పసుపు బోర్డు తీసుకు వస్తానని బాండ్ రాసి ఇచ్చి ఓట్లు వేయించుకుని.. మూడేళ్లయినా ఎలాంటి బోర్డు తీసుకు రాని నిజామాబాద్ ఎంపీని ఎక్కడిక్కకడ అడ్డుకుంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత... బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు నిజాలు చెప్పాలనే మీడియా సమావేశం పెట్టానని చెబుతూ ఎంపీపై విరుచుకుపడ్డారు. జిల్లాలో రైతుల సమస్యకు రాజకీయ రంగు పులిమి బీజేపీ అభ్యర్థి గెలిచారని.. కానీ ఇప్పటి వరకు బీజేపీ పార్టీ పసుపు రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. ఇప్పటి వరకూ ఎంపీ అరవింద్‌పై మాట్లాడలేదని.. కానీ ఆయన అసత్య ప్రచారాలు చేస్తూ.. మభ్య తపెడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన తీరును ప్రజల ముందు ఉంచేందుకే మాట్లాడుతున్నాన్నారు.
పసుపు బోర్డు కోసం తాను ఎంపీగా ఉన్నప్పుడు ప్రధాన మంత్రి గారిని కలిశామని.. ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులనూ కలిశామన్నారు. వారి మద్దతు కూడా పొందామన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరం కలిసి పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టామని గుర్తు చేశారు. 2015 లోనే స్పైసెస్ బోర్డు రీజనల్ ఆఫీస్ ను పెట్టామని... 2017 లోనే డివిజనల్ ఆఫీస్ పెట్టామని పత్రాలను విడుదల చేశారు. పసుపు రైతులకు అవసరమైన బాయిలర్లను పెద్ద ఎత్తున రైతులకు సబ్సిడీగా అందించామన్నారు. కానీ ఇప్పుడు ఎంపీ అరవింద్ అవన్నీ తానే చేశానని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. లక్షలాది మంది రైతుల ప్రయోజనాల కోసం అరవింద్ తెచ్చింది ఒక్కో రైతుకు రూ. 300 మాత్రమేనన్నారు. ఆర్టీఐ ద్వారా తాను ఆ వివరాలను సేకరించానన్నారు.
మూడేళ్ల నుంచి నాలికకు మడత లేకుండా మాట్లాడుతున్న ఎంపీ సిగ్గుపడాలని కవిత మండిపడ్డారు. ఏ భాషలో అయినా హైస్పీడ్‌గా అబద్దాలు చెప్పడం బీజేపీకే సాధ్యమన్నారు. అబద్ధాలు చెప్పి బిజెపి అధికారంలోకి వచ్చిందని.. కులాల మధ్య ,మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పసుపు బోర్డు ఎప్పడు తెస్తారో అరవింద్ ప్రకటించాలని కవిత డిమాండ్ చేశారు. మద్దతు ధర ఎప్పుడు ఇప్పిస్తారని ప్రశ్నించారు. అధర్మపురి అరవింద్ ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని మభ్య పెడతారని కవిత్ ప్రశ్నించారు.
మూడేళ్లు ఓపిక పట్టినం ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. బోర్డు తెచ్చే వరకు ఇక్కడి కక్కడ అడ్డుకుంటాం ..జిల్లా ప్రజలకు ఎంపి సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఉద్యోగాల్లో వివాదాలు లేపకుండా కేంద్రంలో ఖాళిగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని... మోడీ ప్రభుత్వం ఎన్నికైన నుండి తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కానీ నవోదయ కాలేజీ కానీ ఇవ్వలేదన్నారు