NTR centenary celebrations :  తెలుగు వారు ఉద్వేగానికి లోనయ్యే పేరు ఎన్టీఆర్‌.  తెలుగునేల పులకించి పోయే నేత కూడా  ఆయనే.  తెలుగు ప్రజలందరి చేత అన్నగారు అనిపిలిపించుకున్న మహానేత, యుగపురుషుడు.  తెలుగు నేల ఉన్నంత వరకూ ఆయన చిరస్మరణీయుడు.  తెలుగువారి సామాజిక రాజకీయ జీవనంలో ఎన్టీఆర్‌ది ఓ కీలక ఘట్టం. వందేళ్ల క్రితం ఆయన జన్మించారు. వెండితెరను ఏలారు. తర్వాత రాష్ట్రాన్ని పాలిచించారు. ఆ దిగ్గజం శత జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. 


సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడు


పౌరాణిక పాత్రలే కాదు... ఎందులో అయినా ఒదిగిపోయే తత్వం ఆయనది.  అలా  అశేష జనాన అభిమానాన్ని సంపాదించారు.  అందాల రాముడైనా.. శ్రీకృష్ణుడైనా ఆయనే. కేరెక్టర్‌ ఏదన్నది కాదు ముఖ్యం.. ఎదిగే కొద్దీ ఒదగాలంటూ నటనకు కొత్త అందాలు అద్దిన హీరో ఆయన. వెండితెరకు హీరోయిజాన్ని చూపెట్టి ఎంతో మందికి ఆదర్శమయ్యారు. ఎదురులేని కథానాయకుడిగా నిలిచారు. వందల సినిమాల్లో నటనే కాదు.. డైరెక్టర్‌గా ప్రొడ్యూసర్‌గా  ఎన్టీఆర్‌ది తెలుగు సినిమా చరిత్రలో .. వెండితెరపై ఓ సువర్ణాధ్యాయం.


సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు..!


60 దాటాక రాజకీయాల్లో అడుగుపెట్టేవాళ్లు అరుదు.. అయితే ఆ వయసును లెక్క చేయలేదు. ఆ పట్టుదలే ఆయన్ను చరిత్రలో నిలబెట్టింది.నిరుపేదల కన్నీళ్లు.. కష్ట జీవుల చెమటను ఎవరూ గుర్తించని రోజులు.  కాంగ్రెస్‌ బలీయమైన శక్తిగా దేశాన్ని ఏలుతూ.. స్థానిక నేతలను పూచికపుల్లలా తీసిపారేస్తున్న సమయంలో తొడగొట్టి పొలికల్‌ ఎంట్రీ ఇచ్చారాయన.  ఆయనకు తెలుగు ప్రజలు అద్దిన నీరాజనాలు ఢిల్లీ పెద్దలను కదలించాయి. కాకలు తీరిన యోధులకు సైతం సాధ్యం కాని పనిని అలవోకగా ఆయన చేసి  చూపించి అనితర సాధ్యుడయ్యారు. కేవలం 9  నెలల్లోనే కాంగ్రెస్‌ పార్టీని మట్టికరిపించారు. అందుకు ఆయన పడ్డ శ్రమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 1983 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చాక.. రాజకీయాలను సమూలంగా ప్రక్షాళన చేశారు. ఎమ్మెల్యేలకు ప్రవర్తన నియమావళి పెట్టారు. ఎన్టీఆర్‌ తాను నమ్ముకున్న సిద్దాంతాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించారు. దేశరాజకీయాల్లనూ ఆ తర్వాత బలీయమైన శక్తిగా ఎదిగారు.


