స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్‌ అయినప్పటి నుంచి తెలుగు దేశం పార్టీ నిరసన కార్యక్రమాలు తెలుపుతూనే ఉంది. ఇందులో భాగంగా... మోత మోగిద్దాం  అంటూ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది టీడీపీ. చంద్రబాబుకు మద్దతుగా.. ఇవాళ రాత్రి 7గంటల నుంచి 7గంటల 5నిమిషాల వరకు ఉన్నచోటే శబ్ధం చేస్తూ... మోత  మోగించాలని పిలుపునిచ్చింది. మోత మోగిద్దాం అనే పోస్టర్‌ను ట్విటర్ వేదికగా విడుదల చేశారు నారా లోకేష్‌, బ్రాహ్మణి దంపతులు. ఇంట్లో, ఆఫీసులో ఎక్కడ ఉన్నా...  బయటకు వచ్చి గంట లేదా ప్లేట్‌పై గరిటెతో కొట్టండి అని సూచించారు. లేదా విజిల్ వేస్తూ సౌండ్‌ చేయాలని కోరారు. రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ కొట్టాలన్నారు. దీనికి  సంబంధించి వీడియో తీసి.. మోత మోగిద్దాం పేరుతో సోషల్ మీడియాలో షేర్ చేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ప్యాలెస్‌లో ఉన్న జగన్‌కు వినిపించేలా మోత మోగిద్దాం  అంటూ పిలుపునిచ్చారు.


టీడీపీ మోత మోగిద్దాం ప్రోగ్రామ్‌పై మంత్రి ఆర్కే రోజా కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌లో ప్రజాసొమ్ము దోచేసి జైలుకు వెళ్లారని.. అలాంటి అవినీతిపరుడి కోసం  ప్రజల మద్దతును కోరడం ఏంటని ఆమె ప్రశ్నించారు. మీ మామ అడ్డగోలుగా అవినీతి మేత మేసి జైలుకి వెళ్తే మీరేమో ఆ అవినీతిపరుడుకి మద్దతుగా ప్రజలను మోత  మోగించమంటారా..? ఇదెక్కడి విడ్డురం? అంటూ ప్రశ్నించారు. మీ మామ చేసిన మోసానికి.. 2019 ఎన్నికల్లోనే ప్రజలు మోతమోగించారంటూ ట్వీట్‌ చేశారు రోజా. 23 సీట్లతో చంద్రబాబును ఇంటికి పంపారన్నారు. ఇక.. మీ భర్త నారా లోకేష్‌కి మంగళగిరిలో ఎలా మోత మోగించి ఓడించారో గుర్తులేదా..? అని ట్విట్టర్‌ వేదికగా నిలదీశారు. మీ మామ చంద్రబాబు అన్ని రాష్ట్రాల మేనిఫెస్టోలను కాపీ కొడితే.. నువ్వు, నీ భర్త ముద్రగడ గారి పోరాటాన్ని కాపీ కొట్టి.. పళ్లాలు, ప్లేట్లు కొట్టమంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు రోజా. మీ ఫామిలీ అంతా కాపీ కొట్టడమేనా..? అంటూ ప్రశ్నించారు. నీ మామపై ప్రపంచం బెంగ పెట్టుకుందని మీరంతా భ్రమల్లో ఉన్నట్లున్నారు... కానీ నారాకాసురుడు ఇన్నాళ్లకు దొరికాడని ప్రజలంతా ముందుగానే దీపావళి చేసుకుంటున్నారని సెటైర్‌ వేశారు రోజా. 


బకాసురుడిలా ప్రజల సొమ్మును దోచేసిన నీ మామ నారా చంద్రబాబు నాయుడిని కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం జైల్లో పెడితే ఆయనకు మద్దతుగా ఆందోళన చేస్తావా నారా బ్రాహ్మిణి అంటూ ప్రశ్నించారు. అంటే మీరు కోర్టులకంటే గొప్పోల్లా..? న్యాయవ్యవస్థ కంటే అతీతులా..?  కోర్టుల నిర్ణయాలకు వ్యతిరేకం అవుతుందన్న జ్ఞానం లేదా..? అంటూ ట్విట్టర్‌ వేదిగా ఘాటుగా ప్రశ్నించారు మంత్రి రోజా. #TDPGoons అనే హాష్ ట్యాగ్‌ను కూడా ఈ ట్వీట్‌కు జత చేశారు రోజా.