KCR National Politics :  టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రయత్నాలు ఆయనకు తెలియకుండానే మలుపులు తిరుగుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో .. నేషనల్ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడుతారని అనుకున్న పార్టీలన్నీ మెల్లగా కాంగ్రెస్ కూటమి వైపు చేరుతున్నాయి. చివరికి ఇటీవల కేసీఆర్ బీహార్ పర్యటన తర్వాత తనతో కలిసి నడుస్తారని ఎంతో ధీమాగా అనుకున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా కాంగ్రెస్ కూటమికే జై కొట్టారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లేకుండా  బీజేపీని ఓడించే చాన్సే ఉండదని ఆయన తేల్చేశారు. 


కాంగ్రెస్ వైపు కదులుతున్న బీజేపీ వ్యతిరేక పార్టీలు !


నితీష్ కుమార్ నిన్నామొన్నటి వరకూ బీజేపీతో పొత్తులో ఉండేవారు. ఇప్పుడు బయటకు వచ్చి ఆర్జేడీ,  కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇదంతా జాతీయ రాజకీయాల కోణంలోనే చేశారని అందరూ నమ్ముతున్నారు. ఆయన నేతృత్వంలో ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడతాయన్న  ప్రచారం కూడా జరిగింది. కానీ నితీష్ కుమార్ చివరికి  కాంగ్రెస్ కూటమిలో చేరాలని నిర్ణయించుకున్నారు. మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ కూటమి వైపు చూస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రధాని మోదీని మమతా బెనర్జీ  పొగుడుతున్నప్పటికీ .. ఆ పార్టీతో ఎలాంటి పరిస్థితుల్లోనూ కలిసే అవకాశం ఉండదు. బెంగాల్‌లో మమతా బెనర్జీకి   బీజేపీనే ప్రత్యర్థి. అందుకే జాతీయ రాజకీయాల్లో సొంత ప్రయత్నాలు చేయడం కన్నా కాంగ్రెస్‌తో కలవడం మంచిదని ఆమె భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. కర్ణాటకలో జేడీఎస్ కూడా కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ కూటమిలో డీఎంకే , ఎన్సీపీ లాంటి బలమైన పార్టీలు ఉన్నాయి. కేరళలో తప్ప అన్ని చోట్ల కమ్యూనిస్టులు కూడా కలిసే అవకాశం ఉంది. 


ప్రాంతీయ పార్టీల నేతల ప్రయత్నాలు మొదటే ఫెయిల్ !


హర్యానా   దివంగత సీఎం దేవీలాల్ జయంతిని 'సమ్మాన్ దివస్' పేరుతో  ఆదివారం  ర్యాలీ  నిర్వహించారు. ఈ ర్యాలీకి హాజరైన వారు ప్రాంతీయ పార్టీల కూటమి గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ నితీష్, తేజస్వి లాంటి వాళ్లు మాత్రం బీజేపీ వ్యతిరేకంగా కూటమి ఉంటుంది.. అందులో కాంగ్రెస్ ఉంటుందని తేల్చి చెప్పేశారు. అంటే.. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రత్యేకంగా కూటమి ఉండకపోవచ్చని అర్థం అవుతుంది. ప్రస్తుతం దేశంలో రాజకీయ పార్టీలన్నీ బీజేపి అనుకూల.. వ్యతిరేక పార్టీలుగా చీలిపోయాయి. బీజేపీ రాజకీయాల కారణంగా కొన్ని పార్టీలు పొత్తులు పెట్టుకోకపోయినా సామంత పార్టీలుగా ఉండిపోతున్నాయి. కూటమిలో ఉన్న పార్టీలు మాత్రం గుడ్ బై చెబుతున్నాయి. కాంగ్రెస్ తో ఉన్న పార్టీలు మాత్రం ఆ పార్టీతోనే ఉన్నాయి. బలమైన ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో కూటమిలో ఉన్నాయి. నితీష్ , మమతా బెనర్జీ కూటమిలో భాగం అయితే..ఎస్పీ లాంటి ఇతర పార్టీలు మొగ్గు చూపే అవకాశం ఉంది. అదే జరిగితే కాంగ్రెస్ కూటమి బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.


కేసీఆర్ ఏం చేయబోతున్నారు !?


దసరాకు జాతీయ పార్టీ లేదా వేదిక పెట్టాలని కేసీఆర్ చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు . ఢిల్లీలో సొంతంగా టీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా నిర్మించారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు తరచూ వార్తలు వస్తున్నాయి. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నాయి. జాతీయ రాజకీయ పరిణామాల కారణంగా కేసీఆర్ ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త పేరుతో జాతీయ పార్టీ పెడితే .. దేశవ్యాప్తంగా ఓ రకమైన మూవ్‌మెంట్ తీసుకు రాకపోతే తెలంగాణలో బలహీనపడతామన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది. అలాగే కేసీఆర్‌తో కలసి వచ్చే నేతలెవరూ కనిపించకపోవడం... పార్టీ ప్రకటన లేదా.. కూటమి ప్రకటన ఆలస్యమవుతోందన్న అంచనా ఉంది. 


కాంగ్రెస్ కూటమి వైపే కేసీఆర్ మొగ్గు చూపుతారా !?


ఇటీవల కాంగ్రెస్ కూటమి వైపు కాంగ్రెస్ మొగ్గు చూపుతారన్నప్రచారం ఊపందుకుంది. భారత్ జోడో యాత్ర ప్రారంభం సందర్భంగా కొంత మంది  సీనియర్ కాంగ్రెస్ నేతలు.. తెలంగాణలో టీఆర్ఎస్ వంటి పార్టీలను కలుపుకుని వెళ్తామని ప్రకటించారు. అయితే రాష్ట్ర నేతలు మాత్రం ఖండించారు. రాష్ట్ర స్థాయిలో కాకపోయినా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వైపే టీఆర్ఎస్ మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. బీజేపీ తెలంగాణలో ప్రధాన పోటీదారుగా ఆవిర్భవించడమే కాదు..  బీజేపీపై కేసీఆర్ తీవ్ర స్తాయిలో పోరాడుతున్నారు. అందుకే కాస్త ఆలస్యమైనా కేసీఆర్  కూడా నితీష్ బాటలోనే పయనించవచ్చని ఢిల్లీ రాజకీయవర్గాలు గట్టి అంచనాకు వచ్చాయి.