Jagan Talks With Lavu :  రాజకీయ పార్టీల  నేతల మధ్య ఉండే ఆధిపత్య పోరాటం అప్పుడప్పుడూ ముఖ్య నేతల పర్యటనల్లోనూ బయట పడుతుంది. నేరుగా అధినేతకే చికాకులు తెప్పిస్తుంది. ఇలాంటి అనుభవం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎదురయింది. ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్‌ను ప్రారంభించడానికి చిలుకలూరిపేట నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేశారు.   సీఎం జగన్ వెళ్తున్న సమయంలో పార్టీ నేతలందర్నీ పలకరించారు. ఆ సమయంలో  నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులతో ఆయన కాసేపు ఎక్కువగా మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


సీఎం జగన్.. లావు కృష్ణదేవరాయుల్ని ఏదో అడిగారు. దానికి కృష్ణదేవరాయులు కాస్త సీరియస్‌గా సమాధానం చెప్పారు. తర్వాత సీఎం జగన్ ఏదో చెప్పబోయారు. అయినా  ఎంపీ లావు కృష్ణదేవరాయులు ఏదో చెబుతూ వచ్చారు. దీంతో సీఎం జగన్ ఆయనను తనతో పాటు తీసుకెళ్లారు. ఈ వీడియో వైరల్ అయింది. 


లావు కృష్ణదేవరాయులకు వైఎస్ఆర్‌సీపీలో కొంత కాలంగా ప్రాధాన్యత దక్కడంలేదు. దీనికి కారణం చిలుకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి .. మంత్రి పదవి కూడా పొందిన విడదల రజనీతో ఆధిపత్య పోరాటం జరుగుతోంది. ఎంపీ ఎప్పుడు చిలుకలూరిపేట నియోజకవర్గంలో పర్యటించినా ప్రోటోకాల్ లభించేది కాదు. కొన్ని వ్యక్తిగత పర్యటనల్లోనూ అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ అంశంపై పార్టీ హైకమాండ్‌కు చెప్పినా పట్టించుకోలేదన్న అసంతృప్తి ఎంపీలో ఉందని చెబుతున్నారు. ఇలా దాదాపుగా కొంత కాలం నుండి తనకు ప్రభుత్వ కార్యక్రమాలకూ ఆహ్వానం ఉండటం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నట్లుగా చెబుతున్నారు. 


తాజాగా చిలుకలూరిపేటలో ముఖ్యమంత్రి పర్యటనలోనూ ఇదే పరిస్థితి ఎదురయిందని తనకు కనీసం ప్రోటోకాల్ కల్పించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తనతో పాటు మరికొంత మందిని కావాలనే దూరంగాపెట్టాలని.. సీఎం జగన్ ను ఆహ్వానించేందుకు  తర్వాత ఆయనను కలిసే విషయంలోనూ చాలా మందికి అవకాశం కల్పించలేదని అసంతృప్తి వ్యక్తం చేిసనట్లుగా తెలుస్తోంది.  సీఎం జగన్ ఎదుట ఎంపీ లావు ఈ విషయాలను ప్రస్తావించడంతో  డీపీఆర్వో కలుగ చేసుకుని.. సీఎం జగన్‌కు కాలు నొప్పి ఉందని.. తర్వాత మాట్లాడదామని సర్ది చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే  లావు మాత్రం..  పూర్తిగా వివక్ష చూపిస్తున్నారని గట్టిగా మాట్లాడటంతో సీఎం  జగన్....  రాజకీయాల్లో ఇలాంటివి కామనేనని సర్ది చెప్పినట్లుగా తెలుస్తోంది. 


అధికారిక కార్యక్రమాల్లోనూ ఎంపీకి అసలు గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని.. తాను ఈ అంశంపై  లోకసభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని సీఎం వద్దనే స్పష్టం చేసిన ఎంపీ క్రిష్ణదేవరాయలు చెప్పడంతో.. సీఎం జగన్ నవ్వుతూ రా క్రిష్ణ అని ఎంపీని స్టేజీ మీదకు తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు.   సభ పూర్తయ్యాక ఎంపీతో మాట్లాడిన సీఎంవో సిబ్బంది.. ఎంపీతో పాటు  మంత్రి విడదల రజనీ వ్యతిరేక వర్గంగా పేరు పొందిన ప్రజాప్రతినిధులను సీఎం జగన్ తో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు.