Modi In Ramagundam : సింగరేణిని ప్రైవేటు పరం చేస్తామంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్ని ప్రధాని మోదీ ఖండించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయబోమని.. అలాంటి ప్రచారం శుద్ద అబద్దమని స్పష్టం చేశారు. రామగుండంలో ఆర్ఎఫ్సీఎల్‌ను జాతికి అంకితం చేసిన తర్వాత మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా సింగేరేణి ప్రైవేటీకరణ అంశంపై స్పష్టత ఇచ్చారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి 49 శాతమేనని.. సింగరేణిని ప్రైవేటు పరం చేసే అధికారం రాష్ట్రం చేతుల్లోనే ఉందన్నారు. సింగరేణిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలన్నారు., మెజార్టీ వాటా రాష్ట్రానిదైతే కేంద్రం ఎలా విక్రయిస్తుందని ప్రశ్నించారు. కేంద్రం వాటా కూడా విక్రయించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ రోజు హైదరాబాద్ నుంచి సింగరేణి ప్రైవేటీకరణపై మాట్లాడుతున్న వారికి నిద్రపట్టదని ఎద్దేవా చేశారు.
రామగుండం ఫ్యాక్టరీతో ఎరువుల కొరత తీరిందన్న ప్రధాని
మోదీ తెలుగులో స్పీచ్‌ను మొదలు పెట్టారు. తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో 70 నియోజకవర్గాల్లోని రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని.. వారందరికీ స్వాగతం అంటూ అభినందనలు తెలిపారు. రామగుండం ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి ఇప్పుడు జాతికి అంకితం చేశామన్నారు. లక్ష్యాలు పెద్దగా ఉన్నప్పుడు సరికొత్త పద్ధతులను అవలంబించాలని మోడీ అన్నారు. కొత్త వ్యవస్థను రూపొందించాలని.. దేశ ఫర్టిలైజర్ రంగం దీనికి ఒక ఉదాహరణ అని చెప్పారు. మన దేశం ఎరువుల కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడిందని.. యూరియా కోసం ఉన్న పరిశ్రమల్లో టెక్నాలజీ పాతవి అవ్వడం వల్ల మూతపడ్డాయన్నారు. అందులో ఒకటి రామగుండం అని చెప్పారు. ఎరువుల కొరతతో రైతులు క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చేదన్నారు. 2014లో 100 శాతం అక్రమ రవాణాను కేంద్ర ప్రభుత్వం ఆపగలిగిందని గుర్తు చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు బలోపేతం అవుతోందన్న మోదీ
రెండున్నర సంవత్సరాలుగా ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోందని... కొన్ని చోట్ల యుద్ధాల వల్ల ఆ ప్రభావం మన దేశంపైనా పడుతోందన్నారు. కానీ ఇటువంటి విపత్కర పరిస్థితలు మధ్య కూడా ఇంకో విషయం ప్రముఖంగా వినిపిస్తోందన్నారు. భారత్ త్వరలో మూడో ఆర్థిక వ్యవస్థ అవుతుందని నిపుణులు అంటున్నారని చెప్పారు. 1990 తర్వాత ఈ 30 ఏళ్లలో జరిగిన వృద్ధి ఇప్పుడు కొన్ని సంవత్సరాల్లోనే అవుతుందని నిపుణులు అంటున్నారని తెలిపారు.
ఫ్యాక్టరీని పరిశీలించి జాతికి అంకితం చేసిన ప్రధాని
అంతకు ముందు రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ కర్మాగారాన్ని ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్లాంట్‌ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. తెలంగాణతో పాటు..దక్షిణాది రాష్ట్రాల్లో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ కర్మాగారం ద్వారా ఎరువుల కొరత తీరనుంది. ప్రస్తుతం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో రోజుకు 2200 టన్నుల అమోనియా.. 3850 టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తున్నారు.