Paritala Ravi: ఒక నాయకుడు జనంలోంచి పుడుతాడు... ఇంకో నాయకుడు అణిచివేత నుంచి పడుతాడు.. మరో నాయకుడు పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు అందించాలన్న లక్ష్యంతో పుడుతాడు. కానీ రాయలసీమలో ఒక నాయకుడు మాత్రం ఈ పరిస్థితుల నుంచి పుట్టాడు. ఆయన ఆస్తమించి రెండు దశాబ్ధాలైనా ఇప్పటికీ ప్రజల గుండెల్లో ధ్వనిస్తున్న నాయకుడే పరిటాల రవీంద్ర. పరిటాల రవి అన్నది కేవలం పేరు మాత్రమే కాదు.. ఆ పేరు చాలా మందికి వణుకు తెప్పించేది. పీడిత ప్రజల గుండెల్లో ధైర్యం నింపేది.. పేదప్రజల కన్నీరు తుడిచేది.. అణగారిన వర్గాలకు అండగా నిలిచేది.. ఆ పేరుకు మతం లేదు, ప్రాంతం లేదు, శత్రువులకు తుది శ్వాస వరకు నిద్రలేకుండా చేసిన పేరు అది.. 

ఎవరూ ఊహించని ఉద్యమ కెరటంఅది 1958 ఆగష్టు 30.. ఆ రోజు ఈ ప్రాంతంలో ఒక నిప్పుకణిక పుడుతుందని.. భూస్వాములు, పెత్తందార్లను ఎదిరించే ఒక ఆయుధం పుడుతుందని.. ఇక్కడ ప్రజలకు అండగా నిలబడే ఒక ధైర్యం పుడుతుందని ఎవరూ ఉహించలేదు. అప్పటి  ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయితీ వెంకటాపురం గ్రామంలో పరిటాల శ్రీరాములు-నారాయణమ్మ దంపతులకు జన్మించిన వ్యక్తే పరిటాల రవీంద్ర. ఆయన ఈ ప్రపంచానికి దూరంగా ఉండేవారు. 1975 ప్రాంతంలో భూస్వాములు, ఫ్యాక్షనిజం చెలరేగుతున్న సమయంలో.. వారిని ఎదిరిస్తూ పేదల పక్షాన నిలుస్తున్న పరిటాల శ్రీరాములు, అయన సోదరుడు పరిటాల సుబ్బయ్య దారుణంగా హత మార్చారు ఇక్కడ భూస్వాములు.

తండ్రి చనిపోయే నాటికి పరిటాల రవీంద్ర వయసు 15 సంవత్సరాలు. ఎటు చూసినా నలువైపుల అలజడి... అభద్రతాభావం, అంతులేని అరాచకం. ఏ క్షణాన ఏ పెనుముప్పు ముంచుకొస్తుందో అంతుపట్టని పరిస్థితులు. అలాంటి సమయంలో కూడా పరిటాల రవీంద్ర సోదరుడు హరి.. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఎన్ కౌంటర్‌లో మరణించాడు. పరిటాల హరి మరణంతో కమ్ముకున్న చీకట్ల నుంచి పుట్టాడు అసలైన సూర్యుడు.. పరిటాల రవీంద్ర...

కమ్యూనిస్టు పోరాటాల నుంచి ప్రజానేత వరకు ప్రస్థానంభూస్వాములు, ఫ్యాక్షనిస్టులు పరిటాల రవీంద్ర మీద దృష్టిని సారిస్తే.. తిరగబడి వెంటాడే వాడు వచ్చాడని వారు ఊహించలేకపోయారు. ఓవైపు  పీపుల్స్ వార్ ఉద్యమంలో కీలకంగా మారిన పరిటాల రవి. భూస్వాములు, ఫ్యాక్షనిస్టుల ఏరివేత మొదలు పెట్టారు. ఎవరైనా ప్రజల జోలికి రావాలంటే భయపడేలా చేశారు. అప్పటి వరకు అధికారంలో ఆ నాయకులు ఎంత బలంగా ఉన్నా.. పరిటాల రవి పేరు చెబితే వణికిపోయేంతగా మార్చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్ పార్టీ స్థాపించారు. ఆ రోజు ధర్మవరం, పెనుకొండ ప్రాంతంలో ఉన్న పరిస్థితులకు.. ఆయన చలించారు. ఇంత అరాచకం ఏంటి.. ఇక్కడ ఈ ప్రజావ్యతిరేక శక్తులను ఎదిరించే వారే లేరా అన్న సమయంలో ఎన్టీఆర్‌కు పరిటాల రవి కనిపించారు. 

