Nellore Ysrcp : ఏపీ మంత్రివర్గ విస్తరణతో నెల్లూరులో పొలిటికల్ వార్ మొదలైంది. జిల్లా వైసీపీలో అంతర్గత కుమ్మలాటలు జరుగుతున్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ వ్యవహారశైలి వైసీపీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. జిల్లా నుంచి మంత్రిగా స్థానం దక్కిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఈనెల 17న తొలిసారిగా సొంత నియోజకవర్గానికి వస్తున్నారు. అదే రోజు వైసీపీ కార్యకర్తలు, తన అనుచరులతో అనిల్ కుమార్ భారీ సభకు ఏర్పాట్లు చేస్తు్న్నారు. కాకాణికి స్వాగతం పలికే రోజే అనిల్ సభ పెట్టడంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.
రెట్టింపు సహకారం అందిస్తా
నెల్లూరులో రేపు నిర్వహించే సభ ఏర్పాట్లను మాజీ మంత్రి అనిల్ శనివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ సభ బల ప్రదర్శన కోసం కాదన్నారు. కేవలం నెల్లూరు నగర నియోజకవర్గం కార్యకర్తలు మాత్రమే సభకు వస్తున్నారన్నారు. ఈ సభ ఎవరికీ పోటీ సభ కాదన్నారు. సభ అనుమతి కోసం మూడ్రోజుల ముందే పోలీసులకు దరఖాస్తు చేశానన్నారు. తన సభను కొందరు వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపించారు. తానెప్పుడూ జగన్‌కు సైనికుడిగానే ఉంటానని, సభ వాయిదా వేసుకోవాలని అధిష్ఠానం సూచించలేదన్నారు. ఎవరో కార్యక్రమం పెట్టారని తాను సభ నిర్వహించలేదని పేర్కొన్నారు. ఇటీవల మంత్రి కాకాణికి సహకారం అందిస్తారా అని విలేకరలు అడిగిన ప్రశ్నకు అనిల్ కుమార్ స్పందించారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి కాకాణి తనను ఆహ్వానించలేదన్నారు. పిలవకుండా తాను ఎందుకు వెళ్లాలన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి అందించిన సహకారం కచ్చితంగా తాను రెండింతలు అందిస్తానన్నారు. ఎవరేమన్నా కాకాణి జిల్లా మంత్రి అని నెల్లూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అవసరమని భావిస్తే తప్పకుండా ఆహ్వానిస్తామని అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
కాకాణి ఫ్లెక్సీలు తొలగింపు
అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇప్పుడు సిటీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి కాస్త దూరమైనా, ఇప్పుడు ప్రజల్లోనే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దశలో ఇద్దరు ఎమ్మెల్యేలు సమావేశం కావడం, అనంతరం ఎవరూ ఎలాంటి ప్రకటన చేయకపోవడం నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ విషయంలో, కొత్తగా కాకాణికి పదవి దక్కిన సందర్భంలో నెల్లూరు వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయని అంటున్నారు. కాకాణి, ఆనం రామనారాయణ రెడ్డి ఒక వర్గం కాగా.. మిగతా ఎమ్మెల్యేలలో కొంతమంది మరో జట్టుగా తయారయ్యారని అంటున్నారు. ఇటీవలే నెల్లూరు సిటీలో కాకాణి ఫ్లెక్సీలు తొలగించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. మరో రెండు రోజుల్లో మంత్రి కాకాణి సొంత జిల్లాకు వస్తున్న సందర్భంలో నెల్లూరు పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారాయి.