Mlc Iqbal Sensational Comments: అనంతపురం జిల్లా వైసీపీ కీలక నేత, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ (Iqbal) శుక్రవారం ఆ పార్టీకి, తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, తన రాజీనామా వెనుక ఉన్న కారణాలపై ఆయన శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు హిందూపురం టికెట్ ఇవ్వనందుకు కాదని, అమర్యాదగా ప్రవర్తించినందుకే వైసీపీకి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. మైనారిటీలకు ఏమీ చేసే అవకాశం ఇవ్వలేదని.. చంద్రబాబు హయాంలోనే మైనారిటీలకు రక్షణ ఉండేదని అన్నారు. ఈ క్రమంలో 2 రోజుల్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతారని ఆయన ప్రకటించినట్లు తెలుస్తోంది. కాగా, గత ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మహ్మద్ ఇక్బాల్ ఓడిపోయారు. అనంతరం ఇక్బాల్ కు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. హిందూపురం ఇంఛార్జ్ గా కొనసాగారు. నాలుగేళ్ల వరకూ పని చేసిన తర్వాత ఆయన స్థానంలో దీపిక ను ఇంఛార్జ్ గా నియమంచారు. ఇక్బాల్ పేరును జగన్ మరెక్కడా పరిశీలనలోకి తీసుకోలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్లుగా తెలుస్తోంది.
హిందూపురం నియోజకవర్గంలో మొదటి నుంచి వైసీపీలో వర్గ పోరు ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలుకు జిల్లాకు చెందిన ఇక్బాల్‌కు వ్యతిరేకంగా.. పార్టీ నేతలంతా జట్టు కట్టారు. ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ నవీన్ నిశ్చల్ ఆద్వర్యంలో మాజీ ఎంఎల్ఏ అబ్దుల్ ఘనీ, కొండూరు వేణుగోపాల్ రెడ్డి లాంటి బలమైన నేతలంతా కలిసి స్థానికులకే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్బాల్ ను తప్పించిన వైసీపీ హైకమాండ్ స్థానికురాలు కానప్పటికీ బీసీ మహిళ కోటాలో దీపికకు సీటు ఇచ్చారు. ఆమె భర్త రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో.. రెండు వర్గాలుగా కలసి వస్తుందన్న అంచనాతో అభ్యర్థిని ఖరారు చేశారు. అయితే ఇక్బాల్ ను అసలు పరిగణనలోకి తీసకోలేదు. ఇటీవలి కాలంలో ఇక్బాల్ కు పార్టీ కార్యక్రమాలకూ పిలుపు రావడం లేదు. పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఆయన అవమానం ఫీలయ్యారు. తనకే టిక్కెట్ అని ఏడాది కిందటి వరకూ నమ్మించారని ఇప్పుడు అసలు అవమానించడం ఏమిటని ఇక్బాల్ భావిస్తున్నారు. గతంలో తాను ఇంఛార్జిగా ఉన్నప్పుడు వర్గ పోరాటాన్ని కంట్రోల్ చేసేలా.. హైకమాండ్ వ్యవహరించలేదని.. ఇప్పుడు పూర్తిగా అవమానిస్తున్నారని అంటున్నారు. వైసీపీ తనను నిర్లక్ష్యం చేసినందున.. తనకు ఆ పార్టీ ఇచ్చిన పదవి కూడా వద్దనుకుని రాజీనామా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేశారు.