TDP Plan :   పులివెందులలో చంద్రబాబు, వినుకొండలో లోకేష్.. ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర..  మరో జిల్లాలో  మహిళా శక్తి కార్యక్రమం ఇలా రాష్ట్రంలో ఏ మూల చూసినా టీడీపీ కార్యక్రమాలే జరుగుతున్నాయా అన్నంతగా తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్తోంది. ఒక దాని తర్వాత ఒకటి కాకుండా.. ఒకటి కొనసాగుతూండాగనే మరో ప్రచార కార్యక్రమం ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడా గందరగోళం లేకుండా నేతలంతా  ఏదో ఓ కార్యక్రమంలో బిజీ అయ్యేలా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూడటంతో.. టీడీపీ మాత్రమే సీరియస్‌గా రాజకీయాలు చేస్తోందా అన్న అభిప్రాయం కల్పించేలా చేస్తున్నారు. 


రాయలసీమలో చంద్రబాబు జోరు 


ప్రాజెక్టుల పర్యటనకు చంద్రబాబు రాయలసీమలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పరిస్థితుల్ని బేరీజు వేసుకుని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడం.. అభ్యర్థులపై స్పష్టత ఇవ్వడం వంటివి చేస్తున్నారు. అదే సమయంలో రాజకీయ ప్రాజెక్టులను  ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసిందని.. దీని వల్ల.. రైతులు.. రైతు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. నంది కొట్కూరు, పులివెందుల వంటి చోట్ల చంద్రబాబు  పర్యటనకు వచ్చిన జన స్పందన  టీడీపీ నేతల్ని ఆశ్చర్య పరుస్తోంది. కొద్ది రోజుల కిందటే లోకేష్ రాయలసీమలో పాదయాత్ర చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఆ జోష్ ను కంటిన్యూ చేస్తున్నారు. 


భారీ జనస్పందనతో లోకేష్ యువగళం పాదయాత్ర 


తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర  ఊహించని ప్రజాదరణతో సాగుతోంది.     పార్టీ నేతలు లోకేష్ పాదయాత్రను సీరియస్ గా తీసుకున్నారు. నిజానికి లోకేష్ పార్టీ అధ్యక్షుడు కాదు.. సీఎం అభ్యర్థి కాదు. అయినా సరే.. ఆయన పాదయాత్రకు ఈ రేంజ్ లో స్పందన రావడం టీడీపీ నేతల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది. లోకేష్ లోతైనా సబ్జెక్ట్స్ నుంచి చూడకుండా మాట్లాడుతున్నారు. అందరికీ వివరణ ఇస్తున్నారు. ఆయన కు విషయ పరిజ్ఞానం సామాన్యులను ఆశ్చర్య పరుస్తోంది. కాలానికి తగ్గట్లుగా మారే నాయకుడ్ని చూస్తున్నారు. వైసీపీ నేతలకు మాటలతో సమాధానం ఇస్తున్నారు. రాజకీయ వ్యూహాల ప్రకారం స్పందిస్తున్నారు. ఈ ఆరు నెలల్లో … ఓటర్లు ఓట్లేసిన మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో భారీ విజయం సాధించారు. ఆ ఉత్సాహంతో.. యువగళం మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికి వినుకొండ చేరుకున్నారు. 


భవిష్యత్‌కు గ్యారెంటీ, మహాశక్తి పథకాల ప్రచారం


మరో వైపు తెలుగుదేశం పార్టీ మహానాడులో  మినీ మేనిఫెస్టోను ప్రకటించింది. ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లందుకు భవిష్యత్ గ్యారెంటీ పేరుతో  బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో చురుగ్గా పర్యటిస్తున్నారు. మహాశక్తి పేరుతో మహిళలకు ప్రత్యేకమైన  పథకాలను ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పార్టీ ఏది రోడ్ల మీద ఉందంటే్.. ఎదురుగా టీడీపీనే కనిపిస్తోంది. అధికార పార్టీ వైసీపీ.. జగన్ జిల్లాల పర్యటనలు, గడప గడపకు మన ప్రభుత్వం వంటివిచేపడుతున్నారు. జనసేన పార్టీ పవన్ కల్యాణ్ బయటకు వచ్చినప్పుడే సందడి ఉంటోంది. ఈ క్రమంలో చూస్తే.. టీడీపీ.. ఇప్పటికే ప్రచారంలో డామినేట్ చేస్తోందని అనుకోవచ్చు.