PM Modi for Bengal: పార్ల‌మెంటు(Parliament) ఎన్నిక‌ల(Elections) నేప‌థ్యంలో ప్రధాని మోదీ వేస్తున్న ప్ర‌తి అడుగు కూడా.. చాలా కీల‌కంగా మారింది. మార్చి 6న ప్ర‌ధాన మంత్రి ప‌శ్చిమ బెంగాల్‌(WestBengal)కు వెళ్ల‌నున్నారు. గ‌త కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలోని 24 ఉత్త‌ర ప‌ర‌గ‌ణాల(24 North paraganas) జిల్లాలో ఉన్న‌ సందేశ్‌ఖాలీ(Shandeshkhali) గ్రామంలో జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల్లో బాధిత మహిళలను (Women) ప‌రామ‌ర్శించనున్నారు. వారికి ధైర్యం చెప్ప‌నున్నారు. అనంత‌రం.. ఉత్తర 24 పరగణాల జిల్లాలో మహిళల ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో ప్ర‌ధాని మోదీ పాల్గొంటారు. ఇంతవ‌ర‌కు బాగానే ఉన్నా.. ఈ రాష్ట్రానికి పొరుగునే ఉన్న ఈశాన్య రాష్ట్రం మ‌ణిపూర్‌లోనూ రిజ‌ర్వేష‌న్ల ర‌గ‌డ కార‌ణంగా.. బాధితులైన మ‌హిళ‌లు ఉన్నారు. ఇది జ‌రిగి 4 మాసాలు కూడా అవుతోంది. అయినా.. ఇక్క‌డి ప‌రిస్థితులు ఇంకా తెరిపిన ప‌డ‌లేదు. అంతేకాదు.. అస‌లు ఇక్క‌డ ప‌ర్య‌టించాల‌న్న‌.. ప్రధాన విప‌క్షం కాంగ్రెస్ డిమాండ్‌ను కూడా కూడా ప్రధాని ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు ప్ర‌త్య‌ర్థి పార్టీ తృణ‌మూల్  కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప‌శ్చిమ బెంగాల్‌లో ప‌ర్య‌టించేందుకు.. బాధిత మ‌హిళ‌ల‌ను ఓదార్చేందుకు రెడీ కావ‌డం వివాదాల‌కు కేంద్రంగా మారుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. 


సందేశ్ ఖాలీలో ఏం జ‌రిగింది?


