Nagari YSRCP: వైఎస్ఆర్‌సీపీ పరిస్థితిని మళ్లీ గాడిన పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా చేరికల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే శైలజానాథ్ ను చేర్చుకున్న ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్లను ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఖాళీగా ఉన్న ఇతర నేతల్ని కూడా చేర్చుకునే ఆలోచనలు చేస్తున్నారు. నగరి నియోజకవర్గంలో తాజాగా మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి జగదీష్ ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల్లో ఆయనకు పార్టీ కండువా కప్పే అవకాశం ఉంది. 

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గాలి భాను ప్రకాష్  .. ముద్దుకృష్ణమనాయుడు మొదటి కుమారుడు. ఆయన రెండో కుమారుడు జగదీష్. ఆయన కూడా నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు.  గాలి జగదీష్ కు.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సోదరుడు గాలి భానుప్రకాష్ కు సరిపడటం లేదు. తండ్రి చనిపోయాక ఎవరి దారి వారిదయింది. ఓ సందర్భంలో ఇద్దరూ టీడీపీ టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. కానీ చంద్రబాబు భాను ప్రకాష్ వైపే మొగ్గారు. తల్లి మద్దతు జగదీష్ కే ఉంది.  అయితే జగదీష్ మామ కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నేత. ఆయన సాయంతో ఇప్పుడు వైసీపీలో టిక్కెట్ హామీతో చేరేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం నగరిలో జరుగుతోంది.                 

అయితే నగరి నియోజకవర్గంలో కీలక నేతగా రోజా ఉన్నారు. అక్కడ్నుంచి రెండు సార్లు గెలిచారు. మంత్రిగా చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇటీవల మళ్లీ తన నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో ఆమెకు పోటీగా మరో నేతను చేర్చుకుంటే రోజా మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. గాలి జగదీష్ చేరిక అంశంపై రోజాకు సమాచారం ఇవ్వలేదు కానీ.. విషయం మాత్రం ఆమెకు తెలిసిందని అంటున్నారు. జగదీష్ ను చేర్చుకోవద్దని పార్టీ హైకమాండ్ కు ఆమె చెప్పినట్లుగా వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. 

జగన్ మాత్రం ఇప్పుడు నియోజకవర్గాల్లో సామ్రాజ్యాలేమీ లేవని..  పార్టీ బలోపేతం కోసం కలసి వచ్చే నేతలందర్నీ చేర్చుకుంటామని చెబుతున్నారు. అందరూ కలిసి పార్టీని బలోపేతం చేస్తే ఎన్నికలప్పుడు టిక్కెట్ల గురించి ఆలోచిద్దామని అంటున్నట్లుగా చెబుతున్నారు. గాలి జగదీష్ ను చేర్చుకోవడం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని అనుకుంటున్నారు.  పెద్దిరెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఆయనను తప్పించారు. పెద్దిరెడ్డి అనుచరులుగా ఉన్న నగరి కీలక నేతల్ని  సస్పెండ్ చేశారు.   దాంతో నగరిలో అంతా సద్దుమణిగిపోయిందని అనుకున్నారు కానీ.. అలాంటి పరిస్థితి లేదని.. తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. గాలి జగదీష్ ను వైసీపీలో చేర్చుకుంటే రోజా ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.  

Also Read : Crime News: రేషన్ కార్డు కావాలా? నీ కూతుర్ని పంపు! తాడిపత్రిలో వీఆర్వో కీచకపర్వం