Pulivendula ZPTC by election turns interesting: ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికరమైన ఉపఎన్నిక జరుగుతోంది. అవడానికి స్థానిక సంస్థల ఉపఎన్నికలే అయినా కొన్ని స్థానాలకు ఎన్నికలు ఉత్కంఠగా జరగనున్నాయి. ఈ స్థానాల్లో జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల కూడా ఉంది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో పులివెందుల మండల జడ్పీటీసీ స్థానానికి కూడా ఉపఎన్నిక జరుగుతోంది. కడప జిల్లాలోని ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి కూడా పోటీ జరుగుతోంది. రెండు స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు.
2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జడ్పీ చైర్మన్ స్థానాల్లో దాదాపుగా అన్నీ ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 52 స్థానాలు ఉంటే.. 49 జడ్పీ స్థానాల్లో అభ్యర్థులు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. అధికారాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మాత్రం అందరూ స్వేచ్చగా పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు. తెలుగుదేశం పార్టీ తరపున నియోజకవర్గ ఇంచార్జ్ బీటెక్ రవి సతీమణి లతా రెడ్డి పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున గతంలో జడ్పీటీసీగా ఉండి చనిపోయిన లీడర్ సతీమణికి టిక్కెట్ ఇచ్చారు. ప్రధానంగా ఇద్దరు మిహళా నేతల మధ్య పోటీ జరుగుతోంది.
పులివెందుల నియోజకవర్గం వైసీపీ అధినేత జగన్ కుటుంబానికి కంచుకోట. దశాబ్దాలుగా అక్కడ వారికి తిరుగులేని విజయాలు వస్తున్నాయి. పులివెందుల మండలంలో టీడీపీ మెజార్టీ సాధించినది ఎప్పుడో కూడా చెప్పలేరు. మండలంలో మొత్తం పది వేలకుపైగా ఓట్లు ఉన్నాయి. ఇందులో అత్యధికం వైఎస్ కుటుంబానికి అనుకూలంగా ఉంటాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు వేల ఓట్లు వైసీపీ అభ్యర్థి జగన్ కు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి మూడు వేల ఓట్లు వచ్చాయి. వైసీపీకి.. వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటి ఈ మండలంలో ఈ సారి విజయం సాధించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది.
కూటమి తరపున విజయం సాధించి పెట్టే బాధ్యతలను ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ తీసుకున్నారు. వారు గ్రామాల వారిగా పార్టీలతో సంబందం లేకుండా.. ప్రజల్ని మొబిలైజ్ చేసి.. టీడీపీని గెలిపిస్తే కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. అదే సమయంలో వైఎస్ కుటుంబంలో వచ్చిన వివాదాలు కూడా వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి. కాంగ్రెస్ తరపున షర్మిల అనుచరుడు పోటీ చేస్తున్నారు. వైఎస్ కుటుంబంలో చీలకలు ఇప్పటికే వచ్చాయి. ఈ కారణంగా వైసీపీ ఓటు బ్యాంక్ కూడా చీలిపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని విజయం సాధించి జగన్‌కు షాకివ్వాలని టీడీపీ ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం జరుగుతోంది జడ్పీటీసీ ఉపఎన్నిక మాత్రమే. మరొక్క ఏడాది మాత్రమే పదవి కాలం ఉంటుంది. అయినా రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికల ఫలితం ఆసక్తికరంగా మారుతోంది.