Revant Cabinet expansion: తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడాదికి దగ్గర పడుతోంది. ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్ని భర్తీ చేయలేదు. ఇవాళ..రేపు అని వాయిదాలు పడుతూనే ఉంది. ఇప్పటికి పది సార్లకుపైగా కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇక విస్తరించడమే మిగిలి ఉందని ప్రచారం జరిగింది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల దీపావళి తర్వాత కేబినెట్‌ను విస్తరిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు దీపావళి కూడా ముగిసింది. ఆశావహులంతా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.
మంత్రివర్గంలో ఆరు ఖాళీలు
తెలంగాణ మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. మంత్రివర్గంలో ఎవరెవర్ని తీసుకోవాలన్న అంశంపై ఇప్పటికే కొన్ని పేర్లను రేవంత్ రెడ్డి హైకమాండ్ కు సమర్పించారు. అయితే ఆశావహులు చాలా ఎక్కవగా ఉండటంతో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. గత డిసెంబర్‌లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆరు ఖాళీలను భర్తీ చేయాలని అనుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లు సంపాదించుకోలేకపోయారు. గతం కన్నా ఎక్కువ సీట్లే సాధించుకున్నా ఎనిమిది స్థానాలకే పరిమితమయ్యారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రాధాన్యతను పెంచవద్దని ఆయన చెప్పిన వారికి కాకుండా ఇతరులకు మంత్రి పదవులు ఇవ్వాలని పలువురు సీనియర్ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారని అందుకే గ్రీన్ సిగ్నల్ రాలేదని చెబుతున్నారు.
ప్రస్తుతం పన్నెండు మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ఆరు ఖాళీలు ఉండటం వల్ల ప్రభుత్వ పనితీరుపై ప్రభావం పడుతోంది. హోంశాఖ, విద్యాశాఖ వంటి వాటికి మంత్రులు లేకపోవడంతో వస్తున్న సమస్యలను అధిగమించడానికైనా త్వరగా పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని రేవంత్ కోరుతున్నారు. అయితే వివిద రకాల సమీకరణాలు కలసి రాకపోవడం వల్ల హైకమాండ్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీపావళి తర్వాత హైకమాండ్‌ను ఒప్పించాలని అనుకుంటున్న రేవంత్.. ఈ మేరకు పండగ అయిపోయిన తర్వాత విస్తరణ ఉంటుందని చెప్పారు. ఇప్పటికే రేవంత్ ఎవరెవరికి పదవులు ఇవ్వాలో ఓ నిర్ణయానికి వచ్చారు. హైకమాండ్ సమీకరణాల్ని చూసుకుని ఓకే చేయడమే మిగిలింది.
కేటీఆర్ అరెస్టు ఖాయమా ? ఆ రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?
మహారాష్ట్ర ఎన్నికలతో ముడిపెడితే మరింత ఆలస్యం
తెలంగాణ పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. హైకమాండ్ కూడా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో బిజీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో అనుమతి ఇవ్వకపోవచ్చని ఎన్నికలు అయిపోయే వరకూ ఉండాలని సూచించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే .. పాలనకు ఏడాది దాటిపోయిన తర్వాత మాత్రమే అవకాశం లభిస్తుంది. రేవంత్ కు పలుకుబడి తగ్గిపోయిందని అందుకే మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వడం లేదని విపక్ష నేతలు చేస్తున్న ప్రచారానికి మరింత బలం సమకూరినట్లవుతుంది.