TDP MLAs violating discipline: ప్రజాస్వామ్యంలో భారీ మెజార్టీ అనేది ఒక వరంలా కనిపించినప్పటికీ, సరైన నియంత్రణ లేకపోతే అది అధికార పార్టీకి శాపంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్న అంతర్గత సవాళ్లు, చంద్రబాబు నాయుడు హెచ్చరికలు ఈ దిశగానే సాగుతున్నాయి 

Continues below advertisement

నిర్లిప్తతకు కారణమైన భారీ విజయం:

2024 ఎన్నికల్లో కూటమికి వచ్చిన అఖండ మెజార్టీ, క్షేత్రస్థాయిలో కొందరు ఎమ్మెల్యేలలో ఒక రకమైన అజాగ్రత్తను  పెంచినట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షం బలంగా లేకపోవడం, అసెంబ్లీకి రాకపోవడంతో,  తిరుగులేని ఆధిపత్యం చూపిస్తూ మమ్మల్ని అడిగే వారే లేరు  అనే ధోరణి కొందరిలో కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్లుగా, దాదాపు 40 మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ ఆశాజనకంగా లేకపోవడానికి ప్రధాన కారణం ఇదే. ప్రజలకు అందుబాటులో ఉండటం కంటే, ఇతర వ్యాపకాల్లో నిమగ్నమవ్వడం పార్టీకి దీర్ఘకాలికంగా నష్టం చేసే అంశం.

Continues below advertisement

చంద్రబాబు హెచ్చరికలు - అమలులో జాప్యం:

చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ విషయంలో ఎంత కఠినంగా మాట్లాడుతారో, రాజకీయ వ్యూహాల విషయంలో అంత వెయిట్ అండ్ వాచ్  విధానాన్ని అనుసరిస్తారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన నిరంతరం సర్వేలు చేయిస్తూ, లోపాలను సరిదిద్దుకోవాలని హెచ్చరిస్తూనే ఉన్నారు. మొత్తం నలభై మంది గీత దాటారని హెచ్చరికలు జారీ చేశారు. వారిలో  15 మంది దారికి వచ్చినా, మిగిలిన 25 మందిలో మార్పు రాకపోవడం చంద్రబాబు నాయకత్వ పటిమకు ఒక పరీక్షగా మారింది.  ఇనుమును నానబెడతారు కానీ చర్య తీసుకోరు  అనే విమర్శ ఆయనపై పాతదే. నిర్ణయం తీసుకోవడంలో చేసే జాప్యం, తప్పు చేస్తున్న వారికి పరోక్షంగా వెసులుబాటు కల్పించినట్లవుతోందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. 

ప్రతిపక్షం లేని లోటు - స్వీయ వినాశనానికి దారి తీస్తుందా? 

బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉంటారు. ఎక్కడ తప్పు చేసినా ప్రతిపక్షం ఎండగడుతుందనే భయం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏపీలో ప్రతిపక్షం యాక్టివ్‌గా లేకపోవడంతో, ఎమ్మెల్యేల ఆగడాలకు అడ్డులేకుండా పోతోందనే వాదన ఉంది. ఇసుక, భూ దందాలు లేదా స్థానిక వివాదాల్లో ఎమ్మెల్యేల ప్రమేయం పెరుగుతుండటం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారుతోంది. ప్రజలు ప్రతిపక్షాన్ని చూసి కాదు, అధికార పార్టీ ప్రవర్తనను చూసి తీర్పు ఇస్తారని నేతలు మర్చిపోతున్నారు. కనీసం నలుగురైదుగురు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు భావించడం వెనుక ఒక బలమైన సందేశం ఉంది.  తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టను " అని నిరూపిస్తేనే మిగిలిన వారు దారికి వస్తారు. అయితే, కూటమి రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేపై చర్య తీసుకోవడం వల్ల స్థానిక సమీకరణాలు మారుతాయనే భయం చంద్రబాబును వెనక్కి లాగుతున్నట్లుగా కనిపిస్తోంది.  కేవలం హెచ్చరికలకే పరిమితమైతే.. జరగాల్సిన నష్టం జరిగిపోతుందని, వచ్చే ఎన్నికల నాటికి ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుతుందన్న ఆందోళన ఆ పార్టీలో ఉంది. 

మెజార్టీయే ముప్పుగా మారే ప్రమాదం 

చరిత్రను పరిశీలిస్తే, గతంలో అత్యధిక సీట్లు సాధించిన ప్రభుత్వాలు తమ సొంత ఎమ్మెల్యేల అతివిశ్వాసం వల్లే పతనమైన సందర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ప్రజలకు దూరం కావడం అనేది ఒక అంటువ్యాధి లాంటిది. ఒకరిని చూసి మరొకరు అక్రమాలకు పాల్పడితే, అది మొత్తం వ్యవస్థను కుప్పకూల్చుతుంది. అధిక మెజార్టీ ఉంది కదా అని ఎమ్మెల్యేలను సరిగ్గా దారిలో పెట్టలేకపోతే, ఆ మెజార్టీయే టీడీపీకి భవిష్యత్తులో అతిపెద్ద బలహీనతగా మారే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు సంధిగ్ధంలో ఉన్నారు. పార్టీ ప్రతిష్ఠను కాపాడుకోవడానికి కఠినంగా వ్యవహరించాలా లేక ఎమ్మెల్యేలను బుజ్జగించి దారికి తెచ్చుకోవాలా అనే అంశంపై ఆయన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పార్టీ క్యాడర్ సలహాలు ఇస్తోంది.