బడుగులకు రాజ్యాధికారం ఇచ్చిన ఎన్టీఆర్ 
 
అప్పటి దాకా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలన్నీ భూస్వాములు, కొన్ని సామాజికవర్గాలవే. అయితే ముఖ్యమంత్రి అయ్యాయ ఆయన ఆ చరిత్రను తిరగరాశారు.  వెనుకబడిన వర్గాలను తెరపైకి తెచ్చారు.  ఎంతో మంది నేతలను తీర్చిదిద్ది మార్గదర్శకుడయ్యాడు. వ  సాంప్రదాయాలను బద్దలు కొడుతూ, డాక్టర్లు, లాయర్లు,  ఇంజనీర్లు ఇలా ఉన్నత విద్యావంతులందరినీ రాజకీయాల్లోకి తీసుకొచ్చిందీ అన్నగారే. యువతరానికి పెద్దపీట వేశారు. వెనుకబడిన కులాలకు పెద్దపీట వేస్తూ ఎన్టీఆర్‌ తీసుకున్న ఆనేక నిర్ణయాలు ఇప్పటి తరం నేతలకుస్ఫూర్తి దాత అయ్యారు. 


సంక్షేమ పథకాలకు ఆద్యుడు 


పేదలకు ఇళ్లు.. రెండు రూపాయల కిలో బియం, మధ్యాహ్న భోజనం  నిరుపేదలకు భూవసతి,  జనతా వస్ర్తాలు,  మధ్యాహ్న భోజనం, మురికివాడల్లో పిల్లలకు పాల పంపిణీ వంటి ఎన్నో పథకాలు ఎన్టీఆర్‌ను పేదల గుండెల్లో హీరోగా నిలిపాయి. కొన్నికోట్ల కుటుంబాల్లో చిరునవ్వును నింపాయి.  ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నిలబెట్టేందుకు, పేదవాడికి పట్టం కట్టేందుకు వెనుకాడని వీరుడు ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన చారిత్రక పథకం రెండు రూపాయలకే కిలో బియ్యం. ఈ పథకాన్ని ఎద్దేవా చేసిన కాంగ్రెస్‌ తర్వాత అదే పథకంతో ఓట్లడిగినా జనం ఓడించారు.
ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు


సంస్కరణలు తెచ్చి ప్రజల జీవితాల్ని మెరుగుపర్చిన నేత 


ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చే వరకు ఆంధ్రా ప్రాంతంలో మున్సబు, కరణాలు.. తెలంగాణ ప్రాంతంలో పటేల్‌, పట్వారీ వ్యవస్థ ఉండేది. ఆయా హోదాల్లో ఉండే వారు గ్రామాలను పిడికిలి పెట్టుకుకుని పేదల బతుకులతో ఆటలాడేవారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి కాగానే ఆ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసేశారు. ఆ స్థానంలో మండల వ్యవస్థను తీసుకొచ్చారు. తెలుగుభాష, సంస్కృతి అంటే ఎన్టీఆర్‌కు అమితమైన ప్రేమ ఉండేది. ఎన్టీఆర్‌కు - తెలుగుకు ఉన్న బంధం ఎంత బలమైందో చెప్పటానికి ఎన్నో ఉదాహరణలు. తెలుగు అంటే మరచిపోకుండా ఆనేక మార్పులు తెచ్చారు .ఆఫీసుల్లో తెలుగు పేర్లే పెట్టారు.  తెలుగు గంగ.. వంటి అనేక  పథకాలకు తెలుగుపేర్లు పెట్టి మాతృబాషతో ఉన్న మమకారాన్ని చాటుకునే వారు.ఆయన సంతకం కూడా తెలుగులోనే ఉండేది.  భాగ్యనగరం సిగలో ఒకటైన ట్యాంక్‌ బండ్‌ పై తెలుగు వెలుగుల విగ్రహాలు పెట్టించి ఇప్పటి తరం మదిలో వాళ్లందరినీ చిరస్మరణీయుడ్ని చేశారు. 


మరో వందేళ్లయినా మర్చిపోలేని దిగ్గజం


ఎన్టీఆర్‌ జీవన ప్రస్థానంలో వెలుగు నీడలు ఎన్ని ఉన్నా ఆయన తిరుగులేని నేత. ఎవరెన్ననా.. ఎవరు కాదన్నా.. ఎన్టీఆర్‌ది తెలుగునేలపైనే కాదు దేశ చరిత్రలో తిరుగులేని స్థానం. రాజకీయ రణతంత్రంలో ఆయనో మాస్‌ లీడర్‌.  మరో వందేళ్లయినా ఆయనను మర్చిపోలేం.