Janasena Chief Pawan Kalyan :జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆయన ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం 175 నియోజకవర్గాలనూ ఆయన చుట్టిరానున్నారు. ఒకేరోజు 3,4 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించేందుకు ఆయన హెలీకాప్టర్(Helicopter) వినియోగించనున్నారు. ఈమేరకు అధికారుల నుంచి ముందస్తు అనుమతులు సైతం తీసుకున్నారు. ఇప్పటికే మంగళగిరి(Managalagiri)లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో  సైతం ట్రయల్ రన్ నిర్వహించారు. 


జనసేన ప్రణాళికలు సిద్ధం 
తెలుగుదేశం(TDP), జనసేన, బీజేపీ(BJP) మధ్య పొత్తు కుదరింది. ఢిల్లీలో అమిత్‌షా సమక్షంలో చంద్రబాబు(Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pavan Kalyan) జరిపిన చర్చల్లో సీట్ల సర్దుబాటు సైతం తేలిపోవడంతో నేతలు ప్రచారంపై ముమ్మరంగా దృష్టిసారించనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేలా జనసేన ప్రణాళికలు సిద్ధం చేసింది. జనసేన(Janaseana) పోటీచేసే అభ్యర్థుల తరపునతోపాటు కూటమి తరపున పోటీ చేసే తెలుగుదేశం, బీజేపీ(BJP) అభ్యర్థుల తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ రెండు నెలలపాటు ఆయన జనంలోనే ఉండేా ప్రచార ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేరోజు రెండు, మూడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించేలా ప్రణాళికలు రూపొందుతున్నాయి. దీనికోసం ఆయన హెలీకాఫ్టర్ వినియోగించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఒకచోటకు హెలీకాప్టర్‌లో వెళ్లనున్న జనసేనాని... అక్కడి నుంచి మిగిలిన ప్రాంతాలకు వారాహి బస్సులో వెళ్లి అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. రోడ్‌షోలు, ర్యాలీలు, బహిరంగ సభల్లో పవన్ ప్రసగించనున్నారు. కూటమి అభ్యర్థుల గెలుపుకోసం విస్తృతంగా జనంంలోకి వెళ్లనున్నట్లు జనసేన(Janasena) నేతలు తెలిపారు. పవన్ పర్యటనకు వీలుగా ఇప్పటికే జనసేన కార్యాలయం ఆవరణలో హెలీప్యాడ్ సైతం సిద్ధం చేశారు. 
ఆయా నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం (TDP) నేతలతో సమన్వయం చేసుకుంటూ కొత్త హెలీప్యాడ్‌లు సైతం నిర్మిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని హెలీకాప్టర్ ప్రయాణాలకు, హెలీప్యాడ్‌ల నిర్మాణానికి ముందుగానే అధికారుల అనుమతి తీసుకుంటున్నారు. గతంలోనూ ఆయన భీమవరం పర్యటనకు బయలుదేరగా....అనుమతి లేదంటూ అధికారులు అడ్డుకోవడంతో పవన్ పర్యటన అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందుగానే అన్ని రకాల అనుమతులు తీసుకోనున్నారు. చంద్రబాబుతో కలిసి ఉమ్మడి సభల్లో పాల్గొననున్న పవన్ కల్యాణ్‌ మిగిలిన రోజుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎన్నికలు ముగిసే వరకు ఆయన షూటింగ్ లు సైతం రద్దు చేసుకున్నారు. ఇక ఈసారి లోక్ సభ ఎన్నికల బరిలో  దిగనున్న పవన్ కల్యాణ్...కాకినాడ నుంచి  పోటీ చేయనున్నట్లు సమాచారం.అందుకు అనుగుణంగానే కాకినాడ లోక్‌సభ పరిధిలోనే పవన్ కల్యాణ్ విస్తృతంగా పర్యటించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి.
ప్రచార రథాలు
ఇప్పటికే రాష్టవ్యాప్తంగా 25 ప్రచార రథాలు(Campaign Vechicle) పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఒక్కో వాహనంలో ముగ్గురు ప్రచారసారథులు అన్ని నియోజవర్గాల్లో పర్యటించనున్నారు. జనసేన సిద్ధాంతాలు, పవన్ ప్రసంగాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. వాహనాలపై పార్టీ జెండా, గాజుగ్లాసు గుర్తులను ముద్రించిన కార్లు ఆయా నియోజవర్గా‌ల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. తెలుగుదేశం అభ్యర్థులు  ఉన్నచోట జనసేన ప్రచార రథాలు ప్రచారం నిర్వహిస్తున్నాయి.