Lokesh New Trend :  తెలుగుదేశం పార్టీ యువనేత  నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నరు.  పాదయాత్ర గురువారం 39వ రోజు 500 కిలోమీటర్ల మైలు రాయి దాటింది. ఆ సందర్బంగా తాము అధికారంలో వచ్చిన వంద రోజుల్లో అన్నమయ్య జిల్లా సి టీ ఎం వద్ద టమాటో ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. గత డిసెంబర్ నెల 27వ తేదీ కుప్పంలో మొదలైన పాదయాత్ర చిత్తూరు, తిరుపతి జిల్లాల గుండా సాగి ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం మదనపల్లి నియోజకవర్గం లో ఆడుగుపెట్టిన యాత్ర 39వ రోజు కు చేరింది. వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవుతున్న లోకేష్ ప్రతి వంద కిలోమీటర్ల యాత్ర పూర్తి అయిన సందర్బంగా స్థానికులకు ప్రత్యేక హామీలు ఇస్తున్నారు.పా ఎవరు పాదయాత్రలు చేసినా హామీలు ఖాయంగానేఇస్తూంటారు కానీ లోకేష్ మాత్రం హామీలను శిలాఫలకాలపై చెక్కించి తానే ఆవిష్కరిస్తున్నారు. 


హామీలను శిలాఫలకాలపై చెక్కిస్తున్న లోకేష్ 


యువగళం పాదయాత్ర   8వ రోజు న 100 కిలోమీటర్ల మైలు రాయి దాటినప్పుడు గత ఫిబ్రవరి 3వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాలెం వద్ద కిడ్నీ వ్యాధి గ్రస్తులకు డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే యాత్ర 16వ రోజున 200 కిలోమీటర్లు ఆదిగమించినప్పుడు గంగాధర నెల్లూరు వద్ద డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఫిబ్రవరి 11వ తేదీన హామీ ఇచ్చారు. తరువాత ఫిబ్రవరి 21వ తేదీన 23 వ రోజున యాత్ర 300 కిలోమీటర్లు దాటినప్పుడు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమానుపురం వద్ద 13 గ్రామాల దాహార్తి తీర్చే నీటి పధకాన్ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. ఆపై మార్చి 1వ తేదీన 32వ రోజు యాత్ర 400 కిలోమీటర్లు చేరినప్పుడు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నరేంద్ర పురం వద్ద ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక గురువారం యాత్ర 39వ రోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం సి టీ ఎం వద్ద 500 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది. ఆ సందర్బంగా సి టీ ఎం 2 వద్ద టమోటో ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రతి వంద కిలోమీటర్లు పూర్తి అయిన చోట ఒక శిలాఫలాకాన్ని ఆవిష్కరించి తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామనే హామీలను ఇస్తున్నారు.


పాదయాత్రలో హామీలు అమలు చేయరనే అనుమానాలను క్లియర్ చేసే ప్రయత్నం ! 


పాదయాత్ర చేస్తున్న రాజకీయ నేతలకు ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడం సహజం. ప్రతిపక్షంలో ఉన్నందున ఇచ్చేది హామీలే కాహట్టి నేతలంతా తాము అధికారలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇస్తారు.అయితే అవి సాధ్యమవుతాయా లేదా అన్నది  పట్టించుకోలేదు. ప్రస్తుత సీఎం జగన్ పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారని వాటిని పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. వివిధ  సంఘాలు ఆందోళనలు చేసినప్పుడు సీఎం జగన్ తమకు పాదయాత్రలో హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపమలు చేస్తూ ఉంటాయి. తాజాగా అగ్రిగోల్డ్ బాధితులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. అయితే మేనిఫెస్టోను  మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉంటుంది. మొత్తం హామీలను నెరవేర్చామని చెబుతూ ఉంటుంది. కానీ పాదయాత్రలో ఇచ్చిన హామీ సంగతేమిటని ఎక్కువ మంది ప్రశ్నిస్తారు. తాను అలా చేయనని చెప్పేందుకు లోకేష్ శిలాఫలాకాలను చెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. 


అధికారంలోకి వచ్చాక మాట మార్చడానికి అవకాశం లేకుండా శిలాఫలకాలు ! 


నారా లోకేష్ వ్యూహాత్మకంగానే శిలాఫలకాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. సుదీర్ఘంగా ఆ సమస్యల కోసం ప్రజలు పోరాడుతున్నారు. నిజానికి ఆ సమస్యలు పరిష్కారం అయితే ప్రజల ఆదాయం కూడా పెరుగుతుంది. రైతుల సమస్యలు తీరుతాయి. లోకేష్ ఆయా ప్రాంతా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే హామీలనే ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఖచ్చితంగా చేయగలిగే హామీలనే ఇస్తున్నారు. శిలాఫలకాలపై పెడుతున్నారని టీడీపీ నేతలంటున్నారు. ప్రజల కోరిక మేరకు ఇస్తున్న హామీలను ప్రభుత్వం ఇప్పుడే నెరవేరిస్తే.. క్రెడిట్ కూడా లోకేష్ కు వస్తుందని.. నేరవేర్చకపోతే.. లోకేష్ నెరవేరుస్తాడనే భరోసా ఉంటుందని టీడీపీ నేతలంటున్నారు.