no alliance with Janasena : జనసేనతో ఇక పొత్తులు లేవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సర్వేలకు అందని విధంగా లోక్ సభ ఫలితాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు జనసేన వర్గాల్లోనూ చర్చనీయాంసం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలని అనుకోలేదు. తన పార్టీ తరపున 32స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నారు. కానీ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ రాయబారం చేసుకుని .. జనసేనకు ఎనిమిది సీట్లు ఆఫర్ చేసి.. పొత్తులు పెట్టుకున్నారు.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో కలిసి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఇమేజ్ కలిసి వస్తుందనుకుని పొత్తు పెట్టుకున్న బీజేపీ వ్యూహం బెడిసికొట్టింది. జనసేనతో పొత్తు వల్ల ఇరు పార్టీలకు మేలు జరగలేదు. జనసేన పార్టీ పోటీ చేసిన ఎనిమిది చోట్లా బీజేపీ కార్యకర్తలు జనసేనకు మద్దతు ఇవ్వలేదని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. సంప్రదాయంగా బీజేపీ ఓటు బ్యాంక్ కూడా జనసేనకు అనుకూలంగా రాలేదు. తాండూరు లాంటి చోట్ల గతంలో బీజేపీకి పది వేల ఓట్లు వచ్చాయి. ఆ ఓటు బ్యాంక్ బదిలీ కాలేదు. కూకట్ పల్లిలోనూ అంతేనన్న విశ్లేషణలు వచ్చాయి. ఈ కారణంగానే జనసేనతో పొత్తు విషయంపై కిషన్ రెడ్డి ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు.
పవన్ కల్యాణ్ ఇప్పటికే ఏపీలో బీజేపీతో కలిసి ఉన్నామని చెబుతూంటారు కానీ.. ఆ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల సమయంలో ఏర్పడిన పొత్తు ఏపీకి కూడా వస్తుందని పవన్ మనసు మార్చుకుని బీజేపీతో కలిసి పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ తెలంగాణలో జనసేనను దూరం చేసుకోవాలని బీజేపీ నిర్ణయించుకోవడంతో ఏపీలో కూడా ఇక బీజేపీతో కలిసే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికీ జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ఎన్డీఏ నంచి బయటకు రాలేదు.
కానీ పొత్తుల గురించి జాతీయ పార్టీ నిర్ణయిస్తుందని కిషన్ రెడ్డి ప్రకటన కాదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. కానీ పొత్తుల వల్ల పరస్పర ఉపయోగం ఉంటేనే... బీజేపీ హైకమాండ్ అంగీకరిస్తందని. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రయోజనం కలగనందున జనసేన పార్టీకి సీట్లు కేటాయించే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నందున ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేమని.. ఎన్నికలకు ముందే కలిసి పని చేస్తామా లేదా అన్నదానిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.