Andhra Pradesh: దేశవ్యాప్తంగా మరికొద్ది రోజుల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. శనివారం (మార్చి 2న) 195 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది.  ఈ జాబితాలో తెలంగాణలోని 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కానీ ఈ లిస్ట్‌లో ఏపీ నుంచి ఒక్క స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించకపోవడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. ఏపీలో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందనే ప్రచారం గత కొద్ది రోజులుగా జోరందుకుంది. ఏపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించకపోవడంతో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు ఖాయమనే ఊహాగానాలకు మరింత బలం చేకూరుతుంది. 


రెండు రోజులుగా సమావేశాలు 
విజయవాడలో గత రెండు రోజులుగా రాష్ట్ర బీజేపీ నేతలతో బీజేపీ అధిష్టానం చర్చలు జరుపుతోంది. అధిష్టానం దూతగా రాష్ట్రానికి వచ్చిన బీజేపీ జాతీయ నేత శివప్రకాశ్..  కాషాయ నేతలతో విడివిడిగా భేటీ అవుతున్నారు. పొత్తు పెట్టుకోవాలా? లేదా? అనే దానిపై నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. నేతల అభిప్రాయాలను నోట్ చేసుకుంటున్న శివప్రకాశ్.. పొత్తులు ఉంటే ఎన్ని సీట్లు గెలుచుకోగలం? లేకపోతే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? అనే దానిపై ఆరా తీస్తున్నారు. టీడీపీ-జనసేన పొత్తులో కలవడం వల్ల లాభం జరుగుతుందని కొంతమంది నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇక మరికొంతకొంత మంది నేతలు మాత్రం ఒంటరిగా పోటీ చేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని తన ఓపీనియన్ చెప్పారు. ఇక ఇంకోంతమంది నేతలు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పేశారు. నేతల అభిప్రాయాలను స్వీకరించిన అనంతరం అధిష్టానం పెద్దలకు శివప్రకాశ్ రిపోర్ట్ అందించనున్నారు.


పొత్తుల విషయంపై త్వరగా క్లారిటీ ఇస్తే బాగుంటుందని మరికొంతమంది నేతలు శివప్రకాశ్‌కు వివరించారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి నేతలతో శివప్రకాశ్ భేటీ కొనసాగుతోంది. ఉదయం రాయలసీమకు సంబంధించిన నేతలతో ఆయన భేటీ అయ్యారు. తిరుపతి, చిత్తూరు, కడప, నంద్యాల అనంతపురం జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. రాయలసీమ జిల్లాల్లో పార్టీ పరిస్థితి గురించి తెలుసుకున్నారు. 


ఏపీ బీజేపీలో కన్‌ఫ్యూజన్  
ఏపీలో బీజేపీ స్ట్రాటజీ కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఒకవైపు టీడీపీ, జనసేనతో పొత్తు ఉంటుందని సీఎం రమేష్, విష్ణుకుమార్ రాజు చెబుతుండగా.. పొత్తులపై మాత్రం అధికారికంగా క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉండదని, బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందనే ప్రచారం నడుస్తోంది. దీనిపై కూడా బీజేపీ నేతలు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఏపీలో పొత్తులు ఉంటాయని, ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తారంటూ ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక జాతీయ మీడియా ఛానెల్ సదస్సులో  క్లారిటీ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల కొంతమంది బయటకు వెళ్లవచ్చని, మళ్లీ వస్తే ఆహ్వానిస్తామని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన పొత్తు గురించే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ పొత్తులపై నిర్ణయం తీసుకోవడంపై అధిష్టానం ఆలస్యం చేస్తుండటంతో పార్టీ నేతల్లో కన్‌ప్యూజన్ నెలకొంది. పొత్తులపై ఏదోకటి క్లారిటీ ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. అయితే పొత్తులపై క్లారిటీ వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించాలనే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.