AP Politics Online :   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బయటకు కనిపించని ఉద్రిక్తత సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే యుద్ధమే చేసుకుంటున్నారు. అటు వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వారియర్స్.. ఇటు తెలుగుదేశం పార్టీ డిజిటల్ సైనికులు ఒకరిపై ఒకరు ఆరోపణలతో హోరెత్తిస్తున్నారు.  అయితే ఇవన్నీ ప్రజా సంక్షేమం.. లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. కేవలం క్యారెక్టర్ల మీదనే.  ఎన్టీఆర్ టు వైఎస్ఆర్, జగన్ టు చంద్రబాబు,  స్టేట్ లీడర్ టు గల్లీ మినిస్టర్ ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. అందరి క్యారెక్టర్ల లెక్క తేల్చేస్తున్నారు. కాస్త సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్లు కూడా " ఇదేందయ్యా.. ఇది" అనుకునేలా వ్యవహారం సాగుతోంది. 


పోటాపోటీగా ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఫ్యామిలీ క్యారెక్టర్లపై జడ్జిమెంట్లు!


ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టాలని జగన్ నిర్ణయించి బిల్లు పాస్ చేసిన తర్వాత రెండు రోజుల పాటు అంశంపై చర్చ ఓ మాదిరిగా సాగింది. ఈ అంశంపై టీడీపీ సానుభూతిపరులందరూ స్పందించాలని ఆన్‌లైన్‌లోనే డిమాండ్లు వినిపించాయి. తప్పని సరి అన్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అప్పట్నుంచి రచ్చ ప్రారంభమయింది. అది ఇప్పుడు టర్న్ తీసుకుంది. సీనియర్ ఎన్టీఆర్ ఎలాంటి వ్యక్తి.. వైఎస్ఆర్ క్యారెక్టర్ ఎలాంటి అనే చర్చను ప్రారంభించేశారు. ఒకరికొకరు పోటీగా వీడియోలు పోస్ట్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్‌ పై దాడిశెట్టి  రాజా లాంటి నేతలు చేసే రకరకాల వ్యాఖ్యాలను సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రజెంట్ చేస్తున్నారు. పోటీగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా గతంలో రోశయ్య మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్నారు. తాజాగా జగ్గారెడ్డి వైఎస్ చనిపోయిన  సమయంలో ఏ మాత్రం బాధ లేకుండా కుటుంబం అంతా కూర్చుని ముఖ్యమంత్రి పదవి గురించి చర్చించుకున్నారని చేసిన వ్యాఖ్యలనూ హైలెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. 


రెండు పార్టీలూ పోటాపోటీగా పోస్టర్ల రాజకీయం ! 
 
వైఎస్ఆర్‌సీపీనేతలు చంద్రబాబు మాకు ఎన్టీఆర్ అవసరం లేదని అన్నారంటూ ఓ పత్రికలో వచ్చిన క్లిప్పింగ్‌ను పోస్టర్లుగా ప్రింట్ చేసి అంటించారు. వాటిని సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ చేశారు. ఇప్పుడు టీడీపీ నేతలు పోటీగా భారత్ పే కు పోటీగా భారతీపే అనే పోస్టర్లు అంటిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పేటీఎంకు పేరడీగా పేసీఎం పోస్టర్లు తెచ్చి నలభై శాతం  కమిషన్లు యాక్సెప్ట్ చేస్తారన్నట్లుగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఇప్పుడు భారతీ పే పేరుతో టీడీపీ నేతలు పోస్టర్లు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏపీలో రాజకీయాలు కుటుంబాలను టార్గెట్ చేసుకోవడం కామన్ అయిపోయింది. ప్రస్తుతం లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి సమీప బంధువు విచారణ ఎదుర్కొంటున్నారు.   అసలు ఆయన ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెట్టిన పెట్టుబడి అంతా.. ఏపీ నుంచి వచ్చిందని టీడీపీ నేతలు  ఆరోపణలు చేస్తున్నారు. పోటీగా ఇప్పుడు భారతీ పే పేరుతో పోస్టర్లు వైరల్ చేస్తున్నారు. 
 


ఎవరూ హద్దులు పెట్టుకోలేదు - అడ్డుకునేవారూ లేరు !


తమలపాకుతో నువ్వకొటి అంటే.. తలుపు చెక్కతో నేను రెండు అంటా అన్నట్లుగా రెండు పార్టీల నేతలూ.. సోషల్ మీడియా కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే  రెండు పార్టీలకు చెందిన వారి పోస్టులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే వాళ్లది వీళ్లు.. వీళ్ల పోస్టులు వాళ్లూ వైరల్ చేసుకుంటున్నారు. ఫలానా టీడీపీ వారియర్ ఇలా పోస్టు పెట్టాడు.. దీనికి కౌంటర్ అంటూ.. మరో పార్టీ వాళ్లు పోస్టులు పెడుతున్నారు. అలా..  వారికి తెలియకుండానే ఇతరుల పోస్టులు వైరల్ చేస్తున్నారు. దీంతో  రెండు పార్టీల సోషల్ మీడియాల కార్యకర్తలు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. వారి వారి పార్టీలను.. నేతల్ని వారికి తెలియకుండానే బద్నాం చేసుకుంటున్నారు. 


రూ. కోట్లు ఖర్చుపెట్టి పార్టీలు చేసుకునేది ఈ బూతుల యుద్ధమా ?


ఈ రోజుల్లో సోషల్ మీడియాది ప్రత్యేకమైన పాత్ర.  అబద్దమో.. నిజమో ఇతరుల గురించి  ఓ చెడు వార్తను హైలెట్ అయ్యేలా వైరల్ చేస్తే చాలా మైలేజీ వస్తుందని వారిపై వ్యతిరేకత పెరిగి తమకు ఓట్లేస్తారని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే స్ట్రాటజిస్టులను పెట్టుకుని మరీ సోషల్ మీడియా సైన్యాలను నడిపిస్తున్నాయి. రూ. కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అయితే ఎన్ని కోట్లు పెట్టినా ... సోషల్ మీడియా రాజకీయం ఎప్పుడూ నేలబారుగానే ఉంటోంది. ఏ మాత్రం సభ్యత.. సంస్కారం ఉండటం లేదు.  ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాదు అన్ని పార్టీలదీ అదే తీరు.