ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోనివ్వను... ఇది మొన్నటి వరకు పవన్ కల్యాణ్ నోటి వెంట వచ్చిన మాట. నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధం... ఇది నేడు చేస్తున్న కామెంట్. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా డైనమిక్‌గా ఉంటున్నాయి. ఏ గంటకు ఏం జరుగుతుందో అంత ఈజీగా అంచనాకు అందడం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన పోటీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం మధ్యే అన్నది ఎవరు అవునన్నా కాదన్న అంగీకరించాల్సిన సత్యం. కానీ ఆ రెండు పార్టీలను ప్రభావితం చేసేది మాత్రం ఓవైపు జనసేన, మరోవైపు బీజేపీ. అందుకే రెండు ప్రధాన పార్టీల భవిష్యత్, వారి గెలుపోటములు మాత్రం నిర్ణయించేది ఈ పార్టీలే. అందుకే బీజేపీ, జనసేన ఏం చేసినా పొలిటికల్ సర్కిల్‌లో మోతమోగిపోతుంటుంది. మొన్న బీజేపీ అగ్రనేతల మీటింగ్ నుంచి ఇవాళ్టి వారాహి యాత్ర వరకు ఏదైనా సరే టీడీపీ, వైసీపీతో ముడిపెట్టి విశ్లేషించాల్సిందే.
వారహి యాత్రతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే చర్చ ఇప్పట్లో అంచనా వేయడం కష్టమే కానీ... ఈ యాత్ర సందర్భంగా పవన్ కల్యాణ్ చేస్తున్న కామెంట్స్ మాత్రం పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. మూడు రోజుల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యాత్ర చేస్తున్న పవన్ స్పీచ్‌లో చాలా మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వను అంటూ బల్లగుద్ది మరీ చెప్పిన పవన్ కల్యాణ్ ఆ డైలాగ్‌నే మర్చిపోయారనే టాక్ నడుస్తోంది. మొన్నటి వరకు ఏ సభ పెట్టినా ఎక్కడ ప్రెస్‌మీట్ పెట్టినా, ఏ వేదికపై మాట్లాడినా ఇదే విషయాన్ని పదే పదే చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ డైలాగ్ పెద్దగా వినిపించడం లేదు. తాను ఒంటరిగా పోటి చేస్తానో... కలిసి పోటీ చేస్తానో అంటూ కన్ఫ్యూజింగ్ స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. కచ్చితంగా పొత్తులతో వెళ్తామని చెప్పిన జనసేనాని ఇప్పుడు సడెన్‌గా మాట ఎందుకు మార్చారనేది అంతుబట్టడం లేదు.
పార్టీ బలంపై ప్రాక్టికల్‌గా ఉండాలని ఓసారి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్. తాను ముఖ్యమంత్రిగా అయిపోవాలంటే రాష్ట్రవ్యాప్తంగా 175 స్థానాల్లో పోటీ చేసి గెలిచే సత్తా ఉండాలంటూ చెప్పుకొచ్చారు. ఆ స్థాయిలో పార్టీ బలోపేతం లేనప్పుడు నినాదాలు చేసినంత మాత్రాన సీఎంలు అయిపోరని కామెంట్ చేశారు. తనకు ఆ కోరిక లేదని ప్రస్తుతానికి రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి రక్షించడమే తన కర్తవ్యమని అన్నారు. జనసైనికులకు గౌరవం దక్కేలా చూసుకునే బాధ్యత తనదని కూడా భరోసా ఇచ్చారు. అందుకే ప్రభుత్వ ఓటు చీలిపోకుండా చూస్తనని పొత్తులతో పోటీ ఉంటుందని కూడా మాట్లాడారు.
ఇప్పుడు ఆ ప్రస్తావనే తీసుకురావడం లేదు. తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు సిద్ధమని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి స్థానం ఇవ్వగలిగితే ఏపీని దేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని పవన్ అంటున్నారు. దశాబ్దం తర్వాత అన్ని అంశాలపై పూర్తి అధ్యయనం చేసి, సంపూర్ణ అవగాహనతో ఈ మాట చెబుతున్నాను అని వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్ర బాధ్యత తీసుకోవడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. జనసేన ప్రభుత్వంలో సురక్ష ఆంధ్రప్రదేశ్‌ను సాధించి తీరుతామన్నారు.
పవన్ కామెంట్స్‌కు కారణమేంటి
పవన్‌పై వైసీపీ ఒకే రకమైన దాడి చేస్తోంది. టీడీపీని గెలిపించడానికే జనసేన వచ్చిందని విమర్సలు చేస్తున్నారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ దత్తపుత్రుడని కూడా సీఎం స్థాయి వ్యక్తి కామెంట్ చేస్తున్నారు. ఎప్పుడు చంద్రబాబుకు కష్టం వచ్చినా పవన్ రంగంలోకి దిగుతాడనే విమర్శను చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది వైసీపీ. అందుకే పవన్ రూట్ మార్చారా అనే విశ్లేషణ కూడా ఉంది.
తనకు సీఎం పదవిపై ఆలోచన లేదని.... పొత్తులతో రాజకీయం చేస్తాంటూ గతంలో పవన్ చేసిన కామెంట్స్‌పై జనసైనికులే చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడూ వేరే పార్టీలకు భుజం కాయడమేనా అంటూ విమర్శలు చేశారు. ఇది కూడా పవన్ కల్యాణ్‌లో మార్పునకు కారణమైందనే చెప్పాలి. ముందు పార్టీని బలోపేతం చేసి కేడర్‌ను స్టేబుల్ చేసుకుంటే తర్వాత రాజకీయం చేయవచ్చనే అంచనాకు పవన్ కల్యాణ్ వచ్చినట్టు తెలుస్తోంది. జనసైనికుల్లో తనపై నమ్మకాన్ని కలిగించగలిగితే మంచిదని ఆయన భావించినట్టు తెలుస్తోంది.
ఇప్పటి వరకు పవన్‌లో రాజకీయంగా స్థిరత్వం లేదని విమర్శ గట్టిగానే ఉంది. అందుకే ఆయనకు ఫ్యాన్ బేస్డ్ కేడర్ ఉంది కానీ అది ఓట్లగా మారడం లేదన్నది మరో విశ్లేషణ. అందుకే జనసేన కొన్ని ప్రాంతాల్లో బలంగా కనిపించినా మరికొన్ని ప్రాంతాల్లో చాలా బలహీనంగా ఉందని చెప్పక తప్పదు. వేరే పార్టీ గెలుపు ఓటములను డిసైడ్ చేసే సత్తా ఉన్నప్పటికీ... తమ పార్టీ అభ్యర్థులను గెలిపించే ఓటు బ్యాంకు మాత్రం కూడగట్టుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు పవన్ స్పీచ్‌లో మార్పు వచ్చిందని అంటున్నారు.
మరోవైపు అమిత్‌షా, చంద్రబాబు భేటీ కూడా పవన్‌లో మార్పునకు కారణమై ఉంటుందనే వాదన ఉంది. ఆ రోజు ఆ సమావేశంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఏపీ పొలిటికల్ వెదర్‌లో మాత్రం చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అదే టైంలో పవన్ కల్యాణ్ మాటల్లో వచ్చిందంటున్నారు. పవన్ స్పీచ్ ఇప్పుడు జనసైనికుల్లో ఉత్సాహం నింపుతోంది.