రాజకీయ ఆధిపత్యం కోసం హత్యలు, దాడులతో ఒక భయానక పరిస్థితులున్న సమయంలో ఎన్టీఆర్ పరిటాల రవిని రాజకీయాల్లోకి ఆహ్వానించారు. ఈ ప్రాంతంలో పోరాడాల్సింది ఆయుధం పట్టి కాదని.. అధికారం ఉంటే.. వీటిన్నింటికీ పరిష్కారం చూపించవచ్చన్నారు. సరిగ్గా 1993 జూన్ 7న రవి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి రాయలసీమ రాజకీయాలు ఇంకో మలుపు తిరిగాయి. 

రాజకీయంగా రవి వేసిన అడుగులు అప్పుడున్న అధికార పార్టీకి కలవరం సృష్టించాయి. అప్పట్లో ప్రజల పక్షాన పోరాడే క్రమంలో జైలుకు వెళ్లారు. అయినప్పటికీ జైలు నుంచే నామినేషన్ దాఖలు వేశారు. అప్పటికే ప్రజల గుండెల్లో బలమైన ముద్ర వేసుకున్న పరిటాల రవిని భారీ మెజార్టీతో గెలిపించారు. అంతే కాదు పరిటాల రవికి ప్రజల్లో ఉన్న అభిమానం, ఆయన నాయకత్వం చూసి ఎన్టీఆర్ మంత్రి వర్గంలో కార్మిక శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. 

ఆ తర్వాత కాలంలో అనంతపురం జిల్లా చరిత్ర పరిటాల రవీంద్ర అడుగు జాడల్ని అనుసరించిందంటే అతిశయోక్తి కాదు. అధికార బలంతో శత్రుసంహారం సాగిస్తాడని వేసుకున్న ప్రత్యర్దుల అంచనాలను పరిటాల రవీంద్ర చిత్తు చేశాడు. వివిధ గ్రామాల్లో ఫ్యాక్షన్ గ్రూపుల మధ్య రాజీ చేసి... ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించారు.

పోరాటాలే కాదు.. ప్రజా సేవ కూడాఓవైపు రాజకీయంగా బలమైన నాయకుడిగా ఎదగడమే కాకుండా.. శత్రువర్గాన్ని లేకుండా చేసుకున్నారు. కేవలం రాజకీయాల ద్వారానే ప్రజా సేవ కాదని సొంతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. పంటలు పండక, కరవుతో అల్లాడుతున్న సమయంలో పేదింట్లో వివాహాలన్నది భారంగా మారింది. తమ ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయలేక ఆత్మహత్యలు కూడా జరిగాయి. ఈ పరిస్థితిని గమనించి.. ఆ రోజుల్లోనే దాదాపు రెండున్నర లక్షలమంది జనం సమక్షంలో 550 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. 2004 ఫెబ్రవరిలో 1116 జంటలకు వివాహలు చేయించారు. రవి చేపట్టిన సేవా కార్యక్రమాలు జిల్లాలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాయి.

ప్రాణాలు తీస్తారని తెలిసినా.. వెనుకడుగు వేయని ధైర్యం అది

2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. పరిటాల రవీంద్ర గెలిచినా.. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో భయం పట్టుకుంది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వణుకు తెప్పించిన పరిటాల రవి వైపు అందరి కళ్లు పడ్డాయి. ఆయన్ని భౌతికంగా లేకుండా చేస్తారని అంతా ఊహించారు. ఎంతో మంది రవిని హెచ్చరించారు. కానీ పరిటాల రవీంద్ర మాత్రం భయంతో ఇంట్లో కూర్చోలేనని.. జనం మధ్యనే ఉంటానంటూ బయటకొచ్చారు. సెక్యూరిటీ తగ్గించినా.. చెడు సంకేతాలు వస్తున్నా.. ఆ రోజు జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. 

