Andhra Pradesh : అమరావతిలోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసానికి నేతలు క్యూ కడుతున్నారు. పొత్తు ఖాయమైన వేళ సీట్ల సర్దుబాటుపై ఫోకస్‌పెట్టాయి టీడీపీ, జనసేన, బీజేపీ. వీటిపై చర్చించేందుకు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు.  ఆయనతో జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. కాసేపట్లో పవన్ కల్యాణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.


ఉదయం నుంచి చంద్రబాబు నివాసానికి టీడీపీ నేతలతోపాటు బీజేపీ, జనసేన నేతలు కూడా వచ్చి కలుస్తున్నారు. ముందుగా టీడీపీ నేతలతో సమావేశం అయిన చంద్రబాబు... జనసేన, బీజేపీతో పంచుకోవాల్సిన సీట్లపై చర్చించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ కలిసిన వారిలో ఉన్నారు. రాత్రే వీళ్లందరికీ పార్టీ నాయకత్వం సమాచారం ఇచ్చింది. ఉదయం పార్టీ అధినేతను కలవాలని పిలుపునిచ్చింది. దీంతో ఎమ్మెల్యేలంతా వచ్చిన ఆయనతో సమావేశమయ్యారు.


పార్టీ నేతలతో చర్చలు జరిపిన తర్వాత చంద్రబాబు బీజేపీ, జనసేన నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఈ మంతనాలకు గజేంద్ర షెకావత్ తోపాటు పవన్ కల్యాణ్, పురందేశ్వరి కూడా హాజరుకానున్నారు. మూడు పార్టీలు చర్చించి సీట్ల సర్దుబాటు అభ్యర్థులపై ఎంపిక పై కసరత్తు చేయనున్నారు.


ఇప్పటికే 175 సీట్లకు కానూ 100 సీట్లకు అభ్యర్థులను టీడీపీ, జనసేన ప్రకటించేశాయి. ఇంకా 75 సీట్లకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇందులో జనసేన 18 సీట్లకు అభ్యర్థులను తేల్చాల్సి ఉంది. మిగిలిన సీట్లలో కొన్ని బీజేపీకి కేటాయించాలి. వీటి సంఖ్య ఆరు వరకు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఏ సీట్లు కేటాయించారు... ఎవరికి కేటాయించారనే లిస్ట్ కూడా చక్కర్లు కొడుతోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. 



బీజేపీ అసెంబ్లీ సీట్ల కంటే ఎంపీ స్థానాలపైనే గురి పెట్టింది. అందుకే ఎక్కువ స్థానాల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీలో నిలిపేలా టీడీపీపై ఒత్తిడి తీసుకొచ్చింది. టీడీపీ జనసేన చర్చించుకొని ఆరు వరకు సీట్లు ఇచ్చేందుకు అంగీకరించారని టాక్ నడుస్తోంది. మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీకి సిద్ధమైన జనసేన ఒక సీటు తగ్గించుకొని దాన్ని బీజేపీకి ఇచ్చేందుకు ఓకే చెప్పినట్టు కూడా తెలుస్తోంది. 


ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం 17 స్థానాల్లో టీడీపీ ఆరు స్థానాల్లో బీజేపీ, రెండు స్థానాల్లో జనసేన పోటీ చేయబోతోందని అంటున్నారు. ఈ విషయంపై క్లారిటీ కోసమే మూడు పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నారు. సాయంత్రానికి వీటిపై క్లారిటీ వస్తుందని అంటున్నారు.