MIM On Raja singh : గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తెలంగాణ అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని మజ్లిస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎంఐఎం జనరల్ సెక్రటరీ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖను అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. మహమ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలుచేసినందున ఆయనపై తక్షణం బహిష్కరణ వేటు వేయాలని లేఖలో సయ్యద్ ఖాద్రి స్పీకర్‌ను కోరారు. ఏ ఏ సెక్షన్ల కింద రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవచ్చో కూడా ఖాద్రి తన లేఖలో వివరించారు.
రాజాసింగ్ ..ఓ వర్గం వారిని కించ పరిచేలా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కూడా ఇప్పటికీ సీరియస్ అయింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎందుకు శాశ్వతంగా బహిష్కరించకకూడదో చెబుతూ పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆయనపై పలు చోట్ల కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి కూడా బహిష్కరించాలని మజ్లిస్ డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో స్పీకర్ ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆయనను అసెంబ్లీకి రాకుండా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక వర్గంపై చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్‌లో అశాంతికి ఆజ్యం పోశాయి. మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సాయంత్రం రాజాసింగ్‌ను కోర్టులో హాజరుపరిచిన అనంతరం ముందుగా రిమాండ్ విధించినప్పటికీ.. తరువాత బెయిల్ పిటిషన్ వేయడంతో వాదనల అనంతరం న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.కోర్టు 41ఏ సీఆర్పీసీ ప్రకారం ఏడేండ్ల లోపు శిక్షలు పడే నేరాల్లో అరెస్ట్ చేసే ముందు నిందితుడికి నోటీసు ఇవ్వాలని తెలిపింది. రాజాసింగ్ కేసు విషయంలో ఇలా జరగలేదు కాబట్టి అతని అరెస్ట్ 41ఏ సీఆర్పీసీ కి విరుద్ధమని పేర్కొన్నది. రాజాసింగ్ రిమాండ్‌ను రిజెక్ట్ చేసి వెంటనే విడుదల చేయాలని ఉత్తర్వులిచ్చింది. రాజాసింగ్‌పై రాష్ట్రవ్యాప్తంగా మరో 12 కేసులు నమోదయ్యాయి.
రాజాసింగ్ వ్యాఖ్యల కారణంగా పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.వివాదాస్పద వీడియోను వెంటనే యూట్యూబ్ నుంచి తొలగింపజేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అన్ని విభాగాల పోలీస్ ఫోర్స్ సిబ్బంది రాత్రికి రాత్రే విధులకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం కూడా మూడు జోన్ల పరిధిలో పలు చోట్ల దుకాణాలు మూసేసి రాజాసింగ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలువురు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. చివరికి ఆయనను పార్టీ నుంచి కూడా బహిష్కరించారు. ఇక అసెంబ్లీ నుంచి పంపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.