TamilNadu Trichy East Bye Election: తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తూ, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే   అధికారంలోకి వచ్చిన తరుణంలో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. విజయ్ రెండు స్థానాలు పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి గెలుపొంది, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.  సొంత నియోజకవర్గం కొళత్తూరులో ఓటమి పాలైన డీఎంకే అగ్రనేత ఎం.కె. స్టాలిన్, ఇప్పుడు తిరుచ్చి ఈస్ట్ నుంచి బరిలోకి దిగి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరిగితే ఒకవేళ ఇదే నిజమైతే రాజకీయం మరోసారి హాట్ టాపిక్‌గా మారనుంది. 

Continues below advertisement

ఇన్‌స్టా హైప్ వర్సెస్ గ్రౌండ్ రియాలిటీ! 

ఓటమి తర్వాత మొదటిసారిగా స్పందించిన స్టాలిన్, విజయ్ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  విజయ్ గెలుపు కేవలం సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ హైప్ వల్ల వచ్చిందే తప్ప, వారికి క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం కానీ, పాలనా దక్షత కానీ లేదు అని ఆయన  స్పష్టం చేస్తున్నారు. ప్రజలు కేవలం  సినిమా హీరో అన్న క్రేజ్ తో  ఓటేశారని, పాలన అంటే ఏంటో ఆరు నెలల్లోనే వారికి అర్థమవుతుందని స్టాలిన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కొద్ది కాలంలోనే టీవీకేపై వస్తున్న విమర్శలను వాడుకుని, తిరుచ్చిలో విజయ్  నిలబెట్టే అభ్యర్థిని  ఓడించడం ద్వారా తన రాజకీయ సత్తా చాటాలని ఆయన పట్టుదలతో ఉన్నారు.

Continues below advertisement

 స్టాలిన్‌పై పెరుగుతున్న సానుభూతి 

దశాబ్దాల రాజకీయ అనుభవం ఉండి, మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం స్టాలిన్‌పై ప్రజల్లో ఒక రకమైన సానుభూతిని కలిగించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కొళత్తూరు ఓటమి తర్వాత ఆయన ప్రవర్తించిన తీరుపై డీఎంకే శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే సానుభూతిని ఓట్లుగా మలచుకుని, ఉపఎన్నికలో విజయ్ అభ్యర్థిని ఓడించడం ద్వారా అసలైన నాయకుడు  ఎవరనేది నిరూపించాలని డీఎంకే వ్యూహకర్తలు ప్రణాళికలు రచిస్తున్నారు.

 విజయ్‌కు అగ్నిపరీక్ష.. డీఎంకేకు చావోరేవో! 

తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో విజయ్ భారీ మెజారిటీతో గెలిచారు. అయితే, ఇప్పుడు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి రంగంలోకి దిగితే, అక్కడ గడ్డు పరిస్థితి ఎదురుకావడం ఖాయం. పార్టీకి ఇంకా పూర్తిస్థాయిలో బలమైన కేడర్ లేకపోవడం, కేవలం  విజయ్  అనే బ్రాండ్ మీద ఆధారపడటం టీవీకేకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు, డీఎంకే తన ఉనికిని కాపాడుకోవాలంటే ఈ ఉపఎన్నిక గెలవడం అత్యంత కీలకం. స్టాలిన్ బరిలో ఉంటే, ఇతర విపక్ష పార్టీలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఆరు నెలల్లో ఉపఎన్నికలు 

ఈ ఉపఎన్నిక ఫలితం రా రాజకీయాలను మార్చేస్తుదంి. ఒకవేళ స్టాలిన్ ఇక్కడ గెలిస్తే, విజయ్ ప్రభంజనం కేవలం తాత్కాలికమేనని తేలిపోతుంది.  ఆరు నెలల తర్వాత జరగబోయే ఈ  మహా సంగ్రామం ఇప్పుడు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.  సోషల్ మీడియా ఫాలోయింగ్‌తో ముఖ్యమంత్రి అయిన విజయ్, తన పట్టును నిరూపించుకోవాలని చూస్తుంటే.. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన స్టాలిన్, తన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నారు. తిరుచ్చి ఈస్ట్ వేదికగా జరగబోయే ఈ పోరు, తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త మలుపు కాబోతోంది.