Kodali Nani Counter On Revanth Reddy Comment: తాను ముఖ్యమంత్రి అయ్యాక...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ చేయలేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పొరుగు రాష్ట్రాల్లో ఎవరైనా కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడితే... పక్క రాష్ట్రాల సీఎంలు ఫోన్ చేసి విషెస్ చెబుతారని అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారని అన్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ నుంచి తనకు ఇప్పటి వరకు ఫోన్ రాలేదని అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉమ్మడి ఏపీకి సంబంధించిన విభజన సమస్యలపై కూర్చుని పరిష్కరించుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నారు. అయితే జగన్ కలవకపోవడానికి కారణం ఏంటో తెలియదన్నారు రేవంత్ రెడ్డి. వ్యక్తిగతంగా జగన్ తో ఎలాంటి విభేదాలు లేవని, రాజకీయ విభేదాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. 


రేవంత్ రెడ్డిని కలవని జగన్


ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...కేసీఆర్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత లోటస్ పాండ్ వెళ్లిన జగన్...తల్లి విజయమ్మతో సమావేశం అయ్యారు. హైదరాబాద్ కు వచ్చినా రేవంత్ రెడ్డిని విజయవాడ వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...జగన్ తనను కలవలేదని అన్నారు. అదే సమయంలో జగన్, కేసీఆర్ ఒక వైపు ఉన్నారని, తాను షర్మిల ఒకవైపు ఉన్నామని చెప్పుకొచ్చారు. ప్రజలకు ఈ విషయంలో క్లారిటీ వచ్చిందని....ఎవరు ఎవరితో ఉన్నారో తెలిసిపోయిందని గుర్తు చేశారు. 


పక్క రాష్ట్రాల రాజకీయాలు అవసరం లేదు


జగన్ తనను కలవలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించండంపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుంటి ఎముక విరిగిందని, అందుకే జగన్మోహన్ రెడ్డి పరామర్శించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికేం తుంటికాలు విరగలేదు కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పక్క రాష్ట్రాల రాజకీయాలు తమకు అవసరం లేదని, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అపాయింట్మెంట్‌ తీసుకోవాల్సిన అవసమే లేదని స్పష్టం చేశారు. రేవంత్‌ రెడ్డిని సీఎంగా నియమించినప్పుడు, సీఎం జగన్ ట్వీటర్‌లో అభినందించారని తెలిపారు. రేవంత్ రెడ్డికి జగన్ ఫోన్‌ చేసి అభినందించాల్సిన అవసరం లేదన్నారు.


టీడీపీ కలిసి పని చేసిన రేవంత్, కొడాలి


కాంగ్రెస్‌లో చేరిన వైఎస్ షర్మిలకు రేవంత్ రెడ్డి మద్దతివ్వడంలో వింత ఏముందని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి ఏపీకి వచ్చి కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవచ్చని సెటైర్లు వేశారు. చంద్రబాబును గెలిపించడానికి రేవంత్ రెడ్డి, ఏపీ వస్తారేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొడాలి నాని...రేవంత్ రెడ్డిని విమర్శించడంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంశంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని...కొంతకాలం తెలుగుదేశం పార్టీలో కలిసి పని చేశారు. 


డిసెంబరు 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత తెలంగాణకు రెండో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ తరపున తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. జాతీయ పార్టీల నేతలు, సెలబ్రెటీలు, సినీ రాజకీయ ప్రముఖులు రేవంత్ రెడ్డిని కలిసి అభినందించారు.