బెజవాడ కేశినేని బ్రదర్స్ వివాదం పతాక స్దాయికి చేరింది. తన సోదరుడి పైనే కేశినేని శ్రీనివాస్ (కేశినేని నాని) తీవ్ర స్దాయిలో వ్యాఖ్యలు చేశారు. చచ్చినా తన సోదరుడికి మద్దతు ఇవ్వనని అన్నారు. అంత అగాధం ఇద్దరి మద్య ఎందుకు వచ్చిందనే అంశం ఇప్పుడు పార్టిలో చర్చ జరుగుతుంది.


ఆది నుండి వివాదమే..
కేశినేని సోదరుల మద్య ఆది నుండి వివాదమే నడుస్తోంది. కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని, ప్రస్తుతం బెజవాడ టీడీపీ ఎంపీగా పని చేస్తున్నారు. బెజవాడలో పూర్తిగా వైసీపీ గాలి వీచినప్పటికి, ఎంపీగా మాత్రం కేశినేని నాని విజయం సాదించారు. ఇది టీడీపీకి కాస్త ఊరటనిచ్చిన అంశం. అయితే ఈ సంతోషం బెజవాడ టీడీపీలో ఎంతో సేపు నిలవలేదు. ఎంపీగా కేశినేని నాని విజయం కోసం అహర్నిశలు పని చేసిన ఆయన సోదరుడు, నానికి వ్యతిరేకంగా బయటకు వచ్చి పని చేయటం కలకలం రేపుతోంది. ఈ వ్యవహరం ఇప్పటిది కాదు. తన పార్లమెంట్ స్టిక్కర్ ను వేసుకొని దుర్వినియోగం చేస్తున్నారంటూ, ఎకంగా కేశినేని నాని తన సోదరుడు కేశినేని చిన్ని పైనే పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తీవ్ర కలకం రేపింది. తన అనుమతి లేకుండా, తనకు పార్లమెంట్ అధికారులు కేటాయించిన కారు స్టిక్కర్ ను ఫోర్జరీ చేసి వాడుకుంటున్నారని, పోలీసులకు ఎంపీ నాని ఫిర్యాదు చేయటంతో పోలీసులు విచారణ కూడా చేపట్టారు. దీంతో ఈ ఇద్దరి అన్నదమ్ముల వ్యవహరం వెలుగు లోకి వచ్చింది.


ఇద్దరి మద్య ఎందుకంత వివాదం..
కేశినేని బ్రదర్స్ మధ్య ఇంత స్దాయిలో విభేదాలు ఎందుకు వచ్చాయనే అంశంపైనే చర్చ జరుగుతుంది. ఎంపీ కేశినేని నాని తన కుమార్తె వివాహం చేసినప్పటికి ఆ కార్యక్రమానికి కూడ కేశినేని చిన్నిని ఆహ్వనించలేదు. రాజకీయంగా విభేదాలు ఉంటే, వాటిని ఇంటి బయటే పెట్టి పని చేసే నాయకులు ఉంటారు. కాని రాజకీయంగా వచ్చిన విభేదాలు నేపథ్యంలో కుటుంబ కార్యక్రమాలకు కూడా చిన్నిని నాని కుటుంబం ఆహ్వానించలేదు. అంటే ఇద్దరి మధ్య విభేదాలు ఏ స్దాయిలో ఉన్నాయో అర్దం అవుతుంది.


తన అధికారాన్ని అడ్డం పెట్టుకున్నాడని కోపమేనా..
ఎంపీగా కేశినేని నాని పని చేస్తున్న సమయంలో ఆయన సోదరుడు కేశినేని చిన్ని చేసిన పనులు నానికి నచ్చలేదంటున్నారు. కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వకుండా కేశినేని చిన్ని పలు వివాదాల్లో జోక్యం చేసుకోవటం, అందుకు కేశినేని నాని పేరును వాడుకోవటంపై నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. అయితే ఇదే సమయంలో కేశినేని చిన్ని కూడ కేశినేని నానిని ధిక్కరించే విధంగా మాట్లాడారట! నీ విజయం కోసం పని చేసిన సమయంలో అన్ని నీకు చెప్పి చేశానా అంటూ కేశినేని చిన్ని నానిని నిలదీశారని పార్టీ వర్గాల్లో టాక్. 


అంతేకాదు హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ సెటిల్ మెంట్లు, చేయటం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పలు ప్రైవేట్ సెటిల్ మెంట్లు చేసిన వివాదాలు పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడ పోలీసులపై కూడా ఒత్తిడి తీసుకువచ్చిన ఘటనలు కొన్ని ఎంపీ కేశినేని చిన్నికి ఆలస్యంగా తెలిశాయంటున్నారు. అంతేకాదు తనను పార్టీలో వ్యతిరేకించిన బుద్దా వెంకన్న వర్గాన్ని కేశినేని చిన్ని వెనకేసుకురావటం కూడా నానికి మింగుడుపడని అంశంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముక్కు సూటిగా వ్యవహరించే కేశినేని నాని తనకు వ్యతిరేకంగా వ్యవహరించి, తన పేరును దుర్వినియోగం చేసిన చిన్నిని పక్కన పెట్టారని అంటున్నారు.