ముఖ్యమంత్రి పదవి కోసం తనను రూ. రెండున్నర వేల కోట్లు అడుగుతున్నారంటూ కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన మాజీ కేంద్రమంత్రి కూడా.  కర్ణాటకలో సీఎంను మారుస్తున్ారన్న ఊహాగానాల కారణం తాను కూడా రేసులో ఉన్నానని గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఇలా రూ. రెండున్నర వేల కోట్లు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు చేయడంతో బీజేపీ వర్గాల్లోనూ సంచలనం ప్రారంభమయింది. 


అయితే బసనగౌడ పాటిల్ తన పార్టీ నేతలు అడుగుతున్నారని చెప్పడం లేదు . " ఢిల్లీ నుంచి కొంతమంది నా దగ్గరకు వచ్చారు. వాజ్‌పేయీ ప్రభుత్వంలో పనిచేశామని చెప్పారు. నన్ను సీఎంను చేస్తానని, అందుకు రూ. 2500కోట్లు సిద్ధం చేసుకోవాలని చెప్పారు.  రూ.2500కోట్లు అంటే  అదంతా పెట్టాలంటే ఓ గోదామే కావాలి వారికి చెప్పాను" అని చెప్పుకొచ్చారు.  రెండు రోజుల కిందట కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగళూరులో పర్యటించారు. ముఖ్యమంత్రి మార్పుకోసేనని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. ఈ క్రమంలో బసనగౌడ సీఎం ఆఫర్‌పై వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. 


కర్ణాటక బీజేపీ నేతలెవరూ బసనగౌడ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించలేదు. కానీ ఇతర పార్టీల నేతలు మాత్రం మండి పడుతున్నారు.  కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ ఈ పరిణామాలను తీవ్రంగా తీసుకోవాలని, దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.



తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ అంశంపై స్పందించారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. సీబీఐ, ఐటీ, ఈడీల దర్యాప్తులు జరుపుతారా అని ప్రశ్నించారు. ఒక్క బసనగౌడ పాటిల్ అంశంలోనే కాదు ఇతర అవినీతి ఆరోపణల పేపర్ క్లిప్పింగ్స్‌ను కూడా జత చేశారు. 



కర్ణాటకలో పరిణామాలపై కేటీఆర్ ఇటీవల చురుగ్గా స్పందిస్తున్నారు. అక్కడ బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ అవినీతిపైనా ప్రశ్నించడం చర్చనీయాంశమవుతోంది.