East Godavari News: ఆంధ్రా అన్నపూర్ణగా పేరుగాంచిన ఉభయగోదావరి జిల్లాల్లో డబ్బుకు కొదవలేదు. ఉన్నంతలో కొద్దో గొప్పో వ్యాపారాలతో అందరూ బాగా సంపాదించిన వాళ్లే. ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. ఈసారి అర్థబలం ఉన్న నేతలను ఎంచుకుని మరీ పార్టీలు టిక్కెట్లు కేటాయించాయి.


పవర్ పాలిటిక్స్‌


ఈసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల్లో పవర్‌ స్టార్ పవన్‌కల్యాణే(Pavan Kalyan) ప్రత్యేక ఆకర్షణ. పిఠాపురం(Pitapuram) నుంచి బరిలో దిగుతున్న పవన్ కల్యాణ్‌... సినీరంగంలో బాగానే వెనకేశారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.57 కోట్లు కాగా.. అప్పులు రూ.34 కోట్ల వరకూ ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో ఉన్న ఫిక్సిడ్‌ డిపాజిట్లు, బాండ్లు రూ.6 కోట్లు వరకు ఉన్నాయి. మరో రూ.3 కోట్లు సేవింగ్స్ చూపించారు. కార్లన్నా, బైక్‌లన్నా అమితంగా ఇష్టపడే పవన్‌కల్యాణ్(Pavankalyan) వద్ద మెర్సిడెస్ బెంజ్-350, టయోటా పార్చునర్, స్కోడా ర్యాపిడ్‌, మహేంద్ర స్కార్పియో, వోల్వో , హార్లీడేవిడ్సన్‌ బైక్‌ ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.2.75 కోట్ల వరకూ ఉంది. మొత్తం చరాస్తుల విలువ రూ.15 కోట్లకు పైగానే ఉంది. హైదరాబాద్‌(Hyderabad) శివారులో 18 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు హైదరాబాద్‌లో 4 ఇళ్లు, మంగళగిరి(Mangalagiri)లో రెండు ఇళ్లు ఉన్నాయి. వీటి విలువ రూ.34 కోట్లు ఉన్నాయి. అలాగే ర‌ష్యాలోనూ ఆయనకు ఓ అపార్ట్‌మెంట్‌ ఉంది. వీటి మొత్తం విలువ రూ.1.75 కోట్లుగా అఫిడవిట్‌లో చూపించారు. ఈ స్థిరాస్తుల విలువ రూ.42 కోట్ల వరకు చూపారు. వివిధ బ్యాంకుల నుంచి ఆయన పేరిట ఉన్న అప్పులు రూ.34 కోట్ల వరకు ఉన్నాయి.


పవన్‌పై పోటీ చేస్తున్న ఎంపీ వంగా గీత(Vanga Geetha) ఆస్తులు సైతం రూ.20 కోట్ల పైమాటే. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు, బంగారం(Gold), వాహనాలు అన్నీ కలిపి రూ.1.20 కోట్లుగా ఉన్నాయి. వివిధ చోట్ల 25 ఎకరాల వ్యవసాయ భూమి, 8 ప్లాట్లు, 10 ఇళ్లు, కమర్షియల్ బిల్డింగ్‌ ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.20 కోట్ల వరకు ఉంది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు రూ.3.50 కోట్ల వరకు ఉంది.


కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి(Chandrashekar Reddy)కి 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రూ.43 కోట్ల ఆస్తులు ఉండగా... అప్పు రూ.21 కోట్ల వరకు ఉంది. వివిధ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు, బాండ్లు, వాహనాలు, బంగారు ఆభరణాలు కలిపి రూ.8.50 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి. వ్యవసాయ భూములు, ప్లాట్లు, కమర్షియల్ బిల్డింగ్‌లు, ఇల్లు మొత్తం కలిపి మరో రూ.35 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.


భరత్ ఆస్తులు ఎంతంటే.?


రాజమండ్రి ఎంపీ భరత్(Margani Bharath) ఇప్పుడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా వైసీపీ(YCP) తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనకు రూ.45 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. బ్యాంకుల్లో దాచిన డబ్బు, ఫిక్స్ డ్ డిపాజిట్లు అన్నీ కలిపి రూ.3.60 కోట్ల వరకు చరాస్తులు ఉండగా... ఖాళీ స్థలాల విలువ రూ.40 కోట్లుగా ఉంది. అలాగే అప్పులు రూ.2 కోట్ల వరకు ఉన్నాయి.


తెలుగుదేశం(TDP) సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి(Buchaiah Chowdary) రాజకీయాల్లోకి వచ్చి పెద్దగా ఏం సంపాదించుకోలేదు. ఆయన మొత్తం ఆస్తి విలువ కేవలం మూడున్నర కోట్లు మాత్రమే. బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు, వాహనాలు, ఇతర సంస్థల్లో పెట్టుబడులు కలిపి మొత్తం రూ.2 కోట్ల వరకు ఆస్తి ఉంది. పొలాలు, ప్లాట్లు కలిపి మరో కోటిన్నర రూపాయల ఆస్తి మాత్రమే ఉంది. ఇక అప్పులు కూడా గోరంట్లకు చాలా తక్కువే ఉన్నాయి. ఆయన మొత్తం అప్పు కలిపినా కేవలం ఏడున్నర లక్షలే ఉంది. గోరంట్లపై పోటీ చేస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(Venugopala Krishna)కు సైతం కేవలం మూడున్నర కోట్ల ఆస్తి మాత్రమే ఉంది. ఆయన పేరిట బాండ్లు, డిపాజిట్లు, సేవింగ్స్‌, కార్లు ఏమీ లేవు. బ్యాంకులో దాచుకున్న 40 లక్షల నగదుతో పాటు మరో 35 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాత్రమే ఉన్నాయి. రూ.2 కోట్ల విలువైన వ్యవసాయ భూమితో పాటు రూ.75 లక్షల విలువైన ప్లాట్లు, మరో రూ.25 లక్షల విలువైన ఇల్లు ఉంది. అలాగే ఆయన అప్పులు సైతం కేవలం రూ.14 లక్షలు మాత్రమే ఉన్నాయి.