ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన జనసేన అధినేత పవర్‌ స్టార్‌ ఎన్నికల ప్రచార రథం ఎట్టకేలకు బయటకు వచ్చింది. మిలటరీ వాహనాన్ని తలపించేలా బాగా దృఢంగా ఉన్న ఈ వాహనం ఖర్చు వెనక ఉంది ఎవరు ? ఈ పేరు పెట్టింది ఎవరు ?  ఎందుకు పెట్టారు ? 


ఏపీ ఎన్నికలకు ఇంకా టైమ్‌ ఉన్నా పార్టీలన్నీ ఎలక్షన్‌ మూడ్‌ లోకి వచ్చేశాయి. ముందస్తుగానే ప్రతిపక్షాలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే జనసేన అధినేత కూడా రథయాత్రకు రెడీ అయ్యారు. దసరాకే ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు త్వరలోనే మళ్లీ పవన్‌ కల్యాణ్‌ రథయాత్రని ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. 


గతంలో ఎన్నికల ప్రచారం సమయంలో పవన్‌ కల్యాణ్‌ పలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు విశాఖ పర్యటనని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎన్నికల ప్రచారానికి వాహనాన్ని ఉపయోగించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఆ ఎన్నికల రథం పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఆర్మీ వాహనాన్ని తలపించేలా సిద్ధమైన ఈ ఎన్నికల రథానికి వరాహి అని పేరు పెట్టారు. ఇప్పుడిదే అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. 


వారాహి అంటే ఇదే..


వారాహి అంటే వరహరూపంలోని విష్ణుమూర్తిగా భక్తులు కొలుస్తారు. రాక్షసులు సముద్రంలో దాచిన భూమిని విష్ణుమూర్తి వరాహరూపంలో వచ్చి బయటకు తీస్తారు. అలాగే దుర్గాదేవి ఏడు రూపాల్లో ఒకటిగా కూడా చెబుతారు. ఇలా చెప్పుకుంటే పోతే ఈ పేరు వెనక చాలా పురాణగాథలే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చెడు మీద గెలుపుగా అభివర్ణిస్తారు. ఏపీలో జగన్‌ పాలనని రాక్షస పాలనగా టిడిపి-జనసేన అభివర్ణించాయి. అందుకే రానున్న ఎన్నికల్లో ఆ రాక్షసపాలనని అంతం చేసేందుకు వారాహి వాహనంతో ఎన్నికల సమరంలోకి దిగుతున్నట్లు పవన్‌ కల్యాణ్‌ సింబాలిక్‌ గా చెప్పాడంటున్నారు జనసేనాని.  అయితే ఈ వారాహి వాహనంపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి.


వారాహి నిర్మాత ఆయనేనా?


ఈ ఎన్నికల రథం ఖర్చంతా ఆ నిర్మాతదే అన్న టాక్‌ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాత, వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్యకి అత్యంత సన్నిహితుల్లో సాయికొర్రపాటి కూడా ఒకరన్న విషయం తెలిసిందే. వీరి కాంబోలో లెజెండ్‌ సినిమా వచ్చింది. అంతేకాదు సాయికొర్రపాటి టిడిపి సానుభూతి పరుడన్న టాక్‌ ఉంది. గతంలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ.25లక్షల రూపాయలను విరాళం అందజేశారు. హుదూద్‌ తుపాను సమయంలో కూడా 100 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేశారు. టిడిపి-జనసేన పొత్తుల్లో భాగంగానే నిర్మాత సాయికొర్రపాటి వారాహి వాహనాన్ని సిద్ధం చేయించారన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది. 


ఈ వాదనల్లో నిజం లేదంటున్నారు జనసైనికులు. దీని ఖర్చంతా పవన్‌ కల్యాణ్‌ సొంత డబ్బులేనంటున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా కానీ పవన్‌ కల్యాణ్‌ వారాహి రథం మాత్రం యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆర్మీ ట్యాంకర్‌లా ఉంది. కొండగట్టులో పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత వారాహి ఏపీలో ఎన్నికల ప్రచారంలోకి దిగబోతోంది. సినిమాకు ముందు పోస్టర్, టీజర్ లాంచ్ లాగానే ఉంది పీకే వారాహి వాహనం ఇంట్రడక్షన్. వాహనం ముందు తాను పెట్టుకున్న ప్రైవేటు సెక్యురిటీ ముందు నడుస్తుండగా ఆ భారీ వాహనం ముందుకు కదులుతున్న వీడియోను పీకే విడుదల చేశారు. టీజర్, ఫస్ట్ లుక్ అదిరింది కానీ ప్రజలు పవన్ కళ్యాణ్ ను ఏవిధంగా రిసీవ్ చేసుకుంటారనేది ఇంకా తేలాలి. అంతేకాదు 2014, 2019 ఎన్నికల ప్రచారాల్లో కూడా జనం పీకే మీటింగ్స్ బాగానే వచ్చారు. జనం వచ్చారు కానీ ఓట్లే రాలేదు. మరి ఈ సారి ఏమౌతుందో చూడాలి. ప్రజలు మార్పు ను మరోసారి కోరుకుంటారా? లేదా? వెయిట్ అండ్ సీ అప్ టూ 2024.