Amabati Rambabu :    ఇప్పటం అంశంలో బాబు, పవన్ లు అభాసుపాలయ్యారని ఎపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. దున్నపోతు ఈనింది.. అంటే దూడను కట్టేయమన్న చందంగా విజయసాయిరెడ్డి సెల్‌ ఫోన్‌  గురించి పనికిమాలిన చర్చను టీడీపీ, ఎల్లో మీడియా చేస్తుందన్నారు. ఇప్పటం గ్రామంలో జరిగిన చిన్న ఘటనను టీడీపీ, పవన్‌ కళ్యాణ్‌ గగ్గోలు పెట్టి నానా బీభత్సం చేశారని వ్యాఖ్యానించారు. నాలుగు ఆక్రమణల గోడలు కూలిస్తే..  అసలు ప్రభుత్వాన్నే కూల్చివేయాలనే స్థాయిలో అనుభవం లేని పవన్‌ కళ్యాణ్‌ రెచ్చిపోయి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.కోర్టు తీర్పుతో అసలు వాస్తవాలు వెలుగు చేశాయన్నారు. 


ఇప్పటంలో చట్ట ప్రకారమే కూల్చివేతలు : అంబటి రాంబాబు


చట్టప్రకారమే ఇప్పటంలో అంతా జరిగినా, అఫిడవిట్‌లో తప్పులు రాసి స్టే తెచ్చుకున్నారని హైకోర్టు చేప్పిందని అంబటి ఆరోపించారు.  రాజకీయాల్లో ఒకరిని మోసం చేస్తే పర్లేదు.. చివరికి కోర్టులనే మోసం చేస్తున్నారని, దాంతో ఇప్పటంలో ఆక్రమణదారులకు సంబంధించి పిటీషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా వేసిన అంశాన్ని చూస్తే పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు కుట్రలు చేసి ఈ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని ప్రయత్నించిన విషయం బయటకు వచ్చిందన్నారు. ఇలాంటి కుట్రలు చేస్తే.. ఏం జరుగుతుందో ఇప్పటికైనా దుష్టచతుష్టయం తెలుసుకోవాలన్నారు 


చట్ట ప్రకారమే చిట్ ఫండ్ కంపెనల్లో సోదాలు ! 


గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా చిట్‌ ఫండ్‌ కంపెనీలలో సోదాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఆ సోదాల్లో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో వారందరిపై చట్టప్రకారం కేసులు పెట్టి శిక్షించే కార్యక్రమం జరుగుతుందని, ఇందులో మార్గదర్శి చిట్‌ ఫండ్‌ కంపెనీ కూడా చట్టాన్ని ఉల్లంఘించిన అంశాలు తేటతెల్లంగా కన్పిస్తున్నాయని తెలిపారు. చట్టవ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారు ఎంతటి వారైనా సరే వారి పై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని గుర్తు చేశారు. మార్గదర్శి  సంస్థలన్నీ చట్టవ్యతిరేకంగానే ఏర్పడ్డాయని స్పష్టమవుతోందని తెలిపారు.  రాజశేఖరరెడ్డి  హయాంలో మార్గదర్శి ఉల్లంఘనల పై పెట్టిన కేసుల దగ్గర నుంచి సీనియర్ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ పోరాటం చేస్తున్నారని తెలిపారు. చిట్ ఫండ్ వ్యాపారానికి సంబంధించి అనేక చట్టాలను ఉల్లంఘించి  విచ్చలవిడిగా ప్రవర్తించారని, మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీ ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు బెంగుళూరు, చెన్నై లలో కూడా అనేక శాఖోప శాఖలు ఏర్పడ్డాయన్నారు. వ్యాపారం చేయవచ్చుగానీ, అది చట్టబద్దంగానే చేయాలని, ఇటీవల జరిగిన సోదాల్లో చట్టవ్యతిరేకంగా వ్యాపారం చేస్తున్నారని, చిట్‌ఫండ్‌ యాక్టును మార్గదర్శిని దుర్వినియోగం చేస్తుందని తేటతెల్లమయ్యిందన్నారు. 


ప్రతీ చిట్‌కు మార్గదర్శి ఖాతా ఏర్పాటు చేయలేదన్న రాంబాబు !


చిట్స్ వేసే సభ్యుల నుంచి వసూలు చేసిన సొమ్మును ఏ చిట్ ఫండ్ కంపెనీ అయినా ప్రత్యేకమైన అకౌంట్లో జమ చేయాలని, ప్రతి చిట్‌కి ఒక ప్రత్యేకమైన అకౌంట్‌ ఓపెన్‌ చేయాలన్నారు. కానీ మార్గదర్శి చిట్‌ ఫండ్‌  అన్నిటికీ కలిపి ఒకే అకౌంట్‌ ఓపెన్‌ చేసి, సరైన ష్యూరిటీలు చూపలేదని, చిట్‌ పాడుకున్న తర్వాత ఇవ్వాల్సిన అమౌంట్‌ ను సైతం చిట్ సభ్యులకు సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ఆ డబ్బంతా మార్గదర్శి  యాజమాన్యమే కొన్ని నెలల పాటు తమ దగ్గరే పెట్టుకోవడం వల్ల రిజర్వ్‌ ఫండ్స్‌ ఏర్పడుతున్నాయని, దాంతో వేల కోట్ల రూపాయలు రిజర్వ్‌ ఫండ్‌ను వారికున్న ఇతర సంస్థలకు డైవర్ట్‌ చేస్తున్నారని ఆరోపించారు.