ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం...ఏజెండాపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అజెండా ఏమిటో ఇంతవరకు వెల్లడించకపోవడంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక సమావేశాల ఎజెండా విడుదల అయ్యింది.  ఈ నెల 18న 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయాణం పై చర్చించనున్నట్టు లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు వేర్వేరుగా బులెటిన్లు విడుదల చేశాయి. రాజ్యసభలో రెండు, లోక్‌సభలో రెండు బిల్లుపై చర్చ జరగనుంది. 


ప్రత్యేక సమావేశాల్లో తొలి రోజు  75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణంపై చర్చ జరగనుంది. రాజ్యసభలో.. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు, ది పోస్ట్ ఆఫీస్ బిల్లు, అలాగే లోక్‌సభలో అడ్వకేట్స్ యాక్ట్ సవరణ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లులపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామకాలను నియంత్రించేలా కేంద్రప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చింది. గత నెల 10న రాజ్యసభలో ప్రవేశపెట్టింది. నియామక ప్యానెల్‌లో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్‌ చేసిన కేంద్ర కేబినెట్‌ మంత్రి ఒకరు... ఇందులో సభ్యులుగా ఉండనుననారు. కమిటీ నుంచి సీజేఐను తొలగించింది. దీంతో ఈ నియామక ప్రక్రియ వివాదాస్పదమైంది. 


కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లుతో పాటు నాలుగు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టి... ఆమోదించనుంది. ద అడ్వొకేట్స్‌ బిల్లు, ద ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ పీరియాడికల్స్‌ బిల్లుల గురించి చర్చిస్తారని సమాచారం. ఉమ్మడి పౌరస్మృతిపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.