Pulivendula Municipality TDP Coalition :  ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల రణరంగంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని కంచుకోటగా భావించే కడప జిల్లా రాజకీయాల్లో అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో సాగిన నామినేషన్ల ఘట్టంలో కూటమి   అభ్యర్థులు ఏకగ్రీవాల పరంపర సాధించడం రాష్ట్రవ్యాప్తంగా   చర్చకు దారితీసింది. ఏకంగా ఆరు మున్సిపాలిటీల్లో అధికార కూటమి చైర్‌పర్సన్ స్థానాలను ఏకగ్రీవంగా చేజిక్కించుకోవడం ఒక ఎత్తయితే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల మున్సిపాలిటీలోని 40 వార్డులకు గానూ సగం స్థానాలను   కూటమి అభ్యర్థులు ఏకగ్రీవం చేసుకోవడం ఈ ఎన్నికల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం.

Continues below advertisement

కడప మేయర్‌తో పాటు మరో రెండు మున్సిపల్ చైర్మన్ స్థానాలకు పోలింగ్ 

ప్రస్తుతం కడప జిల్లావ్యాప్తంగా మెజారిటీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో అధికారికంగా కేవలం జమ్మలమడుగు, పులివెందుల మున్సిపాలిటీల చైర్‌పర్సన్ పీఠాలకు, అలాగే కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి మాత్రమే పోలింగ్ ప్రక్రియ సాగాల్సి ఉంది. ప్రొద్దుటూరు, బద్వేలు, కమలాపురం, ఎర్రగుంట్ల, మైదుకూరు వంటి ప్రాంతాల్లో కూటమి సాధించిన ఈ ఏకపక్ష  ఏకగ్రీవ విజయాలు  రాజకీయ సమీకరణలను మార్చివేశాయి. అయితే, ఈ పరిణామాలను చూపుతూ కడప గడ్డపై వైఎస్సార్‌సీపీ పునాదులు పూర్తిగా కదిలిపోయాయని, జగన్ మోహన్ రెడ్డి తన సొంత జిల్లాపై పట్టు కోల్పోయారని నిర్ధారణకు రావడం రాజకీయ విశ్లేషణాత్మక కోణంలో తొందరపాటు ముగింపే అవుతుంది.

Continues below advertisement

ఏకగ్రీవాలు ప్రజాభిప్రాయం కాదు! 

ఎందుకంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో నమోదయ్యే  ఏకగ్రీవాలు ఎప్పుడూ ప్రజాభిప్రాయానికి   లేదా ప్రజల నిజమైన అంతరంగానికి స్వచ్ఛందమైన ప్రతిరూపాలు కాజాలవు. ప్రత్యక్షంగా ఓటింగ్ జరిగి, ఓటరు రహస్య బ్యాలెట్ ద్వారా స్వేచ్ఛగా తన తీర్పును వెలువరించినప్పుడు మాత్రమే ఒక పార్టీకి ఉన్న నిజమైన ప్రజామోదం లేదా ప్రజా వ్యతిరేకత స్పష్టమవుతుంది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపు క్షేత్రస్థాయి యంత్రాంగం, స్థానిక నాయకత్వాలు, ఆధిపత్య వర్గాలు మొగ్గుచూపడం.. ప్రత్యర్థి వర్గాలను నామినేషన్ల ఉపసంహరణ వైపు నెట్టడం అనేది తెలుగు రాష్ట్రాల స్థానిక ఎన్నికల చరిత్రలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక సాంప్రదాయ రాజకీయ వ్యూహం మాత్రమే.

గతంలో వైసీపీ కూడా ఇలాగే గెలిచింది!

గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రవ్యాప్తంగా వేలాది స్థానిక స్థానాలను, ఏకంగా మున్సిపాలిటీలను ఏకగ్రీవం చేసుకున్న ఉదాహరణలు ఉన్నాయి. ఆ సమయంలో కూడా ప్రత్యర్థులు పోటీ చేయలేకపోవడమో లేదా నామినేషన్లు తిరస్కరణకు గురికావడమో జరిగింది తప్ప, అది వంద శాతం ప్రజల స్వేచ్ఛాత్మక తీర్పు కాదని అప్పట్లోనూ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అధికారం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా అదే రకమైన వ్యూహాత్మక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రత్యర్థి పార్టీ శ్రేణుల్లో ఉన్న నైరాశ్యం, భద్రతాపరమైన సందేహాలు, అధికార పక్షం కల్పించే రాజకీయ ఒత్తిళ్లు కలగలసి నామినేషన్లు వేయకపోవడానికి లేదా వెనక్కి తగ్గడానికి ప్రధాన కారణాలుగా మారుతుంటాయి.

స్థానిక ఎన్నికలు ప్రజాభిప్రాయం కాదు! 

కడప జిల్లాలోని రాయలసీమ రాజకీయ సంస్కృతిని గమనిస్తే.. ఇక్కడ అధికారం ఎవరి వద్ద ఉంటే అక్కడ స్థానిక కాంట్రాక్టర్లు, అభ్యర్థులు, , ద్వితీయ శ్రేణి నాయకులు సులువుగా సరేనంటూ మద్దతు ప్రకటించడం లేదా తప్పుకోవడం సర్వసాధారణం. అలాంటప్పుడు ఓటర్లు పోలింగ్ బూత్ దాకా రాకుండా, ఓటు హక్కు వినియోగించుకోకుండా ముగిసిన ఈ ఏకగ్రీవాలను జగన్ లేదా వైసీపీ   పూర్తి స్థాయి  పతనానికి సంకేతంగా చిత్రీకరించడం సమంజసం కాదు. ప్రజలు స్వచ్ఛందంగా లైన్లలో నిలబడి, ఓటేసి వైసీపీని తిరస్కరించిన రోజు మాత్రమే ఆ పార్టీ బలహీనపడిందని చెప్పడానికి నిజమైన రాజకీయ ప్రాతిపదిక లభిస్తుంది. ప్రస్తుతం కడప జిల్లాలో సాధించిన ఏకగ్రీవాలు కూటమి ప్రభుత్వానికి అధికారికంగా నంబర్ల బలాన్ని, మేయర్/చైర్మన్ పీఠాలను అందించవచ్చు. ఇది కూటమి వ్యూహాత్మక విజయమే అనడంలో సందేహం లేదు. కానీ, రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో లేదా స్వేచ్ఛగా జరిగే పోలింగ్ ఘట్టాల్లో ప్రజా తీర్పు ఎలా ఉంటుందనేది స్థానిక ఏకగ్రీవాల సంఖ్యను బట్టి మాత్రమే అంచనా వేయడం సాధ్యం కాదు. కడప కోటలో వైఎస్సార్‌సీపీ నిజమైన సత్తా ఏమిటనేది ప్రత్యక్షంగా పోలింగ్ జరిగే జమ్మలమడుగు, పులివెందుల, కడప కార్పొరేషన్ ఓటింగ్ సరళిలోనే బయటపడనుంది.