Jana Sena expansion to other states: ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అద్భుత విజయం సాధించి, తిరుగులేని శక్తిగా ఎదిగిన జనసేనాని పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తన రాజకీయ విప్లవాన్ని సరిహద్దులు దాటించేందుకు సిద్ధమయ్యారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా, దక్షిణాది రాష్ట్రాల్లో ఒక బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా జనసేనను తీర్చిదిద్దాలనే ఆయన ప్లాన్ ను సైలెంట్ గా అమలు చేస్తున్నారు.
ప్రాంతీయతను దాటి.. జాతీయవాదం వైపు
సాధారణంగా ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్ర సరిహద్దులు దాటి అడుగు వేయడానికి జంకుతాయి. కానీ, పవన్ కళ్యాణ్ మొదటి నుంచీ భారతీయత ను తన సిద్ధాంతంగా ఎంచుకున్నారు. జనసేన కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, అదొక సామాజిక భావజాలం అని ఆయన నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో కూటమి విజయానికి వెన్నెముకగా నిలిచిన పవన్, ఇప్పుడు పొరుగు రాష్ట్రాల్లో తన ప్రభావాన్ని చాటేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. కేవలం ఎన్నికల కోసం కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థలో జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా సాగుతున్న ఆయన ప్రస్థానం ఇప్పుడు ఇతర రాష్ట్రాల యువతను విశేషంగా ఆకర్షిస్తోంది.
కేరళలో జనసేన మార్క్ సైలెంట్ రివల్యూష
విద్యావంతులు, రాజకీయ చైతన్యం అధికంగా ఉండే కేరళ రాష్ట్రంలో జనసేనకు ఆదరణ లభిస్తోంది. కేరళకు చెందిన పలువురు సామాజిక కార్యకర్తలు, విద్యావంతులు మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చి పార్టీలో చేరారు. కమ్యూనిస్ట్ , కాంగ్రెస్ కూటముల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న కేరళ రాజకీయాల్లో, పవన్ కళ్యాణ్ చెప్పే సమ్మిళిత అభివృద్ధి అనే నినాదం కొత్త ఆశలు రేకెత్తిస్తోందని పార్టీలో చేరిన వారు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ , ఆయన నిబద్ధత కేరళ యువతను జనసేన వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయని చెబుతున్నారు.
కర్ణాటక నెట్‌వర్క్.. సేవా పథంలో జనసేన
కర్ణాటకలో ఇప్పటికే జనసేన తన మూలాలను పటిష్టం చేసుకుంది. అక్కడి మాజీ ఎమ్మెల్యే ఇటీవల పార్టీలో చేరారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, బెంగళూరు వంటి నగరాల్లో జనసేన వాలంటీర్లు చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్థానికుల్లో మంచి గుర్తింపు తెచ్చాయి. అక్కడి తెలుగువారితో పాటు కన్నడిగులు కూడా జనసేన సిద్ధాంతాలను ఆదరిస్తుండటం, రాబోయే రోజుల్లో కర్ణాటకలో జనసేన ఒక నిర్ణయాత్మక శక్తిగా మారబోతోందన్న దానికి సంకేమని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి గొంతుకగా పవన్ కళ్యాణ్
జనసేన విస్తరణ వెనుక ఒక లోతైన జాతీయ వ్యూహం కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్, దక్షిణాది రాష్ట్రాల సమస్యలపై కేంద్రం వద్ద ఒక ఉమ్మడి వేదికను నిర్మించాలని భావిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుతూనే, దేశ సమగ్రతను కాపాడే ఒక నేషనల్ పొలిటికల్ ఫోర్స్ గా జనసేనను తీర్చిదిద్దడం ఆయన లక్ష్యం. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూడా జనసేన శాఖలు క్రియాశీలం కావడం, పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనుకుంటున్న విషయం స్పష్టమవుతోంది.
జనసేన విస్తరణ అనేది కేవలం సంఖ్యాబలం పెంచుకోవడం కోసం కాదు, అది రాజకీయ సంస్కృతిని మార్చడం కోసం. ఇతర రాష్ట్రాల్లో పార్టీని కేవలం నామమాత్రంగా ఉంచకుండా, స్థానిక సమస్యలపై పోరాడేలా కేడర్‌ను సిద్ధం చేయడం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కనిపిస్తోంది. పవన్ ఆశయాలకు తగ్గట్లుగా ప్రధాన కార్యదర్శి వ్యూహాలు అమలు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
