Nellore Mayor Sravanti likely to Join YSRCP:
"శ్రీధరన్న ఆదేశిస్తే మేయర్ పదవికి కూడా రాజీనామా చేస్తా.." గతంలో ఆయన వైసీపీకి దూరమైనప్పుడు మేయర్ స్రవంతి చెప్పిన మాటలివి. అక్కడ సీన్ కట్ చేస్తే, ఇప్పుడు ఆ అన్నకే ఆమె షాకిచ్చారు. వైసీపీ వైపు వచ్చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్దన్ తాడేపల్లిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. వైసీపీలోనే ఉంటామని చెప్పారు.
స్టూడెంట్ లీడర్ గా ఉన్న జయవర్దన్ నెల్లూరు రూరల్ వైసీపీలో క్రియాశీలంగా ఉండేవారు. నెల్లూరు మేయర్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆయన భార్య స్రవంతి రాజకీయ అరంగేట్రం చేశారు. రూరల్ నుంచి ఆమె గెలుపొంది మేయర్ అయ్యారు. స్రవంతి మేయర్ కావడం వెనక రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రాంగం బాగా పనిచేసింది. ఆ అభిమానంతోనే మేయర్ దంపతులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు వైసీపీ నుంచి బయటకొచ్చారు. కానీ అధికారికంగా పార్టీకి రాజీనామా చేయలేదు. టీడీపీ అధికారిక కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ చక్రం తిప్పారు. మేయర్ దంపతులను తిరిగి వైసీపీ వైపు తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్ ఛార్జ్ గా నియమితులైన తర్వాత నిర్వహించిన టీడీపీ మహాశక్తి కార్యక్రమాల్లో కూడా మేయర్ స్రవంతి చురుగ్గా పాల్గొన్నారు. అయితే ఇటీవల నెల్లూరుకు వచ్చిన మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత సీన్ రివర్స్ అయింది. ఆదిమూలపు సురేష్ ఆమెకు రాజకీయ ఉపదేశం చేశారు. మేయర్ పదవిలో ఉంటూ, టీడీపీలో ఉండటం సరికాదన్నారు. అధికార పార్టీ మేయర్ గా ఇంకా ఏడాది టైమ్ ఉందని, ఇలాంటి టైమ్ లో ఆ హోదాని వదిలిపెట్టడం సరికాదన్నారు. ఆయన మాటలతో మేయర్ దంపతులు ఆలోచనలో పడ్డారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కోటరీలో ఉండటం వల్ల వచ్చిన ఉపయోగమేమీ లేదనుకున్నారు. అవసరమైతే.. రేపు టీడీపీ గెలిస్తే ఎలాగూ ప్లేటు ఫిరాయించడానికి ఛాన్స్ ఉంటుందని అనుకున్నారు. అందుకే ఇప్పుడు వైసీపీవైపు తిరిగి వచ్చేస్తున్నారు.
కోటంరెడ్డికి షాక్..
వాస్తవానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వైసీపీకి దూరమైన తర్వాత కార్పొరేటర్లంతా టీడీపీవైపు వచ్చేస్తారని అనుకున్నారు. కానీ మొదటిరోజే కొంతమంది ఆయనకు హ్యాండిచ్చారు. బిల్లులు రావాల్సి ఉందని, అవి క్లియర్ చేసుకున్న తర్వాత ఆయనవైపు వస్తామని సర్దిచెప్పారు. కానీ రోజులు గడుస్తున్నా వారు ఇటువైపు రాలేదు. కోటంరెడ్డి స్వయంగా సహాయం చేసి, రాజకీయంగా పెంచి పోషించినవారు కూడా ఆయనకు హ్యాండిచ్చారు. ఆదాల వైపు సర్దుకున్నారు. ఇప్పుడు మేయర్ స్రవంతి కూడా కోటంరెడ్డి వర్గం నుంచి దూరంగా జరగడం ఆయనకు పెద్ద షాకేనని చెప్పాలి. అయితే పోలింగ్ వ్యవహారానికి వచ్చే సరికి మేయర్ వర్గం కోటంరెడ్డి వైపు ఉన్నా లేకపోయినా ఒకటే అని చెప్పుకోవాలి. మేయర్ వర్గం కోటంరెడ్డి వైపు లేకపోయినా.. రూరల్ లో ఆయనకు తగ్గే ఓట్ల శాతం పెద్దగా ఉండదు. కాకపోతే మేయర్ కూడా తనవైపే ఉన్నారు అని ఇన్నాళ్లూ కోటంరెడ్డి చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. దీనిపై ఇంకా కోటంరెడ్డి వర్గం స్పందించలేదు. అటు మేయర్ వర్గం కూడా అధికారికంగా తాము టీడీపీకి దూరమవుతున్నామని స్పష్టం చేయలేదు. కానీ టీడీపీ కార్యక్రమాలకు హాజరు కావట్లేదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత అస్సలు స్పందించలేదు. పైగా ఈరోజు తాడేపల్లిలో సజ్జలను కలవడంతో నెల్లూరు మేయర్ తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారనే విషయం స్పష్టమైంది.