2005 జనవరి 24వ తేదీ... అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం. ఎంతో మంది నాయకులతో కార్యాలయం సందడిగా ఉంది. పార్టీ మీటింగ్ అయ్యాక ఆయన అడుగు బయటపెట్టారు. అంతే బుల్లెట్ల వర్షం కురింది. బాంబులు పడ్డాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. పరిటాల రవి రక్తపు మడుగులో కింద పడ్డాడు. పిడుగుపాటు వంటి ఈ వార్తతో ఆంధ్ర రాష్ట్రం భగ్గుమంది. చివరి క్షణం వరుకు ప్రజల అభిమానమే ఊపిరిగా భావించిన పరిటాల రవి మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. ఆ నాటి నుంచి ఈ నాటి వరకు అస్తమించని రవిగానే పరిటాలను చూస్తున్నారు. ఆయన మరణించి.. 20ఏళ్లైనా చెక్కుచెదరని అభిమానంతో వెంకటాపురంలో ఆయన ఘాట్ వద్దకు వచ్చి నివాళులర్పిస్తున్నారు...

Also Read: ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?

ఆగింది రవి గుండె మాత్రమే.. ఆయన ఆశయం కాదుసీమ నేలపై బడుగు బలహీన వర్గాల కోసం గ‌ర్జించిన నేత ప‌రిటాల ర‌వి... పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను అందించాలన్న తపనతో తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. ఫ్యాక్షన్ నిర్మూలన కోసం రాజీ లేని పోరు సాగించి, ఆ ఆశయ సాధనలోనే బలై పోయినా ఆయన ఆశయాలు మాత్రం కొనసాగుతున్నాయి. 

పరిటాల రవి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి అత్యధికంగా రోదించింది ఆయన సతీమణి పరిటాల సునీతమ్మ. చుట్టూ ఈ కుటుంబాన్నే నమ్ముకున్న వేలాది మంది జనం. పసి వయసులో ఉన్న ముగ్గురు పిల్లలు, వంటిల్లు తప్ప వేరే లోకం తెలియని సునీతమ్మ. అంత్యక్రియల తర్వాత గుండెను రాయి చేసుకుని నమ్మకున్న వారి కోసం ఆగిన రవి ప్రస్థానాన్ని మళ్లీ ప్రారంభించారు. నామినేషన్ వేశారు. ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దశాబ్ధ కాలం పాటు కాంగ్రెస్ పార్టీతో పోరాడారు. శత్రువులను ఎదుర్కొన్నారు. నమ్ముకున్న వేలాది మంది అండగా నిలబడ్డారు. 

ఓవైపు పిల్లల బాధ్యత ఇంకోవైపు రాజకీయాలతో సునీత రాటుదేలారు. పరిటాల కోటను చెక్కు చెదరనివ్వకుండా కాపాడారు. అంతే కాదు 2014 ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి కూడా చేపట్టారు. రాప్తాడు నియోజకవర్గంలో కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారు. ఇప్పుడు పరిటాల రవి అసలైన వారసుడు శ్రీరామ్ కూడా తల్లికి చేదోడుగా నిలిచారు. రవి వారసత్వాన్నే కాదు.. ఆయన ఆశయాల్ని, బాధ్యతల్ని కూడా అందుకున్నారు. రవి చేపట్టిన ఉచిత వివాహాలతోపాటు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ.. రవి పేరు పదిలంగా ఉంచుతున్నారు. ప్రతి ఏటా వర్ధంతి రోజున వేలాది మంది జనం సమక్షంలో రవి ఘాట్ వద్ద మీ ఆశయాలు కొనసాగిస్తామని ప్రమాణం చేస్తున్నారు తల్లీ కొడుకులు .

Also Read: నారా లోకేష్ బర్త్ డే స్పెషల్, 226 అడుగుల భారీ ఫ్లెక్సీ ఏర్పాటు- కారణం ఏంటో వివరించిన మంత్రి