Revanth and Land Auctions: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కోకాపేట నియోపొలిస్ స్థలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం వేలం వేసినప్పుడు వ్యతిరేకించారు. బావి అవసరాలకు స్థలాలు ఉంచకుండా ఇష్టం వచ్చినట్లుగా వేలం వేయడం ఏమిటని ఆదోళనలు చేశారు. హైకోర్టుకు కూడా వెళ్లారు. తాము వచ్చాక ల్యాండ్ ఆక్షన్స్ రద్దు చేస్తామని కూడా హెచ్చరించారు. కానీ సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన భూముల వేలం మరింత ఊపందుకుంది. ప్రభుత్వానికి అసరమైన నిధులు భూముల ద్వారానే వస్తాయని అనుకుంటున్నారు.
భూముల వేలం, హై రైజ్ భవనాలకు అనుమతులపై గతంలో రేవంత్ వ్యతిరేకత
తెలంగాణలో అత్యంత ఖరీదైన భూముల్ని వేలం వేయకూడదన్నది రేవంత్రెడ్డి పాలసీ.కానీ అది ప్రతిపక్ష నేతగా ఉన్నపుడే. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు అమ్ముతోందని..ఆ భూముల్లో హైరైజ్ భవనాలకు అనుమతులు ఇచ్చి అధికార దుర్వినియోగం, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘన చేస్తోందని తీవ్రంగా విమర్శించేవారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్.. అంటే.. అపార్టుమెంట్లు ఎంన్ని అంతస్తులు ఉండాలన్నదానిపై నియంత్రణ లేకపోవడంపైనా రేవంత్ విమర్శలు గుపపించేవారు. హైరైజ్ అపార్ట్‌మెంట్లు "పర్యావరణ వ్యవస్థ , మౌలిక సదుపాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి." అనే అభిప్రాయంతో ఉండేవారు. "3,000 చదరపు గజాల టవర్‌లో 500 కార్లు, 1,000 బైక్‌లు ఉంటాయి. ఇవన్నీ రోడ్లపైకి వస్తే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌కు ఏమవుతుంది?" అని ఓ టీవీ చానల్ తో చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విరుద్ధంగా నిర్ణయాలు
సాధారణంగా ముఖ్యమంత్రి కాక ముందు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలపై అవగాహన ఉన్న వారు.. భూముల అమ్మకాన్ని పరిమితం చేస్తారని.. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పరిమితులు పెట్టి హైరైజ్‌లపై పరిమితులు విధిస్తారని అనుకున్నారు. కొన్నాళ్లు హై రైజ్‌లకు అనుమతులు ఇవ్వకపోవడంతో అదే జరుగుతుందని అనుకున్నారు.కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. భూముల వేలం చురుగ్గా సాగుతోంది. అత్యధిక ఫ్లోర్లు ఉన్న అపార్టుమెంట్లకు అనుమతులు ఇస్తున్నారు. రాయదుర్గంలో భూమల వేలంలో ఎకరానికి రూ. 177కోట్ల చొప్పున వచ్చాయి.గతంలో నియోపొలిస్‌లో రూ. వంద కోట్లకు అమ్ముడు అయితే రేవంత్ విమర్శలు చేశారు. కానీ ఇలా అమ్ముడు కావడం రికార్డు అని కాంగ్రెస్ ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
రాయదుర్గంలో మరో పాతిక ఎకరాల వేలానికి సిద్ధం !
రాయదుర్గంలో లభించిన ఆదాయంతో తెలంగాణ ప్రభుత్వం మరింత ఉత్సాహంగా ఇతర భూమలను వేలం వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అత్యంత ఖరీదైన భూములుగా మారిన కోకాపేట నియోపొలిస్ ప్రాంతంలో ఉన్న 25 ఎకరాలను వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ వేలం ద్వారా ప్రభుత్వ ఖజనాకు సుమారు రూ.3,000 కోట్ల ఆదాయం సమకూర్చాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో గత ప్రభుత్వం రెండు దశల్లో ఇక్కడి భూములను వేలం వేసింది. అప్పట్లో రూ.5,300 కోట్లు వచ్చాయి. ఈ వేలం ఫేజ్-3గా జరగనుంది. నవంబర్ మొదటి వారంలో లేదా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత HMDA నోటిఫికేషన్ జారీ చేయనుంది. అనుకున్న ప్రకారం జరిగితే, నవంబర్ చివరి వారంలో ఈ-వేలం ప్రక్రియ పూర్తవుతుంది. కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ వేలం విషయంలో రేగిన దుమార సంగతి అందరికీ తెలుసు.
హై రైజ్ భవనాలకు అనుమతులతో భారీ ఆదాయం అని ప్రచారం మరో వైపు చాలా కొద్ది ప్రదేశంలో అత్యంత ఎత్తున నిర్మించే ఆకాశహర్య్మాలకు గత ప్రభుత్వంలో కంటే ఎక్కువగా అనుమతులు ఇస్తున్నారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం, ఎకరానికి 30 నుంచి 100 నివాస యూనిట్లు మాత్రమే అనుమతించవచ్చు. మహానగరాల్లో 200 వరకు అనుమతిస్తారు. కానీ హైదరాబాద్‌లో ఏడున్నర ఎకరాల్లో 3,500 యూనిట్లు నిర్మిస్తున్నారు. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నియోపోలిస్ ప్రాంతాల్లో ఒక కిలోమీటరులో 60కి పైగా టవర్లు నిర్మిస్తున్నారు.ఇందులో వేల కొద్దీ ప్లాట్లు ఉంటున్నాయి. ఈ కారణంగా ట్రాఫిక్ ఉదయం, సాయంత్రం 2-3 కిలోమీటర్ల దూరానికి అరగంట నుంచి గంట సమయం పడుతోంది. తాగునీరు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలపై విపరీత ఒత్తిడి పెరిగిందన్న నివేదికలు ఉన్నాయి. అయితే అత్యధిక ఆదాయం వస్తోందని ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటోంది.
భూముల వేలం వేస్తే తప్ప ప్రభుత్వం నడవదా?
ఇటీవలి కాలంలో హెచ్‌ఎండీతో పాటు, తెలంగాణ హౌసింగ్ బోర్డు ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ వేలం వేసేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల అత్యశకుపోయి అత్యధిక ధర నిర్ణయించడంతో ఒక్క ప్లాట్ కూడా అమ్ముడుకాని సందర్భాలు ఉన్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటే.. భూముల అమ్మకం తప్పదని.. హై రైజ్ భవనాలను ప్రోత్సహించక తప్పదని అనుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి అధికారంలోకి రాక ముందు చెప్పిన మాటలకు..ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలకు పొంతన లేకపోవడం ప్రజల్ని ఆశ్చర్య పరుస్తోంది.