Target Mangalagiri: రాజకీయాల్లో(Politics) ఏమైనా జరగొచ్చు. నిన్న ఓడిన నేత.. రేపు భారీ మెజారిటీతో విజయం దక్కించుకోవచ్చు. నిన్న బలమైన నాయకుడు.. రేపు బలహీనమైన నేతగా మారిపోవచ్చు. ప్రజల ఆశీస్సులు.. ఎన్నికల మూడ్ వంటివి నాయకుల గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ఎవరూ ఎప్పుడూ విఫలం కావాలని కూడా ఉండదు. అదే సమయంలో ఒకే నేత పరిపరి విధాలా విజయం దక్కించుకోవాలని కూడా ఉండదు. ఇదే ఫార్ములాను.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ(TDP) యువ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(NaraLokesh) ఫాలో అవుతున్నారు. 2019లో తొలిసారి ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మంగళగిరి(Mangalagiri) నుంచి పోటీ చేశారు. అప్పటి అంచనాల మేరకు.. ఆయన విజయం `పక్కా` అని టీడీపీ నాయకులు రాసిపెట్టుకున్నారు. రాజధానిగా ఇక్కడి అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేయడం.. యువ నాయకుడిగా ప్రజల్లో ఉండడం. హైప్రొఫెల్ నాయకుడిగా నారా చంద్రబాబు(Nara chandrababu)కు భారీ గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఆయన వారసుడిగా ఉన్న నారాలోకేష్ గెలుపు నల్లేరుపై నడకేనని భావించారు. కానీ, 2019లో ఈ లెక్కలు విఫలమయ్యాయి. అప్పటి ఎన్నికల్లో వరుసగా పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ఎమ్మెల్యే(MLA).. ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishnareddy) విజయం దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో త్రిముఖ పోరు సాగింది. టీడీపీ, వైఎస్సార్ సీపీలతో పాటు.. జనసేన, కమ్యూనిస్టుల మిత్రపక్షం తరఫున ముప్పాళ్ల నాగేశ్వరరావు పోటీ చేశారు. దీంతో ఓట్లు చీలిపోయి.. నారా లోకేష్ 5,333 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుస విజయాలు దక్కించుకున్నారు.
సీరియస్‌గా ఇప్పుడు..
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఇక్కడ నుంచే నారా లోకేష్ పోటీకి రెడీ అయ్యారు. గత ఎన్నికల్లో ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ.. పడిన చోటి నుంచే పైకి లేవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన పట్టుదలగా ఇక్కడ పని చేసుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా పార్టీ తరఫున నిర్వహిస్తున్నారు. దీంతో మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోయినా.. ఆయన హవా మాత్రం చెక్కు చెదరలేదనే టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు చేనేతలు ఎక్కువగా ఉండడంతో వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. వీధి వ్యాపారులకు తోపుడు బండ్లు ఇచ్చి..వారిని ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు.. నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన భర్త నారా లోకేష్‌ను గెలిపించాలని ఆమె కోరుతున్నారు. మెజారిటీ సామాజిక వర్గం ఇక్కడ చేనేతలే కావడంతో వారిని లక్ష్యంగా చేసుకుని నారాలోకేష్ ముందుకు సాగుతున్నారు.
వైసీపీ వ్యూహం ఇదీ..
నారా లోకేష్‌ను ఓడించి తీరాలనే పట్టుదలతో ఉన్న అధికార పార్టీ వైఎస్సార్ సీపీ కూడా మంగళగిరిపై ప్రత్యేకంగా కాన్సంట్రేషన్ పెంచేసింది. మంగళగిరిలో గత రెండు సార్లు వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. ఆళ్ల ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పారు.( మళ్లీ తిరిగి వెనక్కి వచ్చారు) దీంతో మంగళగిరిలో `బీసీ కార్డు` ప్రయోగానికి వైసీపీ సిద్ధమైంది. చేనేత వర్గీయుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో.. అదే వర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గంజి చిరంజీవిని ఇన్‌చార్జ్‌గా ప్రకటించారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని అందరూ భావించారు. ముందుగా చిరంజీవికి టికెట్ ఇస్తామని చెప్పినప్పటికీ.. నారా లోకేష్ వ్యూహాలను పసిగట్టిన వైసీపీ..ఇక్కడి పరిస్థితిని అంచనా వేసేందుకు పార్టీ సీనియర్ నేత, ఎంపీ వి.విజయసాయిరెడ్డిని తాజాగా రంగంలోకి దించింది. ఆయన వచ్చి.. నియోజకవర్గం నేతలతో భేటీ అయ్యారు. నారా లోకేష్ దూకుడు, వైసీపీప్రచారం వంటి వాటిని ఆయన తెలుసుకున్నారు. లోకేష్ కు గట్టి పోటీ ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్న వైసీపీ ఏ క్షణమైనా అభ్యర్థిని మార్చవచ్చనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. మరోవైపు.. అలిగి వెళ్లిపోయిన ఆళ్లను తిరిగి చేర్చుకోవడం ద్వారా.. వైసీపీ పట్టుకోల్పోకుండా.. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చీలకుండా కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండడం గమనార్హం.
నారా లోకేష్ బలాలు ఇవీ..
+ గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతి
+ అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు.
+ యువగళం పాదయాత్ర తాలూకు సింపతీ
+ బలమైన గళం వినిపిస్తారనే చర్చ.
+ స్థానికంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ వంటి.. కార్యక్రమాలు.
+ యువ నాయకుడు, యువతను ప్రోత్సహిస్తున్నతీరు.
బలహీనతలు ఇవీ..
+ ఈ నియోజకవర్గానికి చెందిన నాయకుడు కాకపోవడం.
+ బీసీ సామాజిక వర్గమైన చేనేతల్లో బలమైన ఓటు బ్యాంకును ఈయన తనవైపు తిప్పుకోలేకపోతున్నారనే వాదన.