Whose side are the people on in the Puducherry elections: పుదుచ్చేరి రాజకీయాల్లో ఇప్పుడు ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రధాన పార్టీల మధ్య ముక్కోణపు పోరు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీ కూటమి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. ముఖ్యమంత్రి రంగసామి తనదైన శైలిలో సంక్షేమ పథకాలను నమ్ముకోగా, బీజేపీ తన ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో అభివృద్ధి మంత్రాన్ని జపిస్తోంది. అయితే, పాలనలో అవినీతి ఆరోపణలు, నిరుద్యోగం వంటి అంశాలు ప్రభుత్వానికి కొంత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్-డీఎంకే కూటమిలో కుమ్ములాటలు
ప్రతిపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్, డీఎంకే మధ్య సీట్ల సర్దుబాటు మరియు నాయకత్వం విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. తమిళనాడు తరహాలో ఇక్కడ కూడా డీఎంకే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూడటం కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడటం లేదు. ఇప్పటికే సీపీఐ ఏకపక్షంగా తన ప్రచారాన్ని ప్రారంభించడం కూటమిలో సమన్వయ లోపాన్ని సూచిస్తోంది. ఈ విభేదాలు అధికార పక్షానికి కలిసొచ్చే అంశంగా మారాయి.
విజయ్ టీవీకే ఎంట్రీ అసలు సిసలు ట్విస్ట్
తమిళ సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పుదుచ్చేరి రాజకీయాల్లో డార్క్ హార్స్ గా మారుతోంది. గతేడాది డిసెంబర్‌లో పుదుచ్చేరిలో విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు వచ్చిన జనాన్ని చూసి పాత తరం పార్టీలు ఖంగుతిన్నాయి. యువత , మహిళా ఓటర్లను టీవీకే విపరీతంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా పుదుచ్చేరికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సాధిస్తామన్న విజయ్ హామీ స్థానిక ప్రజల్లో బలమైన ముద్ర వేసింది. డీఎంకే, ఏఐఏడీఎంకేలను విజయ్ టార్గెట్ చేయడం కలసి వస్తోంది.
ఎవరికి ఎడ్జ్ ఉంది?
ప్రస్తుతానికి అధికార AINRC-BJP కూటమికి కొంత పైచేయి ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, టీవీకే చీల్చే ఓట్లు ఎవరి కొంపముంచుతాయో అన్న భయం అన్ని పార్టీల్లో ఉంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన స్థానాల్లో ఈ సారి టీవీకే కీలకం కానుంది. టీవీకే గెలిచే స్థానాల కంటే, ఇతర పార్టీల గెలుపోటములను శాసించే స్థాయికి చేరుకుంది. దీనివల్ల ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే విజయ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు కూడా కొట్టిపారేయలేరని అంచనా వేస్తున్నారు. పుదుచ్చేరి ఓటర్లు ఎప్పుడూ విభిన్నమైన తీర్పు ఇస్తుంటారు. ఒకవైపు రంగసామి వ్యక్తిగత ఇమేజ్, మరోవైపు కాంగ్రెస్ పాత క్యాడర్, ఇంకోవైపు విజయ్ కొత్త క్రేజ్ మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఏప్రిల్-మేలో జరగబోయే ఈ ఎన్నికల్లో మార్పు కోరుకునే యువత టీవీకే వైపు మొగ్గితే పుదుచ్చేరి రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది.