Mallareddy and Rajagopal Reddy both are same :  తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన నేతలుంటారు. ఇప్పుడు ఆ జాబితాలో మాజీ మంత్రి మల్లారెడ్డి , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు.ఈ వ్యవహారం బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న తరుణంలో, తన విద్యాసంస్థలు , వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలు వెలువడగా, మరోవైపు బీజేపీ నేతలతోనూ ఆయన టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ప్రధాని మోదీతోనూ సమావేశమయ్యారు.  తన రాజకీయ భవిష్యత్తు కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ వైపు ఏకకాలంలో సంప్రదింపులు జరపడం బీఆర్ఎస్ నాయకత్వానికి మింగుడుపడటం లేదు.

Continues below advertisement

మరోవైపు, కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు  నిప్పు మీద కూర్చొన్నట్లు  ఉంది.  మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీలోకి వెళ్లి, మళ్ళీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లోకి వచ్చిన ఆయన.. తనకు మంత్రి పదవి దక్కుతుందని గట్టిగా ఆశించారు. అయితే, సామాజిక సమీకరణలు మరియు ఆయన సొంత సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో ఉండటంతో రాజగోపాల్ రెడ్డికి మొండిచేయే ఎదురైంది. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఏదైనా చేస్తానని  తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తుండటం, పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లు ఉండటం రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఇబ్బందికరంగా మారింది.

నిజానికి మల్లారెడ్డిది ఒక విలక్షణమైన శైలి. ఆయన ఎక్కడుంటే అక్కడ తనదైన ముద్ర వేయాలని చూస్తారు. ప్రస్తుతం మెడ్చల్ నియోజకవర్గంలో తన పట్టును నిలబెట్టుకుంటూనే, ప్రభుత్వ వేధింపులు లేకుండా చూసుకోవడమే ఆయన ప్రాధాన్యత. అయితే, ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారన్న ముద్ర పడటం ఆయన రాజకీయ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ హైకమాండ్ ఆయనపై చర్య తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వస్తున్నా, ఆయన మాత్రం ఏమాత్రం తగ్గకుండా తన దారి తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

Continues below advertisement

ఇక రాజగోపాల్ రెడ్డి విషయంలో హైకమాండ్ డైలమాలో ఉంది. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ముగ్గురు రెడ్లకే ఉత్తమ్, వెంకటరెడ్డి, రాజగోపాల్  పెద్దపీట వేసినట్లవుతుందనే భయం అధిష్టానానికి ఉంది. కానీ, రాజగోపాల్ రెడ్డి  దూకుడును అదుపు చేయకపోతే అది ప్రభుత్వంపైనే ప్రభావం చూపుతుందని కొందరు సీనియర్లు హెచ్చరిస్తున్నారు. పదవి ఇవ్వకపోతే మళ్ళీ బీజేపీ వైపు చూపు చూస్తారన్న సంకేతాలు కూడా కాంగ్రెస్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

మల్లారెడ్డి గెలుపు గుర్రం కోసం వేటాడుతుంటే, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి పోరాడుతున్నారు. వీరిద్దరి వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షలు ఆయా పార్టీల క్రమశిక్షణకు సవాల్‌గా మారాయి.   ప్రస్తుతానికి మాత్రం ఈ ఇద్దరు 'రెడ్డి' నేతలు తెలంగాణ రాజకీయాల్లో అస్థిరమైన శక్తులుగా కనిపిస్తున్నారు.