Swami Paripoornananda BJP MP Candidate: త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వెళ్తున్నాయి. దాంతో ఏపీ నుంచి ఎంపీ అభ్యర్థులపై కసరత్తు జరుగుతోంది. మూడు పార్టీల పొత్తు ఖరారు కాగా, సీట్ల పంపకాలు దాదాపుగా ముగిశాయి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చలు జరపడం తెలిసిందే. బీజేపీ ఇదివరకే లోక్ సభ ఎన్నికలకు తొలి విడతలో 195 మంది అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితా త్వరలోనే విడుదల చేసేందుకు పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. ఏపీ నుంచి బీజేపీ పోటీ చేయనున్న 6 స్థానాల్లో ఒక అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద పేరును అధిష్టానం ఖరారు చేసింది.


 టీడీపీ 17 పార్లమెంట్ స్థానాల్లో, బీజేపీ 6 స్థానాల్లో, జనసేన 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. పొత్తులో భాగంగా రాయలసీమ నుంచి హిందూపురం, రాజంపేట పార్లమెంట్‌ స్థానాల నుంచి బీజేపీ బరిలోకి దిగనుంది. హిందూపురం బీజేపీ అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద పేరును పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ సీటు కోసం పలువురు నేతలు పోటీ పడినప్పటికీ.. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి బలమైన మద్ధతు ఉండడంతో పరిపూర్ణానంద స్వామి వైపు బీజేపీ మొగ్గు చూపింది. త్వరలోనే దీనిపై అధికారిక విడుదల చేయనున్నారు. తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ఇటీవల ఏబీపీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం స్వామీజీ చెప్పారు.  పరిపూర్ణానంద ఆశించినట్లుగా ఆయన ఈ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవనున్నారు. హిందూపురంలో కాషాయ జెండా ఎగురవేయాలని ధీమాగా ఉన్నారు. 



రాజంపేట స్థానానికి ఇద్దరి మధ్య పోటీ


రాజంపేట పార్లమెంట్‌ స్థానానికి బీజేపీలో ఇద్దరు సీనియర్‌ నేతలు పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాగా, మరొకరు బీజేపీ సీనియర్‌ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వై సత్యకుమార్‌. వీరిద్దరూ తీవ్రస్థాయిలో రాజంపేట సీటు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. బీజేపీలో సీనియర్‌ నేతలు, ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి కొంత వరకు సత్యకుమార్‌కు సపోర్ట్‌ ఉందని చెబుతున్నారు. ఆర్థికంగా బలమైన నేత కావవడంతో గెలుపు అవకాశాలు ఉంటాన్న భావనతో మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం పరిశీలలిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ ఇద్దరు నేతలు తమ తమ స్థాయిల్లో సీటు కోసం ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరు నేతలు బీజేపీ కీలక నేతలను కలుస్తూ తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇద్దరిలో ఎవరికి సీటు కేటాయించినా పోటీ ఆసక్తిగా మారనుంది. 


రాజకీయ ప్రత్యర్థి పెద్దిరెడ్డి కుటుంబంపై


చిత్తూరు జిల్లాలో మరీ ముఖ్యంగా పీలేరులో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌, ప్రస్తుత వైసీపీ సీనియర్‌ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఏళ్ల నుంచి రాజకీయ వైరం ఉంది. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి ఉన్నారు. రాజకీయంగా ప్రత్యర్థి కుటుంబానికి చెందిన వ్యక్తి ఉండడంతో తనకు అవకాశం ఇవ్వాలని, గెలిచి తన రాజకీయ ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశాన్ని కల్పించాలని కిరణ్‌కుమార్‌ రెడ్డి కోరుతున్నట్టు చెబుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉండడంతోపాటు మాజీ సీఎంగా రాష్ట్రమంతటా కాకుండా స్థానికులకు బాగా తెలిసిన వ్యక్తి కావడంతో కలిసి వస్తుందన్న భావనలో పార్టీ అధిష్టానం ఉంది. అయితే, సత్యకుమార్‌ పార్టీలోనే ఏళ్ల తరబడి ఉన్న వ్యక్తి కావడం, పార్టీకి లాయల్‌ కేండిడేట్‌ కావడంతో పునరాలోచనలో అధిష్టానం పడినట్టు తెలుస్తోంది. మరి వీరిద్దరిలో ఎవరి లాబీయింగ్‌ గెలుస్తుందో.. వారికే రాజంపేట సీటు లభించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.