CM Revanth Reddy Mumbai Visit Tummidi Hatti:   పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో అటకెక్కిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులోని కీలకమైన తుమ్మిడిహట్టి బ్యారేజీని తిరిగి పట్టాలెక్కించేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఆయన సరిహద్దు దౌత్యానికి శ్రీకారం చుట్టారు. బ్యారేజీ నిర్మాణంలో ప్రధాన అడ్డంకిగా మారిన 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం సాధించడమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ముంబై వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశం నిర్వహించారు. . ఏళ్ల తరబడి కొలిక్కిరాని అంతర్రాష్ట్ర జలవివాదాన్ని  పరిష్కరిచేందుకు..ఓ కమిటీని ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్రాలు నిర్ణయించాయి. దీంతో ఓ అడుగు ముందుకు పడినట్లే అనుకోవచ్చు.  అసలు ఏమిటీ తుమ్మిడిహట్టి వివాదం? 

Continues below advertisement

గతంలో ఎస్సారెస్పీ కమాండ్ ఏరియాతో పాటు ఉత్తర తెలంగాణ ఎగువ ప్రాంతాలకు ప్రాణహిత జలాలను మళ్లించేందుకు ఉమ్మడి ఏపీలో 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని సంకల్పించారు. అయితే, 152 మీటర్ల నీటిమట్టం వద్ద తమ రాష్ట్ర భూభాగంలో, ముఖ్యంగా గడ్చిరోలి జిల్లాలోని గిరిజన ప్రాంతాలు , అటవీ భూములు భారీగా ముంపునకు గురవుతాయని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని సాకుగా చూపిస్తూ నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరం వద్దకు తరలించి, రీ-డిజైన్ పేరిట వేల కోట్ల రూపాయల వ్యయాన్ని పెంచేసింది. తుమ్మిడిహట్టి ఎత్తును 148 మీటర్లకు కుదించడం వల్ల ప్రాణహిత నది నుంచి రావాల్సిన సహజసిద్ధమైన గ్రావిటీ నీటి లభ్యత తగ్గడమే కాకుండా, పంపింగ్ భారం తీవ్రంగా పెరిగిందనే విమర్శలు వచ్చాయి.

మహారాష్ట్ర ముంపు భయాలపై క్లారిటీ 

Continues below advertisement

ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ చారిత్రక పొరపాటును దిద్దుబాటు చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మహారాష్ట్రలో ఎదురయ్యే ముంపు భయాలను శాస్త్రీయంగా నివృత్తి చేసేందుకు తెలంగాణ నీటిపారుదల ఇంజనీరింగ్ విభాగం అత్యాధునిక డిజిటల్ ముంపు మ్యాపింగ్‌ను   రూపొందించింది. 152 మీటర్ల ఎత్తు వద్ద నీటిని నిల్వ చేసినప్పటికీ, మహారాష్ట్ర భూభాగంలో ముంపు ప్రభావాన్ని కనీస స్థాయికి పరిమితం చేసేలా ప్రధాన నదీ పరివాహక సరిహద్దుల్లో అత్యాధునిక రక్షణ గోడలు  నిర్మిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దీంతో పాటు, ఈ సవరించిన డిజైన్ ద్వారా ముంపునకు గురయ్యే అతికొద్ది ప్రాంతాల భూములకు సాధారణ నష్టపరిహారం కాకుండా, మహారాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ ధర కంటే మెరుగైన కాంపెన్సేషన్ ప్యాకేజీని నేరుగా చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించడానికి అంగీకరించింది. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్ ముందు ఒక స్పష్టమైన, పారదర్శకమైన ‘ఫిస్కల్ & ఇంజనీరింగ్ మోడల్’ను ఉంచడం ద్వారా పొరుగు రాష్ట్రాన్ని ఒప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. విమర్శలు, వివాదాల కంటే చర్చలు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి   ద్వారానే అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కారమవుతాయన్నది రేవంత్ దౌత్య వ్యూహం.

అధికారుల కమిటీ ద్వారా ఒప్పిస్తే విజయమే 

తుమ్మిడిహట్టి బ్యారేజీని సాధించడం అనేది రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఒక మైలురాయిగా మారనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద పియర్ కుంగిపోవడం, ప్రాజెక్టు భద్రతపై కాగ్, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలు ప్రశ్నలు కురిపిస్తున్న తరుణంలో.. గ్రావిటీ ఆధారంగా నీటిని అందించే తుమ్మిడిహట్టిని పునరుద్ధరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉత్తర తెలంగాణ ప్రజల్లో తిరుగులేని ఇమేజ్ దక్కుతుంది. బీఆర్‌ఎస్ చేసిన  రీ-డిజైన్  వైఫల్యాన్ని ఎత్తిచూపుతూనే, తాము తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే  ఒరిజినల్ ప్రాణహిత  కలను నెరవేర్చామని చెప్పుకోవడానికి కాంగ్రెస్‌కు పక్కా పొలిటికల్ వెపన్ లభిస్తుంది. తుమ్మిడిహట్టి బ్యారేజీ సాధన అనేది కేవలం నీటిపారుదల ప్రాజెక్టు మాత్రమే కాదు, దశాబ్దాలుగా ఆశగా ఎదురుచూస్తున్న ఉత్తర తెలంగాణ రైతాంగ జీవన్మరణ సమస్య. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం గతంలో ప్రాజెక్టులను మార్చేసి బడ్జెట్ పెంచారనే నిందలను చెరిపివేస్తూ, రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ సరిహద్దు దౌత్యం గనుక సఫలమైతే.. తెలంగాణ జల వనరుల చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది. ముంబై భేటీ ఫలితాలు సానుకూలంగా వస్తే, కృష్ణా-గోదావరి జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణకు, ఉత్తర తెలంగాణ సస్యశ్యామలానికి అది మహత్తర బాటలు వేయడం ఖాయం.