బీజేపీ, టీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉంటే అంతే.. వారితో సంబంధాలు పెట్టున్న వాళ్లను గెట్ అవుట్ అనేస్తామని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. వరంగల్‌లో జరిగిన రైతు సంఘర్షణ సభలో పార్టీలో జరుగుతున్న ప్రచారంపై సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ రాహుల్ గాంధీకి ఎందుకు కోపం వచ్చింది..? ఇంతకీ ఏ లీడర్లకు ఈ వార్నింగ్ అంటూ చర్చించుకుంటున్నారు.
వరంగల్ సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని జిల్లాలో చర్చగా మారాయి. ‘బీజేపీ, టీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉంటే పార్టీకి రాజీనామా చేసి వాళ్ల కండువా కప్పుకోవచ్చని చెప్పేశారు రాహుల్. వాళ్లు వెళ్లకపోతే వెళ్లగొడతామన్నారు. అలాంటి వాళ్లు తమకు అవసరం లేదంటున్నారు రాహుల్ గాంధీ. పరుషంగా చేసిన ఈ కామెంట్స్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో డిబేట్‌గా మారాయి. పార్టీలో ఉంటూ ద్రోహం చేస్తున్న ఆ వ్యక్తులు ఎవరనేది మాట్లాడుకుంటున్నారు నేతలు.
రాజకీయంగా పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఓ ముందడుగు వేసింది. అయితే తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆ పార్టీకి ఇక్కడ ప్రజలు పట్టం కడతారని భావించినప్పటికీ రెండు సార్లు ప్రతిపక్షానికే పరిమితం చేశారు. మూడోసారి ఎలాగైనా ప్రజలను ఒప్పించాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఎలాగైనా పాగా వేయాలని దూకుడు పెంచుతుంది.
ఓటు బ్యాంకు పరంగా తెలంగాణలో పటిష్టంగా ఉనప్పటికీ టీఆర్‌ఎస్ రాజకీయ వ్యూహాలకు ప్రతివ్యూహాలు వేయడంలో చతికిలపడుతోంది. అయితే ఈ దఫా ఎలాగైనా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా పోకస్ పెట్టింది. రాష్ట్ర కీలక నేతలను దిల్లీకి పిలిపించి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది.
క్షేత్రస్థాయి రిపోర్టులు తెప్పించుకుంది. ప్రజల్లో కాస్త బలం ఉన్నప్పటికీ నేతల మధ్య సమన్వయ లోపం, ఐక్యత లేదని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. అందుకే వరంగల్ సభకు వచ్చిన రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలోనూ రాష్ట్రంలోనూ సంచలనం సృష్టిస్తున్నాయి.
ఇంతకీ టీఆర్‌ఎస్, బీజేపీలతో టచ్‌లో ఉందెవ్వరు..?
‘కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు ఓడించరు.. ఆ పార్టీలో ఉన్న వారే ఓటమికి కారణమవుతారు..’ ఈ విషయం తెలంగాణలో బాగా ప్రచారంలో ఉంది. బలమైన ఓటు బ్యాంకు ఉండి.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా సెంటిమెంట్ కలిసోచ్చే విషయం ఉనప్పటికీ పార్టీ మాత్రం గాడిలో పడటం లేదు. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని తమకు అనుకూలంగా మార్చుకోకపోతుండగా ఇంటిపోరుతో సతమతం అవుతుంది. ఈ పరిస్థితిలో కొందరు పార్టీ లీడర్లు టీఆర్‌ఎస్, బీజేపీతో టచ్‌లో ఉన్నారనే విషయం తెలుసుకున్న రాహుల్... వాళ్లను హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇంతకు ఎవరెవ్వరు టీఆర్‌ఎస్, బీజేపీలతో టచ్‌లో ఉండి పార్టీకి ద్రోహం చేస్తున్నారనే విషయంపై అంతా మాట్లాడుకుంటున్నారు.
సొంత గూటిని చక్కదిద్దే ప్రయత్నమేనా..?
కాంగ్రెస్ పార్టీపై ఇతర పార్టీ నేతల ఆరోపణల కంటే సొంత పార్టీ నేతల వ్యవహరశైలి ఆ పార్టీకి శాపంగా మారుతుంది. 2004 ఎన్నికలకు ముందు రెండు సార్లు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో ఓటమి పాలైన తర్వాత హస్తిన నేతలు తీసుకున్న కఠిన నిర్ణయాలు, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలోనే అందరు కలిసి వెళ్లాలని చెప్పిన తీరుతో 2004, 2009 ఎన్నికలోనూ విజయం సాధించింది. ఆ తర్వాత పార్టీపై సరైన దృష్టి పెట్టకపోవడం, గల్లీ నుంచి దిల్లీ స్థాయి వరకు నేతలు ఇష్టారీతిన వ్యవహరించడంతో పార్టీ నష్టపోయింది.
అలాంటి వాటికి ఛాన్స్ ఇవ్వకూడదనుకున్నారేమో క్రమశిక్షణపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రజల్లో తమకు ఉన్న బలంతో అవసరమైతే కొత్తగా వచ్చే నాయకులను ప్రోత్సహించాలే తప్ప పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం చేసే వారిపై ఉపేక్షించే పనిలేదనేది రాహుల్ చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అధికారంలోకి వచ్చేందుకు ముందుగా సొంత గూటిని చక్కదిద్దే పనిలో పడినట్లు తెలుస్తోంది. అవరసరమైతే కఠిన నిర్ణయాలకు వెనుకాడబోమని రాహుల్ సంకేతాలు ఇచ్చారు. తెలంగాణలో ఎన్నికలకు ఏడాది కాలం ఉండటంతో ఆ పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయి ఇక్కడ పాగా వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.