సందేశ్ ఖాలీ(Shandeshkali).. అనేది ప‌శ్చిమ బెంగాల్‌లోని 24 ఉత్త‌ర‌ప‌ర‌గ‌ణాల జిల్లాలో ఉన్న ఓ మారుమూల గ్రామం. ఇక్క‌డ పెను వివాదం రాజుకుంది. అధికార పార్టీ తృణ‌మూల్‌కు చెందిన కీల‌క నేత షాజ‌హాన్ షేక్ అనుచ‌రులు.. త‌మ భూముల‌ను బ‌ల‌వంతంగా క‌బ్జా చేశార‌ని, దీనిని ప్ర‌శ్నించిన త‌మ‌పై.. లైంగిక దాడులు చేశార‌ని, ఒక‌రిద్దరిపై అత్యాచారం కూడా చేశార‌ని.. ఇక్క‌డి మ‌హిళ‌లు ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారం.. గ‌త వారం వెలుగు చూసింది. ఈ విష‌యం రాష్ట్రంలో ప్ర‌చారంలోకి రావ‌డంతో ప్ర‌తిప‌క్ష బీజేపీ దీన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. వెంట‌నే రాష్ట్ర బీజేపీ చీఫ్‌, పార్ల‌మెంటు స‌భ్యుడు సుకాంత మ‌జుందార్‌.. ఘ‌ట‌నా ప్రాంతానికి వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఇటు తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, అటు బీజేపీనేత‌ల‌కు మ‌ధ్య తీవ్ర దుమారం రేగింది. వీరిని అదుపు చేసే క్ర‌మంలో పోలీసులు లాఠీ చార్జీలు కూడా చేశారు. దీంతో ఎంపీ మ‌జుందార్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇది మ‌రో వివాదానికి దారి తీసింది. త‌న‌ను పోలీసులు కొట్టారంటూ.. ఎంపీ పార్ల‌మెంటు స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక‌, బాధితుల‌మ‌ని చెబుతున్న మ‌హిళ‌లు.. మీడియా ముందుకు రావ‌డం, వారికి బీజేపీ మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో వివాదం రాజుకుంది. దీనిపై మ‌హిళా క‌మిష‌న్ కూడా తీవ్రంగా స్పందించి.. ఏకంగా ఇద్ద‌రు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని సందేశ్ ఖ‌లీ గ్రామానికి పంపించింది. అయితే.. వారిని కూడా తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు.ఇలా.. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి ప‌రిస్థితులు ఏర్ప‌డ‌డంతో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స్పందిస్తూ.. ఇదంతా ఉద్దేశ పూర్వ‌కంగా ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ ఆడుతున్న నాట‌కంగా పేర్కొన్నారు. మ‌రోవైపు బాధిత మ‌హిళ‌ల‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చిన మ‌హిళా క‌మిష‌న్‌.. వారితో కేసులు పెట్టించింది. దీంతో 18 మంది అధికార పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై రేప్‌, హ‌త్యాయ‌త్నం కింద పోలీసులు కేసులుపెట్టారు. ఇక‌, రాష్ట్రంలోకి పార్ల‌మెంటు ఎథిక్స్ క‌మిటీ రావ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తూ.. తృణ‌మూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు ఎక్కింది. దీనిని విచారించిన కోర్టు ఎథిక్స్ క‌మిటీ ప‌ర్య‌ట‌న‌పై స్టే విధించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇక్క‌డ ప‌ర్య‌టించి బాధిత మ‌హిళ‌ల‌ను ఓదార్చాల‌ని.. నిర్ణ‌యం తీసుకోవ‌డం రాజ‌కీయ దుమారాన్నిమ‌రింత పెంచ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


'మ‌ణిపూర్ మ‌న‌ దేశంలో లేదా?' 


ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌(Manipur)లో  మెజారిటీ మైతేయ్‌ వర్గాన్ని ఎస్టీ జాబితాలోకి చేర్చే అంశాన్ని వేగంగా పరిశీలించాలని, దీనిపై 4 వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ.. అక్క‌డి హైకోర్టు ఇచ్చిన తీర్పు హింస‌కు దారితీసింది. మార్చి 27, 2023న ఇచ్చిన తీర్పు.. త‌ర్వాత‌.. మైనారిటీ కుకీలు భగ్గుమన్నారు. హింస చెలరేగింది. ఈ మారణకాండలో దాదాపు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఆ రాష్ట్రం రావణకాష్టంలా రగులుతూనే ఉంది. అంతేకాదు.. కొంద‌రు మ‌హిళ‌ల‌ను న‌గ్నంగా ఊరేగించి వారిపై సామూహిక అత్యాచారాలు కూడా జ‌రిపారు. ఈ వ్య‌వ‌హారం దేశంలో క‌ల‌క‌లం రేపింది. అధికార బీజేపీ, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ మ‌ధ్య మాట‌ల మంట‌లు రేపింది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ రెండు, మూడుసార్లు ఇక్కడ ప‌ర్య‌టించి.. బాధితుల‌ను క‌లిశారు. ప్ర‌ధాని మోడీ(PM modi) కూడా ఇక్క‌డ‌కు రావాల‌ని.. జ‌రిగిన దారుణాల‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అంతేకాదు.. మ‌ణిపూర్ మ‌న దేశంలో లేదా? అంటూ.. కాంగ్రెస్ నేత‌లు.. అటు లోక్‌స‌భ‌, ఇటు రాజ్య‌స‌భ‌ల్లోనూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అయినా.. ప్ర‌ధాని ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ణిపూర్‌లో ప‌ర్య‌టించ‌లేదు.