Modi Tour AP Issues :   ప్రధానమంత్రి నరేంద్రమోదీ పూర్తి స్థాయిలో ఓ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటీవలి కాలంలో తొలి సారిగా ఏపీ పర్యటనకు వస్తున్నారు. విశాఖలో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. గతంలో మోదీ ఏపీ పర్యటనకు వస్తూంటే పెద్ద ఎత్తున నిరసనలు జరిగేవి. కానీ గత మూడేళ్లుగా ఆయన ఏపీకి వచ్చినా ఎలాంటి నిరసనలు లేవు. అదే సమయలో ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులు మాత్రం ఎక్కడివక్కడే ఉండిపోయాయి. అయినా ఏపీలోని రాజకీయ పార్టీలు ప్రశ్నించడం లేదు. ఇప్పుడు మరోసారి ఏపీకి వస్తున్నారు. మరి రాజకీయ పార్టీలు తమ రాష్ట్ర సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయా ?


మోదీ ఏపీకి వస్తే టీడీపీ హయాంలో తీవ్ర నిరసనలు !


ప్రధానమంత్రి నరేంద్రమోదీ విభజన హామీలు అమలు చేయలేదని.. ప్రత్యేకహోదా లాంటి హామీల విషయంలో మోసం చేశారని తెలుగుదేశం పార్టీ హయాంలో చివరి ఏడాది నిరసనలు చేపట్టారు. ఆయన ఏపీ పర్యటనకు వస్తే నల్ల బెలూన్లు ఎగురవేశారు. నిజానికి మోదీపై ఈ వ్యతిరేకత గతంలో తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లోనూ ఉండేది. ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు అదనంగా తెలంగాణలో అలాంటి వ్యతిరేకతను టీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తోంది. మోదీ వస్తున్నారు.. రాష్ట్రానికి ఏం ఇస్తారని అక్కడి పార్టీలు ప్రశ్నిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఏపీలో మాత్రం ఎలాంటి నిరసనలు వ్యక్తం చేసే అవకాశం లేదు. 


బీజేపీతో సానుకూలంగా వ్యవహరస్తున్న పార్టీలు !


భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసుకుని.. కేంద్రంపై పోరాడుతున్నామని ప్రజలకు చెప్పినా.. గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఆదరించలేదు. దీంతో బీజేపీతో విడిపోయి నష్టపోయామని టీడీపీ ఓ అంచనాకు వచ్చింది. అందుకే.. బీజేపీ విషయంలో సైలెంట్ అయిపోయింది.  ప్రస్తుతం ఏపీలోని రాజకీయ  పార్టీలన్నీ బీజేపీ విషయంలో సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నాయి.  కేంద్రంలో అధికారంలో  ఉన్న పార్టీ కావడం ఒకటైతే.. ఏపీలో ఎలాంటి బలం లేకపోవడం కారణంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే.. రాజకీయ పార్టీలు ప్రధాని మోదీ రాకను వ్యతిరేకించే అవకాశం లేదు. ఆయనను ప్రశ్నించే నేతలు కూడా ఉండకపోవచ్చు. 


రాష్ట్ర ప్రయోజనాల గురించి అధికార,  ప్రతిపక్షాలు ఆలోచిస్తాయా ?


రాజకీయంగా సరే.. మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం ... కేంద్రం నుంచి  రావాల్సిన వాటి కోసం ప్రశ్నించరా అనేది సామాన్యుల్లో వస్తున్న సందేహం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజానికి చేయాల్సింది రైల్వే స్టేషన్ శంకుస్థాపన కాదు.. రైల్వే జోన్  శంకుస్థాపన. గత ఎన్నికలకు ముందు జోన్ ప్రకటించారు కానీ అమలు కోసం ఇంత వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదు. రాజకీయంగా విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు కానీ అసలు విషయం మాత్రం ముందుకు పడటం లేదు. అదొక్కటే కాదు.. విభజన సమస్యలు మూడున్నరేళ్ల కిందట ఎలా ఉన్నాయో.. ఇప్పుడూ అలానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అంతకు ముందు పోలవరం నిధులు ఎప్పటికప్పుడు రీఎంబర్స్ చేసేవారు. కానీ మూడున్నరేళ్లుగా నిధులు ఇవ్వకపోగా.. అంచనాలను భారీగా తగ్గించేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య అలాగేఉంది. దీంతో పాటు పోలవరం భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇక ప్రత్యేకహోదా అంశం అలాగే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ ప్రభుత్వం ఏ అంశాలపై పోరాడిందో వాటికేమీ పరిష్కారం లభించలేదు. అలాగని ప్రభుత్వమూ డిమాండ్ చేయడం లేదు. దీంతో కేంద్రం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. 


ప్రతిపక్షాలు పోరాడటం కూడా కష్టమే !


ఏపీలో ప్రతిపక్ష పార్టీలయిన టీడీపీ , జనసేన పార్టీలు బీజేపీతో సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికైతే జనసేన .. బీజేపీతో పొత్తులో ఉంది కాబట్టి కేంద్రానికి సంబంధించిన ఏ విషయంలోనూ స్పందించడం కష్టమే. తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీ విషయంలో ఊరుకున్నంత ఉత్తమం మరొకటి ఉండదన్నట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో ఏపీలో మోదీ పర్యటన ప్రశాంతంగా సాగుతుంది కానీ.. రాక రాక ఏపీకి వస్తున్న ప్రధాని నుంచి ఏపీకి కావాల్సిన.. రావాల్సిన అంశాలపై మాత్రం..  అడిగేవారు.. ప్రశ్నించేవారు మాత్రం ఎవరూ లేనట్లే. !