30 years prudhvi :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గత ఎన్నికల్లో కీలకంగా పని చేసిన టాలీవుడ్ కమెడియన్ పృధ్వీ పవన్ కల్యాణ్ పిలిస్తే జనసేనలో పని చేస్తానని అంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో  వైఎస్ఆర్‌సీపీ కోసం పృధ్వీ విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ సమయంలో ఆయన ఇతర పార్టీల నేతలపై అనుచితమైన వ్యాఖ్యలు కూడా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్‌పైనా ఆయన విమర్శలు చేశారు. ఫృధ్వీ వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లకు ఆయనను గుర్తించి ..సీఎం జగన్ ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. 


పృధ్వీని పట్టించుకోవడం మానేసిన వైఎస్ఆర్‌సీపీ నేతలు 


టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఆ చానల్‌లో అవకాశం రావడానికి గొప్పగా భావించిన పృధ్వీ చురుగ్గా పని చేశారు. అయితే ఆయన ఓ మహిళా ఉద్యోగితో అనుచితంగా ప్రవర్తించినట్లుగా ఆడియోలు బయటకు రావడంతో ఆయనను ఆ పదవి నుంచి రాజీనామా చేయించారు. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆయనను పట్టించుకోలేదు. అప్పటి వరకూ తన ప్రాణం పోయే వరకూ జగన్‌తోనే ఉంటానని చెప్పిన ఆయన ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీకి  దూరంగా ఉంటూ వచ్చారు. పలుమార్లు సీఎం జగన్‌తో పాటు సజ్జల అపాయింట్‌మెంట్ల కోసం ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో ఇటీవల వైఎస్ఆర్‌సీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. 


మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలనుకుంటున్న పృధ్వీ


ఇప్పుడు ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో ఆయన మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలనుకుంటున్నారు. అందుకే తాజాగా పవన్ కల్యాణ్‌ను పొగుడుతూ ప్రకటనలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పిలిచినా మళ్లీ వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్లబోనని.. ఇంత జరిగిన తర్వాత పిలవడానికి వాళ్లకు లేకపోయినా.. వెళ్లడానికి తనకు బుద్ది ఉందంటున్నారు. తాను కాపు బిడ్డనని.. ఎప్పుడూ కులం గురించి చెప్పుకోలేదని.. కానీ ఇప్పుడు చెప్పుకుంటున్నానంటున్నారు. ఏపీ రాజకీయాల్లో జనసేన కీలక పాత్ర పోషిస్తుందని ఆ పార్టీలో పని చేయడానికి సిద్ధమని సంకేతాలు పంపుతున్నారు. 


జనసేనలో చేరుతానని ప్రకటనలు


అయితే ఆయనను జనసేనపార్టీలో చేర్చుకుంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. వైఎస్ఆర్‌సీపీలో ఉన్నప్పుడు రాజకీయంగా విమర్శలు చేస్తే అంతా రాజకీయం అనుకునేవారు కానీ పృధ్వీ వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. ఈ క్రమంలో పృధ్వీని జనసేన దగ్గరకు తీస్తుందో లేదో స్పష్టత లేదు. కానీ ఆయన మాత్రం తన ప్రయత్నాలు తానుచేసుకుంటున్నారు.