Nitish Politics :   బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిల్లీలో వరుస  భేటీలు నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీతో పాటు కమ్యూనిస్టుల్ని.. ఇతర బీజేపీ వ్యతిరేకుల్ని కలుస్తున్నారు. ఆయన లక్ష్యం మోదీకి వ్యతిరేకంగా కూటమిని కట్టడమే. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీకి యాభై సీట్లు కూడా రావని ఆయన ధీమా.  బయట అదే చెబుతున్నారు. అయితే ప్రతిపక్షాలను ఏకం  చేయడం సాధ్యమవుతుందా ? ఇప్పటి వరకూ ఆ ప్రయత్నాలు  చేసిన వాళ్లంతా ఎందుకు సైలెంట్ అయ్యారు? వారెవరికీ సాధ్యం కానిది నితీష్‌కు సాధ్యమవుతుందా  ?


విపక్షాలను ఏకం చేసే మిషన్ ప్రారంభించిన నితీష్  కుమార్ !


నన్నామొన్నటిదాకా బీజేపీ భాగస్వామ్య పక్షమైన జేడీయూ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టే పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకూ ధర్డ్ ఫ్రంట్ లేదా బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేందుకు లేదా ఏర్పాటు చేసేందుకు ప్రత్యక్షంగా ఎప్పుడూ ప్రయత్నించని నితీష్ కుమార్ ఇప్పుడు ఢిల్లీ వేదికగా అందర్నీ కలుస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కలసి పోరాడాలని సూచిస్తున్నారు. అందరూ కలిస్తే బీజేపీకి యాభై సీట్లకు మించి రావని కూడా చెబుతున్నారు. ఆయన లెక్కలు ఆయనవి. నిజంగానే బీజేపీ కాకుండా ఇతర పక్షాలన్నీ ఏకమైతే బీజేపీకి గడ్డు పరిస్థితి ఉంటుందన్న ప్రచారం, విశ్లేషణలు చాలా కాలం నుంచి ఉన్నాయి. కానీ అలా విపక్షాలను ఏకం చేయడమే ఎవరికీ సాధ్యం కాడవం లేదు. చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు నితీష్ కుమార్ వంతు. 


మమతా నుంచి కేసీఆర్ వరకూ కూటమి ప్రయత్నాలు చేసి విఫలం ! 


గత ఎన్నికలకు ముందు నుంచీ బీజేపీయేతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. మమతా బెనర్జీ వల్ల కాలేదు. చంద్రబాబు తిరిగి తిరిగి సొంత రాష్ట్రంలో పట్టు కోల్పోయారు. కేసీఆర్ ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఇంకా అడుగు ముందుకు వేయలేకపోయారు.  శరద్ పవార్ వయసైపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే విపక్ష కూటమిలో ప్రాంతీయ పార్టీల్లో మోదీకి ధీటైన నేత లేరు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ ఉన్నా.. సరిపోవడం లేదు. అందుకే అందరూ సైలెంట్‌గా ఉన్న సమయంలో నితీష్ కుమార్ రంగంలోకి దిగారు. 


బీహార్‌లో వరుసగా గెలుస్తున్న సమయంలో నితీష్‌కు ప్రధాని అభ్యర్థి ఇమేజ్ ! 


ఎన్డీఏ కూటమిలో నితీష్‌కు ఒకప్పుడు మోదీ కన్నా ఎక్కువ ఇమేజ్ ఉండేది. బీహార్‌ను మార్చేశారని.. సుపరిపాలకుడని.. ఆయన దేశానికి మంచి నాయకత్వం ఇవ్వగలరని చెప్పుకున్నారు. నితీష్ కూడా ఆశపడ్డారు. 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని ఖరారు చేసే ముందు నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థి కావాలని ప్రయత్నించారు. నితీష్ కుమార్ అప్పట్లో మోడీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఎన్డీయే నుంచి తమ పార్టీ వైదొలగుతుందని హెచ్చరించారు. అన్నట్లుగానే మోదీనే ఖరారు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. తర్వాత మళ్లీ కలవక తప్పలేదు. అయితే మోదీ ప్రదాని అయిన తర్వాత ఆయన ఇమేజ్ అమాంతం పెరిగింది. నితీష్ మాత్రం ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోయారు. పైగా ఆయన పార్టీ కరిగిపోతోంది. 


నితీష్ కుమాద్‌ది కూడా చివరిప్రయత్నమే !


నితీష్ చివరి ప్రయత్నంగా వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా తెర ముందుకు రావాలని .. వ్యూహం పన్నారు. ఇటీవల నితీష్ కు కూడా ప్రధానమంత్రి అయ్యేందుకు అవసరమైన అర్హతలు ఉన్నాయని, సమర్ధుడైన జాతీయ నాయకుడని ఆ పార్టీ తీర్మానం చేసింది. మోదీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత వ్యతిరేకతపెరిగిందని నితీష్ భావిస్తున్నారు. ఇతరులకు చేతకానిది .. నితీష్‌కు సాధ్యమవుతుందా అన్నదే ఇక్కడ కీలకం.