Ysrcp Internal Politics : నంద్యాల వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సొంత పార్టీ నాయకులే ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. జిల్లాలో అరాచకాలు పెరిగిపోయాయని, రౌడీలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి వద్దే పంచాయితీ తేల్చుకునేందుకు వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నారు. కొత్త జిల్లా ఏర్పాటుతో అధికార పార్టీ నాయకులు తమ పార్టీ క్యాడర్ ను బలపరుచుకోవడంతోపాటు రాబోయే ఎన్నికల్లో సీటు దక్కించుకోవడం కోసం, పార్టీ దృష్టిలో పడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నంద్యాల జిల్లా వైసీపీలో రెండు వర్గాలు తయారయ్యాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వీరి వ్యవహారం మారింది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నంత వర్గ విభేదాలు ముదిరాయని ప్రచారం జరుగుతోంది.
శిల్పా రవిచంద్ర రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. జిల్లాల ఏర్పాటు తర్వాత పలు జిల్లాల్లో రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లాలో కూడా అటువంటి రాజకీయమే మొదలైంది. అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు, స్థానిక ఎమ్మెల్యేకు మధ్య రోజు రోజుకీ వివాదాలు ముదురుతున్నాయి. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డికి, అధికార పార్టీకే చెందిన మలికి రాజగోపాల్ రెడ్డికి మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంది. ఒకరికొకరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు.
రౌడీ షీటర్లను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు!
ఇటీవల కాలంలో నంద్యాల నగరంలో కొందరు గుర్తుతెలియని అల్లరి మూకలు బస్టాండ్ పరిసర ప్రాంతాలలో న్యూసెన్స్ చేస్తున్నారని ఓ పోలీస్ కానిస్టేబుల్ వారిని ప్రశ్నించాడు. ఇలా అడిగినందుకు దుండగులు కానిస్టేబుల్ ను నగర శివారులో దారుణంగా హత్య చేశారు. అయితే పోలీస్ కానిస్టేబుల్ ను హత్య చేసిన నిందితులను కడప కేంద్ర కార్మాగారంలో స్థానిక ఎమ్మెల్యే రవిచంద్రారెడ్డి పరామర్శించినట్లు రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తాను జైలుకు వెళ్లినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని లేదంటే రాజగోపాల్ రెడ్డి తప్పుకోవాలని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డి సవాల్ చేశారు. అధికారంలో ఉన్నందుకు ఆధారాలు తారుమారు చేస్తున్నారని ఎమ్మెల్యేపై రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేశారు. నంద్యాలలోని రౌడీ మూకలకు ఎమ్మెల్యే అండగా నిలుస్తున్నారన్నారు. నంద్యాలలో గత మూడు సంవత్సరాలలో దాదాపు 20 హత్యలు జరిగాయని మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ సొంత పార్టీ నాయకుడైన ఎమ్మెల్యే పై విరుచుకుపడ్డారు. ల్యాండ్ ఆర్డర్స్ కాపాడడానికి శాంతి భద్రత లోపించడానికి ఎమ్మెల్యేనే కారణమని ఆరోపించారు. పోలీస్ కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఉపఎన్నికల సమయంలో ఆరోపణలు
నంద్యాల జిల్లాలో జరిగిన ఉపఎన్నికల్లో తనపై అవినీతి ఆరోపణలు చేశారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికలలో రాజగోపాల్ రెడ్డి డబ్బుకు అమ్ముడుపోయారని అవాస్తవాలు సృష్టించి ప్రచారం చేశారన్నారు. ఉప ఎన్నికలలో తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే పార్టీకి రాజీనామా చేస్తానని, రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవాస్తవాలను సృష్టిస్తూ గుండా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
జగన్ వద్దే తేల్చుకుందాం
నంద్యాల చరిత్రలో ఏ ఎమ్మెల్యే అధికారంలోనూ ఇన్ని హత్యలు, అరాచకాలు, రియల్ దందాలు జరగలేదని వైసీపీ నేత రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల కానిస్టేబుల్ హత్యను దమ్ముంటే సీబీఐకు అప్పగించాలన్నారు. కేంద్రకారాగారంలో ఉన్న రౌడీలను కడపలో కలిసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. రౌడీలు ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ తిరిగి పూలదండలు వేసింది నిజం కాదా అన్నారు. ఈ విషయాన్నిముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్దామని మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. నంద్యాలలో శాంతి భద్రతలకు కాపాడటం చేతకాకపోతే ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.