Prakash Raj once again criticized Pawan Kalyan political policies: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రాజకీయ విధానాలపై ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు చేశారు. వయనాడ్ లిటరేచర్ ఫెస్టివల్ లో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ ఐడియాలజీని తప్పు పట్టారు. చేగువేరా, పెరియార్, గద్దర్‌లను పవన్ కల్యాణ్ పొగుడుతారని.. వారి భావజాలం తనకు నచ్చుతుందని చెబుతారని.. కానీ ఆయన బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. ఆయన అభిమానించేవారి భావజాలానికి బీజేపీ భావజాలానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ సనాతన ధర్మం ప్రమాదంలో పడిందని అంటున్నారని.. ప్రమాదంలో పడింది బీజేపీ వాదమేనని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్ గతంలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం బయటపడినప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడారు. అప్పట్లోనే ప్రకాష్ రాజ్ . పవన్ తో ట్వీట్ వార్ పెట్టుకున్నారు. వరుసగా ట్వీట్లు చేశారు. తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు సందర్భం లేకపోయినా పవన్ కల్యాణ్ అంశాన్ని వేరే రాష్ట్రంలో ప్రస్తావించి విమర్శలు చేశారు. దీంతో ప్రకాష్ రాజ్ పై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. మరో వైపు అసలు బీజేపీతో కలిసి పని చేయడం.. పవన్ చెబుతున్న భావజాలానికి వ్యతిరేకం అన్నట్లుగా ఉండటంతో బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్నారు.
పవన్ కల్యాణ్ ఓ రాజకీయ నాయకుడు అని కుల మతాలకు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాలను ఆయన వెల్లడించే హక్కు ఉందని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. పెరియార్ సమాజంలో ఉన్న అసమానతలపై పోరాడారని.. అలా పోరాడటాన్ని సమర్థించడాన్ని, బీజేపీ జాతీయవాదాన్ని సమర్థించడాన్ని కరెక్ట్ కాదని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. అది రాజకీయ అవకాశ వాదం కాదని స్పష్టం చేశారు. రాజకీయాలు అంటే సినిమా స్క్రిప్ట్ కాదని నటనకే పరిమితం కావాలని సలహాలిచ్చారు.
ప్రకాష్ రాజ్ రాజకీయాల్లో లేరు. కానీ ఆయన కొన్ని పార్టీలకు సన్నిహితంగా ఉంటారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో.. తమిళనాడుతో డీఎంకే పార్టీలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయా పార్టీలకు మద్దతుగా మాట్లాడుతూంటారు. బీజేపీతో పాటు బీజేపీతో కలిసి ఉండే పార్టీలను టార్గెట్ చేస్తూంటారు. ఆయన రాజకీయాలు అన్నీ పార్ట్ టైమే.. సినిమాలకే ప్రయారిటీ ఇస్తూంటారు. ఓ సారి బెంగళూరు సౌత్ నుంచి పోటీ చేసి.. డిపాజిట్ కోల్పోయారు.