Prajagalam Meeting in Palnadu District: ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీట్ల షేరింగ్ కూడా పూర్తైంది. ఈ క్రమంలో 3 పార్టీలు కలిసి నిర్వహిస్తోన్న తొలి సభకు సర్వం సిద్ధమైంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో 'ప్రజాగళం' పేరిట నిర్వహిస్తోన్న బహిరంగ సభకు మూడు పార్టీలకు చెందిన అగ్రనేతలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సభలో ఒకే వేదికపై పదేళ్ల తర్వాత ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కనిపించనున్నారు. దీంతో ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఏపీ ప్రజల జీవితాల్లో మార్పు తెస్తామని.. ప్రజాగళం సభ కోసం ఏపీకి వస్తున్నా అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 'చంద్రబాబు, పవన్ తో కలిసి బహిరంగ సభలో పాల్గొంటా. ఎన్డీయేకు ఏపీ ప్రజల ఆశీర్వాదం కావాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీయిస్తాం.' అని ట్వీట్ లో పేర్కొన్నారు.
గన్నవరం ఎయిర్ పోర్టుకు
అటు, బహిరంగ సభ వద్దకు ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేరుకోగా.. ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అనంతరం ఆయన సభా వేదిక వద్దకు చేరుకోనున్న ఆయన ఏపీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
పసుపుమయంగా పల్నాడు
మరోవైపు, 'ప్రజాగళం' బహిరంగ సభతో పల్నాడు జిల్లా పసుపుమయంగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి బస్సులు, ట్రాక్టర్లు, కార్లల్లో భారీగా సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. బొప్పూడికి ఇరువైపులా దారి పొడవునా.. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఈ సందర్భంగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 2014 ఎన్నికల సభలో మోదీ, చంద్రబాబు, పవన్ ఒకే సభలో పాల్గొన్నారు. మళ్లీ పదేళ్ల తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు, పవన్, ప్రధాని మోదీ కనిపించనుండడంతో శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఈ సభలో నేతల ప్రసంగంపైనే అందరి చూపూ ఉంది. ప్రధాని మోదీ ఏం మాట్లాడుతారోననే అటు రాజకీయ వర్గాలు, ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 3 పార్టీల కీలక నేతలు సభ వద్దకు చేరుకున్నారు. అటు, ప్రధాని మోదీ పాల్గొంటున్న నేపథ్యంలో సభా ప్రాంగణం వద్ద ఎస్పీజీ అధికారులు, స్థానిక పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.