీ, బీజేపీకి గానీ వెళ్లొచ్చు. ఇక మిగిలింది మైలవరం, పెనమలూరు మాత్రమే. ఈ రెండు సీట్లలో ఒకటి వసంతకు, రెండోది దేవినేనికి కేటాయించొచ్చనే ప్రచారం సాగింది. అయితే ఇద్దరూ మైలవరమే కావాలని పట్టుబడుతున్నారు. సీనియర్ నేతగా దేవినేని ఎక్కడి నుంచైనా గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ చంద్రబాబు ఉమకు సర్దిచెప్పి పెనమలూరు(Penamalluru) నుంచి పోటీలో దిగాలని సూచించినట్లు తెలిసింది. అయితే పెనమలూరులో మళ్లీ బోడె ప్రసాద్ పేరిట ఐవీఆర్ఎస్(IVRS) సర్వే చేయించడం కలకలం రేపింది. దీంతో ఈసారి దేవినేని టిక్కెట్ లేనట్లేనా అంటూ ఊహగానాలు వినిపిస్తున్నాయి.
యరపతినేని పోటీ ఎక్కడ..?
పల్నాడు జిల్లాలో మరో సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు (Yarapathineni Srinivasarao)పరిస్థితి అంతే ఉంది. ఆయన సొంత నియోజకవర్గం గురజాల నుంచి వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలుగుదేశంలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయనకు గురజాల సీటు ఇచ్చి..యరపతినేనిని నరసరావుపేట నుంచి పోటీ చేయించే యోచనలో పార్టీ ఉంది. అటు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సైతం సీటు ఆశిస్తున్నారు. ఏది ఏమైనా నేడు తెలుగుదేశం అధినే చంద్రబాబు ప్రకటించే మలివిడత జాబితాతో సీనియర్ నేతల భవితవ్యం తేలిపోనుంది.