Mudragada  will contest  from Pithapuram On Pawan Kalyan  :  ముద్రగడ పద్మనాభం మళ్లీ వైసీపీలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయబోతున్నారని ప్రచారం ప్రారంభం కాగానే .. అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన వంగా గీతను సీఎం క్యాంప్ ఆఫీస్ కు పిలిపించారు. అయితే అభ్యర్థిత్వం మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని ఆమె చెబుతున్నారు. కానీ పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తే వైసీపీ తరపున ముద్రగడే పోటీ చేస్తారని .. వైసీపీ వర్గాలు గట్టిగా నమ్ముతన్నాయి. 


పవన్ పై గట్టి అభ్యర్థిని నిల బెట్టాలనే ఆలోచన 


ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సీటు మార్చే దిశగా అధికార పార్టీ వైసీపీ కసరత్తు ప్రారంభిచిందని ఒక్క సారిగా గుప్పుమంది.  జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం(Pithapuram) నుండి పోటీ చేస్తారని ప్రచారంలో ఉండడంతో అధికార పార్టీ అలర్ట్ అవుతోంది. పవన్ పై గట్టి అభ్యర్థి ఉండాలని.. వంగా గీత అయితే పోటీ ఇవ్వలేరని అనుకుంటున్నారు. దీంతో ఆమెను.. క్యాంప్ ఆఫీస్ కు పిలిపించి రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఆమెతో సీటు మార్పు అంశంపై చర్చించనప్పటికీ.. బయట జరుగుతున్న ప్రచారంతో మానసికంగా రెడీ చేస్తున్నారని అంటున్నారు. తనకు ఎక్కడ సీటు ఇచ్చినా పోటీ చేస్తానని వంగా గీత అంటున్నారు. 


మద్రగడను ఇంతకు ముందు వద్దనుకున్న వైసీపీ 


నిజానికి ముద్రగడ పద్మనాభం గతంలో వైసీపీలో చేరాలనుకున్నారు.  చాలా కాలంగా ఆయన వైసీపీకి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు ఇచ్చి ఐదు శాతం రిజర్వేషన్లు రద్దు చేసినా ముద్రగడ పెద్దగా మాట్లాడలేదు. జనవరి ఒకటో తేదీన ఆయన స్వగ్రామంలో సమావేశం పెట్టి వైసీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించాలని అనుకున్నారు. మద్రగడ లేదా ఆయన కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇచ్చేందుకు వైసీపీ హైకమాండ్ సిద్దమయిందని చెప్పుకున్నారు. కానీ తర్వాత వైసీపీ పెద్దలు వెనుకడుగు వేయడంతో.. ముద్రగడ అధికారిక ప్రకటన చేయలేదు. వైసీపీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో టీడీపీ లేదా జనసేనలో చేరుతానని ప్రకటించారు. ఆ పార్టీల నుంచి కూడా ఆయనకు ఆహ్వానం అందులేదు. అయితే ఇప్పుడు పవన్ పై నిలబెట్టడానికి ఆయన సరిపోతారని వైసీపీ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 


పోటీ చేసే స్థానంపై ఇంకా అధికారిక ప్రకటన చేయని పవన్  


ముద్రగడ లేక అతని కొడుకు గిరిని… పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు ఒప్పించాలని వైసీపీ అనుకుంటోంది. అలాగే వంగా గీతను కాకినాడ పార్లమెంటు పరిధిలో మరోక స్ధానంలో పెట్టాలని భావిస్తోంది  పవన్ కల్యాణ్(Pawan Kalyan) మాత్రం తాను పోటీ చేసే స్థానం కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా….జనసేనాని మాత్రం దాని గురించి ఒక నిర్ణయానికి రాలేదు. పిఠాపురం, అటు గాజువాకలో మరోమారు సర్వేలు చేయిస్తున్నట్లు చెబుతున్నారు.  పవన్ పోటీ చేస్తేనే ఈ లెక్కలన్నీ అని లేకపోతే వంగా గీతనే అక్కడ్నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.