Telangana MLC Elections 2025: తెలంగాణలో ఈ మధ్య జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండింటిని బీజేపీ కైవశం చేసుకోవడంతో ఆ పార్టీలో కొత్త జోష్ నింపింది. ఉమ్మడి కరీంనగర్‌- ఆదిలాబాద్‌- నిజామాబాద్‌- మెదక్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, ఇక్కడి టీచర్స్‌ సీటు కూడా బీజేపీలో ఖాతాలో పడింది. బిజెపి అభ్యర్థులుగా మల్క కొమరయ్య, చిన్నమైల్‌ అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. అంతేకాదు ఉమ్మడి వరంగల్- నల్గొండ- ఖమ్మం టీచర్ నియోజకవర్గంలో విజయం సాధించిన పిఆర్టియు టీఎస్ అభ్యర్థి ఎంగిలి శ్రీపాల్ రెడ్డికి కూడా బీజేపీ మద్దతు ప్రకటించింది. మొత్తానికి మూడు ఎన్నికల్లో బీజేపీ పై చేయి సాధించిందని చెప్పవచ్చు. 

మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో కచ్చితంగా గెలవాలని చెప్పి కాంగ్రెస్ తీవ్రంగా శ్రమించింది. ఇందులో ఒకటి సిట్టింగ్ స్థానం కావడంతో మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ప్రచారం చేశారు. అయిన పరాభవం తప్పలేదు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ సొంత జిల్లా నిజామాబాద్‌లో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు పడలేదని అంటున్నారు. అధికారంలో ఉండి కూడా మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.  

అదే టైంలో బీజేపీకి నేతలకు కొత్త ఉత్సాహం ఇచ్చింది. భవిష్యత్ మాదే అని ప్రచారం చేస్తున్నట్టుగానే ప్రజలు తీర్పు ఇవ్వడం వారి వ్యూహాలకు మరింత పదును పెట్టనున్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. బీజేపీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చిన ప్రజలకు మోదీ కృతజ్ఞత తెలిపారు. ఎన్నికల్లో కష్టపడిన పార్టీ శ్రేణులను అభినందించారు. "MLC ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కొత్తగా ఎన్నికైన మా అభ్యర్థులకు అభినందనలు. శ్రద్ధతో ప్రజల మధ్య ఉంటూ ఎంతో అభ్యర్థుల విజయానికి శ్రమించిన మా పార్టీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నాను." అని ట్వీట్ చేశారు. 

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల ఫలితాలు రెండు రోజుల క్రితమే వచ్చేశాయి. రాత్రి మూడో స్థానం ఫలితం వచ్చింది. ఉమ్మడి కరీంనగర్‌- ఆదిలాబాద్‌- నిజామాబాద్‌- మెదక్‌ జిల్లాల పట్టభద్రుల స్థానం ఫలితాన్ని అర్థరాత్రి ప్రకటించారు. బీజేపీ తరఫున పోటీ చేససిన చిన్నమైల్‌ అంజిరెడ్డి విజయం సాధించినట్టు వెల్లడించారు.  కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డిపై 5,106 ఓట్ల తేడాతో విక్టరీ కొట్టారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాగుతున్న లెక్కింపు ప్రక్రియ బుధవారం రాత్రి 9 గంటలకు ముగిసింది. ఈ స్థానం కోసం మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.  

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరకు రెండో ప్రాధాన్యత ఓట్లతో విజేతను నిర్ణయించారు. బీజేపీ అభ్యర్థికి 98,637 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి 93,531 ఓట్లు వచ్చాయి. 28,686 ఓట్లు చెల్లకుండా పోయాయి. మొత్తం 11 రౌండ్లలో లెక్కింపు జరిగింది. ఉమ్మడి కరీంనగర్‌- ఆదిలాబాద్‌- నిజామాబాద్‌- మెదక్‌ జిల్లాల ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్‌కు సిట్టింగ్ స్థానం. ఉత్తర తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ బీజేపీ గెలుచుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు.